● వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాదరెడ్డి
దర్శి (కురిచేడు): 2025 డీఎస్సీ పరీక్షల నిర్వహణ, ఫలితాల విడుదల, రిజర్వేషన్ల ఖరారు, ఉద్యోగాల భర్తీలో జరిగిన అవినీతి అక్రమాలపై సీబీఐ విచారణ జరపాలని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి శివప్రసాదరెడ్డి డిమాండ్ చేశారు. దగా డీఎస్సీపై దర్శిలోని తహసీల్దార్ కార్యాలయం వద్ద వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన రిలే నిరాహార దీక్షలో జెడ్పీ చైర్‌పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ, నాయకులతో కలిసి శివప్రసాదరెడ్డి పాల్గొన్నారు. వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో హాజరై డీఎస్సీ అవకతవకలకు మంత్రి లోకేష్ బాధ్యత వహించి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా బూచేపల్లి శివప్రసాదరెడ్డి మాట్లాడుతూ గత ఎన్నికల సందర్భంగా చంద్రబాబు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలన్నారు. 20 లక్షల మందికి ఉద్యోగాలిస్తామని, ఉద్యోగాలు ఇవ్వకపోతే నిరుద్యోగులకు ఒక్కొక్కరికి రూ.3 వేల చొప్పున నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లయినా ఇవ్వకుండా నిరుద్యోగులను మోసం చేశారని విమర్శించారు. అంతేగాకుండా ఎస్సీ, ఎస్టీ, బీసీ, బడుగు, బలహీనవర్గాల విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ ఇవ్వకుండా రూ.1,500 కోట్ల బకాయి ఉన్నారన్నారు. వారందరూ ఫీజులు చెల్లించలేక, విద్యాదీవెన, వసతి దీవెన పథకం నిధులు అందక ఇబ్బందులు పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. వెంటనే ఆ నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ప్రతి పేద విద్యార్థి ఉన్నత చదువులు చదివి ఇంజినీర్లు, డాక్టర్లు కావాలని కలలు కని గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో ఆనాటి సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఫీజు రీయింబర్స్‌మెంట్, వసతి దీవెన, విద్యాదీవెన పథకాల ద్వారా నగదు అందించిన విషయాన్ని గుర్తుచేశారు. కరోనా కష్టకాలంలో కూడా ఎక్కడా విద్యార్థులు ఇబ్బంది పడకుండా ఆయా పథకాలు అమలు చేశారని తెలిపారు. కానీ, కూటమి ప్రభుత్వంలో డీఎస్సీ పరీక్షలలో చంద్రబాబు, లోకేష్ అనుయాయులకు ఉద్యోగాలు దోచిపెట్టేందుకు 2 శాతం ఉన్న స్పోర్ట్స్ కోటాను 4 శాతానికి పెంచి వారికిష్టం వచ్చిన వారు పరీక్షలు రాసినా..రాయకపోయినా, పాసైనా..కాకపోయినా స్పోర్ట్స్ సర్టిఫికెట్లు అమ్ముకుని ఆ కోటాలో ఉద్యోగాలిచ్చి ఒక్కో పోస్టుకు రూ.10 లక్షల నుంచి రూ.15 లక్షల వరకు అమ్ముకున్నారని బూచేపల్లి విమర్శించారు. చంద్రబాబు, లోకేష్‌కు చిత్తశుద్ధి ఉంటే డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణ జరిపి తమ నిజాయితీ నిరూపించుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ దర్శి మండల కన్వీనర్ వెన్నపూస వెంకటరెడ్డి, వైస్ ఎంపీపీ సోము దుర్గారెడ్డి, రాష్ట్ర క్రిస్టియన్ మైనార్టీ సెల్ కార్యదర్శి గుంటు పోలయ్య, జిల్లా వాణిజ్య విభాగం అధ్యక్షుడు కొల్లా విజయభాస్కర్, జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షుడు ఎం.దేవప్రసాదు, నియోజకవర్గ యూత్ అధ్యక్షుడు ఇరుగుల శ్రీనివాసరెడ్డి, వైఎస్సార్ టీయూసీ అధ్యక్షుడు బొమ్మిరెడ్డి లక్ష్మిరెడ్డి, కేవీ రెడ్డి, పోశం మధుసూదనరెడ్డి, సానికొమ్ము తిరుపతిరెడ్డి, 8, 1, 5 వార్డుల కౌన్సిలర్లు మోహనరెడ్డి, బాబు, దర్శి మండల యూత్ అధ్యక్షుడు బాలకృష్ణారెడ్డి, బిజ్జం శ్రీనివాసరెడ్డి, పార్టీ మండల నాయకులు, కార్యకర్తలు, విద్యార్థులు, యువకులు పాల్గొన్నారు.


