రక్తమోడిన రహదారి | - | Sakshi
Sakshi News home page

రక్తమోడిన రహదారి

Aug 6 2026 1:09 AM | Updated on Aug 6 2026 1:09 AM

హనుమంతునిపాడు: కంభం–కనిగిరి రహదారిపై హనుమంతునిపాటు మండల పరిధిలోని హాజీపురం అడ్డరోడ్డు వద్ద బుధవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా వెళ్తున్న రెండు ఆటోలు ఎదురెదురుగా ఢీకొనడంతో ఒకరు ప్రాణాలు కోల్పోగా, ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాద సమయంలో ప్యాసింజర్‌ ఆటోలో సుమారు 10 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కనిగిరికి చెందిన గాయత్రి పాల ఆటో పాలు పోసి హాజీపురం వైపు నుంచి కనిగిరి వస్తోంది. అదే సమయంలో కనిగిరి నుంచి గుడిపాటిపల్లి వైపు వెళ్తున్న ప్యాసింజర్‌ ఆటో హాజీపురం అడ్డరోడ్డు క్రాసింగ్‌ వద్దకు రాగానే, ఈ రెండు వాహనాలు బలంగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో బీహార్‌ రాష్ట్రానికి చెందిన రామ్‌ లఖన్‌ సాహా అనే యువకుడు దుర్మరణం చెందాడు. చీమకుర్తిలో ఉంటున్న అతను దాసళ్లపల్లి గ్రామంలోని రైతు రాయి మొరలి వద్ద డోజర్‌ మెకానిక్‌, పొక్లెయిన్‌ ఆపరేటర్‌గా పనిచేసేందుకు ప్యాసింజర్‌ ఆటోలో వెళ్తున్నాడు. ప్రమాద ధాటికి లఖన్‌ సాహా కాలు పూర్తిగా తెగిపోయి పాల ఆటో ట్రాలీకి వేలాడింది. తీవ్ర రక్తస్రావం కావడంతో ఆయన కోమాలోకి వెళ్లాడు. అతడిని 108 వాహనంలో కనిగిరి ప్రభుత్వ వైద్యశాలకు తరలించి, ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం ఒంగోలు ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో సాయంత్రం 6 గంటల సమయంలో మృతి చెందినట్లు ఎస్సై రాజ్‌కుమార్‌ వెల్లడించారు.

క్షతగాత్రులు వీరే..

ఈ ప్రమాదంలో చిన్నమల్లవరం గ్రామానికి చెందిన కోనంకి నాగేశ్‌, గుడిపాటిపల్లికి చెందిన కొండెపోగు సుదీప్‌, కొండెపోగు మిరియమ్మ, సందీప్‌, రాముకు చేతులు, కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. దాసళ్లపల్లికి చెందిన చింతపూడి లక్ష్మి, పి.వెంకటేశ్వర్లు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. క్షతగాత్రులందరినీ 108 వాహనం ద్వారా కనిగిరి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి వైద్య సేవలు అందిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ముమ్మరం చేసినట్లు ఎస్సై రాజ్‌కుమార్‌ తెలిపారు.

హాజీపురం అడ్డరోడ్డు వద్ద పాల ఆటో,

ప్యాసింజర్‌ ఆటోల ఢీ

ప్రమాదంలో బీహార్‌కు చెందిన పొక్లెయిన్‌

ఆపరేటర్‌ మృతి

మరో ఐదుగురు ప్రయాణికులకు తీవ్ర గాయాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement