● ఆధారాలు సేకరించిన ఆర్‌ఎఫ్‌ఎస్‌ఎల్ టీమ్
ఉలవపాడు: మండలంలోని చాగల్లులో సోమవారం రాత్రి జరిగిన మెండా కోటయ్య హత్య కేసు దర్యాప్తును పోలీసులు ముమ్మరం చేశారు. మంగళవారం గుంటూరు నుంచి వచ్చిన ఆర్‌ఎఫ్‌ఎస్‌ఎల్ ఫోరెన్సిక్ బృందం కందుకూరు సీఐ అన్వర్ బాషా, ఎస్‌ఐ సుబ్బారావు సమక్షంలో ఘటనా స్థలాన్ని పరిశీలించింది. రక్తపు మరకలు, అడుగుజాడలను సేకరించింది. మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా, పాతకక్షలు భగ్గుమనకుండా ముందస్తుగా పోలీస్ పికెట్ ఏర్పాటు చేశారు. అదుపులో ఉన్న నిందితుడు అభిలాష్‌ను కోర్టులో హాజరుపరచనున్నట్లు పోలీసులు వెల్లడించారు.
● పరిశ్రమల యజమానులతో కలెక్టర్ రాజాబాబు
మద్దిపాడు: యువతలో నైపుణ్యాభివృద్ధికి ఫ్యాక్టరీల యాజమాన్యాలు సహకరించి, తగిన శిక్షణ ఇప్పించేందుకు ముందుకు రావాలని కలెక్టర్ రాజాబాబు కోరారు. బుధవారం మండల పరిధిలోని గుండ్లాపల్లి గ్రోత్ సెంటర్‌లో పలు ఫ్యాక్టరీలను ఆయన పరిశీలించారు. అనంతరం ఏపీఐఐసీ కార్యాలయంలో పారిశ్రామికవేత్తలతో సమావేశమయ్యారు. కలెక్టర్ మాట్లాడుతూ.. అర్హత ఉన్న వారికి ఉపాధి కల్పించాలని, నైపుణ్య శిక్షణ సంస్థల ద్వారా కామన్ ప్లాట్‌ఫాంలు ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. పారిశ్రామికవేత్తలు ప్రస్తావించిన స్ట్రీట్ లైట్లు, డ్రైనేజీ, తాగునీరు, పోలీస్ పెట్రోలింగ్ సమస్యల పరిష్కారానికి కమిటీ వేస్తామన్నారు. ఇండస్ట్రియల్ లోకల్ అథారిటీ ఏర్పాటు, గ్రీనరీ పెంపు, సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ ఏర్పాటుకు కృషి చేస్తామన్నారు. అంతకుముందు.. ఏపీఐఐసీకి వెళ్లే దారిలో హైవేపై లీకై న పైప్‌లైన్‌ను కలెక్టర్ పరిశీలించారు. హైవే అధికారుల అనుమతితో పైపులు మారుస్తామని ఆర్‌డబ్ల్యూఎస్ ఎస్‌ఈ బీవీ నాగేశ్వరరావు తెలపగా.. హైవే అధికారులతో తాను మాట్లాడతానని కలెక్టర్ చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా పారిశ్రామిక అధికారి శ్రీనివాసరావు, ఏపీఐఐడీసీ ఎస్‌ఎం మదన్‌మోహన్, ఆర్‌డీఓ చంద్రశేఖరనాయుడు, డీపీఓ అనుపమ, కార్మిక శాఖ అధికారి గౌస్‌బాషా, పలువురు పారిశ్రామిక వేత్తలు అధికారులు పాల్గొన్నారు.


