సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి అనుమానాస్పద మృతి | - | Sakshi
Sakshi News home page

సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి అనుమానాస్పద మృతి

Aug 6 2026 1:09 AM | Updated on Aug 6 2026 1:09 AM

సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి అనుమానాస్పద మృతి

ముండ్లమూరు: మండలంలోని పెద్ద ఉల్లగల్లు గ్రామానికి చెందిన సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి మోతుకూరి వంశీకృష్ణ(27) అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. అతడి ఒంటిపై పలుచోట్ల గాయాలు ఉండటంతో ఈ మృతిపై అనుమానాలు వ్యక్తం చేస్తూ మృతుడి తల్లి పద్మావతి బుధవారం స్థానిక పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. వివరాల్లోకి వెళితే.. సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిగా పనిచేస్తున్న వంశీకృష్ణ గత కొంతకాలంగా మానసిక స్థితి సరిలేక సతమతమవుతున్నాడు. దీంతో కుటుంబ సభ్యులు వైజాగ్‌లోని ఆస్పత్రిలో చేర్పించి వైద్యం అందించారు. ఇటీవల స్వగ్రామం ఉల్లగల్లుకు చేరుకున్నాడు. ఈ క్రమంలో మంగళవారం రాత్రి హైదరాబాద్‌ వెళ్తున్నానని చెప్పి అద్దంకి డిపోకు చెందిన బస్సు ఎక్కి కండక్టర్‌తో గొడవ పడ్డాడు. దీంతో కండక్టర్‌ బస్సును ముండ్లమూరు పోలీస్‌ స్టేషన్‌ వద్దకు తీసుకెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అంతలోనే వంశీకృష్ణ బస్సు అద్దాలు పగలగొట్టి, వైర్లు పీకేశాడు. దీంతో పోలీసులు వంశీకృష్ణను అదుపులోకి తీసుకుని స్టేషన్‌లో ఉంచి, తల్లిదండ్రులకు సమాచారం అందించారు. తండ్రి సుబ్బారావు, కొందరు బంధువులు కలిసి బాడుగ కారులో వంశీకృష్ణను వైజాగ్‌ ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు బయలుదేరారు. అయితే, మార్గమధ్యంలో మంగళగిరి సమీపానికి చేరుకోగానే వంశీకృష్ణ మృతి చెందినట్లు తండ్రి సుబ్బారావు.. తన భార్య పద్మావతికి, బావమరిది సురేష్‌కు సమాచారం ఇచ్చారు.

మృతిపై అనుమానాలు

బుధవారం మృతదేహాన్ని ఉల్లగల్లుకు తీసుకురాగా.. వంశీకృష్ణ మెడ, ఒంటిపై పలుచోట్ల గాయాలు ఉండటాన్ని తల్లి పద్మావతి గమనించారు. తన కుమారుడి మృతిపై అనుమానం ఉందంటూ ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. తండ్రి సుబ్బారావు, బంధువులతో పాటు పోలీసులపైనా తమకు అనుమానాలు ఉన్నాయని మేనమామ సురేష్‌ ఆరోపించారు. తల్లి పద్మావతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పి.కోటేశ్వరరావు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ముందుగా దర్శి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా.. అక్కడ చేస్తే తమకు న్యాయం జరగదని, ఒంగోలు జీజీహెచ్‌లో పోస్టుమార్టం చేయాలని మేనమామ, బంధువులు పట్టుబట్టారు. దీంతో మృతదేహాన్ని ఒంగోలుకు తరలించారు. పోస్టుమార్టం నివేదిక వస్తే మృతికి గల కారణాలు తెలిసే అవకాశం ఉంది.

కొన్నాళ్లుగా మానసిక సమస్యలతో

బాధపడుతున్న వంశీకృష్ణ

మంగళవారం రాత్రి బస్సులో వీరంగం

సృష్టించడంతో పోలీసులకు అప్పగింత

తండ్రి ఆధ్వర్యంలో వైజాగ్‌ ఆస్పత్రికి

తీసుకెళ్తుండగా మార్గమధ్యంలో మృతి

మృతుడి శరీరంపై గాయాలు..

భర్త, పోలీసులపై తల్లి, మేనమామల అనుమానం

బంధువుల డిమాండ్‌తో ఒంగోలు

జీజీహెచ్‌లో పోస్టుమార్టం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement