‘ఇన్‌ ప్రాసెస్‌’తో కాలయాపన చేయొద్దు | - | Sakshi
Sakshi News home page

‘ఇన్‌ ప్రాసెస్‌’తో కాలయాపన చేయొద్దు

Aug 4 2026 1:53 AM | Updated on Aug 4 2026 1:53 AM

ఒంగోలు సబర్బన్‌: ప్రజా సమస్యల పరిష్కారంలో ‘ఇన్‌ ప్రాసెస్‌’ (ప్రగతిలో ఉంది) అంటూ కాలయాపన చేసే ధోరణిని ఇకపై ఎంతమాత్రం సహించేది లేదని కలెక్టర్‌ పి.రాజాబాబు అధికారులను హెచ్చరించారు. సోమవారం స్థానిక కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ఆయన జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజల నుంచి 332 వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ.. అర్జీలను కేవలం ఆన్‌లైన్‌ రికార్డుల కోసం మమ అనిపించకుండా, నియమనిబంధనలకు లోబడి క్షుణ్ణంగా చదివి, బాధితులకు సంతృప్తికరమైన, శాశ్వత పరిష్కారం చూపేలా క్షేత్రస్థాయి అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలన్నారు. అధికారుల వద్ద పెండింగ్‌లో ఉన్న ‘ఇన్‌ ప్రాసెస్‌’ కేసుల సంఖ్యను తక్షణమే తగ్గించాలని ఆదేశించారు. ఆగస్టు 15 తర్వాత ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలుపై ప్రజల నుంచి నేరుగా అభిప్రాయాలు తీసుకుంటామని, దీనిపై త్వరలోనే అధికారులతో చర్చిస్తామని వెల్లడించారు. కార్యక్రమంలో డీఆర్‌ఓ వెంకటరమణ, జెడ్పీ సీఈఓ చిరంజీవి, విపత్తుల నిర్వహణ సంస్థ అధికారి మాధురి, బీసీ కార్పొరేషన్‌ ఈడీ వెంకటేశ్వరరావు, స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌ పద్మలతతో పాటు వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు.

డ్రైనేజీ ప్రమాదం నుంచి కాపాడండి

చెరువుకొమ్ముపాలెం గ్రామంలోని కొత్తపాలెం ఎస్సీ కాలనీలో నూతనంగా నిర్మించిన భారీ డ్రైనేజీ కాలువ తమ పాలిట శాపంగా మారిందని ఆ కాలనీవాసులు కలెక్టర్‌ ఎదుట వాపోయారు. ఈ మేరకు రెబ్బవరపు రాజుతో పాటు సుమారు 40 మంది గ్రామస్తులు ‘మీ కోసం’కు వచ్చి తమ కష్టాలను ఏకరువు పెట్టారు. ఆరడుగుల లోతు, నాలుగడుగుల వెడల్పుతో నిర్మించిన కాలువకు స్లాబ్‌ వేయకుండా వదిలేయడంతో.. గత నాలుగు నెలల వ్యవధిలో పది మందికి పైగా చిన్నారులు అందులో పడి తీవ్ర గాయాలపాలయ్యారని వివరించారు. ఐదు రోజుల క్రితం రెబ్బవరపు రాజ్‌కుమార్‌ కాలుజారి పడటంతో కాలు విరిగి మంచాన పడ్డాడని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై సోమవారం ‘సాక్షి’ దినపత్రికలో ప్రచురితమైన ‘అధికారం ఉందని అడ్డగోలుగా నిర్మిస్తారా’ కథనాన్ని కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్లారు. సదరు కథనాన్ని తాను చదివానని చెప్పిన కలెక్టర్‌.. తక్షణమే సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అక్కడే ఉన్న ఒంగోలు నగర పాలక సంస్థ కమిషనర్‌ వెంకట కృష్ణయ్యను పిలిచి, వెంటనే గ్రామానికి వెళ్లి పరిస్థితిని సమీక్షించి సమస్యను పరిష్కరించాలని ఆదేశించారు.

కరేడులో దేవాదాయ భూముల అన్యాక్రాంతం

ఉలవపాడు మండలం కరేడు గ్రామంలో దేవాదాయ శాఖ భూములు అన్యాక్రాంతం అవుతున్నాయని అదే గ్రామానికి చెందిన దగ్గుమాటి సుబ్బరామిరెడ్డి కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. కరేడులోని చెన్నకేశవ స్వామి, లక్ష్మీపతి స్వామి దేవస్థానాలకు సర్వే నంబర్‌ 826/1 తదితర సర్వే నంబర్లలో 20.60 ఎకరాల భూమి ఉందన్నారు. ఇందులో సుమారు 14 ఎకరాలను ఎలాంటి అనుమతులు, వేలం పాట లేకుండానే గ్రామానికి చెందిన నల్లపరెడ్డి ఈశ్వరరెడ్డి, అల్చూరి కోటిరెడ్డి, రామాల కృష్ణారెడ్డి ఆక్రమించి పది రోజుల క్రితం జామాయిల్‌ నాటారని ఫిర్యాదులో పేర్కొన్నారు. దేవాదాయ శాఖ ఈఓతో కుమ్మకై ్క వారు ఈ దారుణానికి పాల్పడ్డారని, ఇదే విషయమై ఈఓను ప్రశ్నిస్తే ‘మీకు చేతనైంది చేసుకోండి’ అంటూ దురుసుగా సమాధానం ఇచ్చారని ఆరోపించారు. దేవస్థాన భూముల్లో అవకతవకలు జరిగాయని, తక్షణమే విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌కు విజ్ఞప్తి చేశారు.

అర్జీల పరిష్కారంలో నిర్లక్ష్యం వహిస్తే సహించం

‘మీ కోసం’లో అధికారులకు కలెక్టర్‌ రాజాబాబు హెచ్చరిక

గ్రీవెన్స్‌లో 332 వినతుల స్వీకరణ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement