ఒంగోలు సబర్బన్: స్థానిక పోలీస్ పెరేడ్ గ్రౌండ్‌లో ఆగస్టు 15న నిర్వహించే 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను దేశభక్తి ఇనుమడించేలా ఘనంగా నిర్వహించాలని కలెక్టర్ పి.రాజాబాబు సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో ఎస్పీ వి.హర్షవర్ధన్‌రాజుతో కలిసి ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. దేశ సంస్కృతీ సంప్రదాయాలు ఉట్టిపడేలా వేడుకలు ఉండాలన్నారు. పాఠశాల విద్యార్థుల చేత దేశభక్తి, మత సౌభ్రాతృత్వం, సామరస్యం ప్రతిబింబించేలా సాంస్కృతిక ప్రదర్శనలు ఏర్పాటు చేయాలని సూచించారు. ఏర్పాట్లను ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు అధికారులతో ఒక కమిటీని వేయాలని జిల్లా రెవెన్యూ అధికారి (డీఆర్వో)ని ఆదేశించారు. ప్రొటోకాల్ నిబంధనలు పాటిస్తూ వీఐపీ గ్యాలరీ, వేదిక (డయాస్) ఏర్పాట్లు ముందస్తుగానే పూర్తి చేయాలన్నారు. ఎస్పీ హర్షవర్ధన్‌రాజు మాట్లాడుతూ.. స్వాతంత్య్ర వేడుకల కోసం పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామన్నారు. డయాస్ చుట్టూ అనవసరమైన రాకపోకలను నిషేధిస్తామని తెలిపారు. దేశభక్తిని చాటిచెప్పే విధంగా పోలీసు శాఖ ఆధ్వర్యంలో కవాతు, ఆకర్షణీయమైన పోలీస్ బ్యాండ్ ఏర్పాటు చేయనున్నట్లు వివరించారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ కల్పనాకుమారి, కందుకూరు సబ్ కలెక్టర్ హిమవంశి, డివిజనల్ అధికారులు, జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు.
కందుకూరు రూరల్: మండలంలోని పలుకూరు గ్రామంలో డెంగీ కేసు నమోదైంది. ఇటీవల జ్వరంతో కందుకూరులోని ఓ ప్రైవేటు వైద్యశాలలో చికిత్స పొందుతున్న వ్యక్తికి డెంగీ నిర్ధారణ అయింది. దీంతో మెరుగైన వైద్యం కోసం ఒంగోలు తీసుకెళ్లినట్లు బంధువులు తెలిపారు. ప్రస్తుతం వర్షాలు పడుతుండడంతో పారిశుధ్యం అధ్వానంగా తయారై డెంగీ కేసులు నమోదవుతున్నాయి.
కందుకూరు: పట్టణంలో సోమవారం ఓ పిచ్చికుక్క స్వైర విహారం చేసింది. దారిన పోయే వారిని వెంటబడి మరీ కరవడంతో పది మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. ఓవీ రోడ్డులోని పాత స్టేట్ బ్యాంక్ సమీపంలో పాఠశాల నుంచి వస్తున్న ఆషీర్ అనే చిన్నారిపై పిచ్చికుక్క దాడి చేయగా, స్థానికులు వెంటనే స్పందించి కాపాడారు. అదే సమయంలో అటుగా వెళ్తున్న మరికొందరినీ ఆ కుక్క కరిచింది. గాయపడిన సుమారు 15 మంది బాధితులు ఏరియా ఆస్పత్రికి పరుగులు తీశారు. వైద్యులు వారికి యాంటీ రేబిస్ ఇంజెక్షన్లు ఇచ్చి చికిత్స అందించారు. పట్టణంలోని ప్రతి వీధిలో పదుల సంఖ్యలో వీధికుక్కలు గుంపులుగా తిరుగుతున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వాటి భయంతో బయటకు రావాలంటేనే బెంబేలెత్తిపోతున్నామన్నారు. మున్సిపల్ అధికారులు తక్షణమే స్పందించి వీధి కుక్కల బెడద నుంచి తమను కాపాడాలని పట్టణ ప్రజలు వేడుకుంటున్నారు.


