న్యూస్‌రీల్
ఇంజినీరింగ్‌శాఖగా మారిన అటవీశాఖ
గిద్దలూరు అటవీశాఖ పరిధిలోని అభయారణ్యంలో వేటగాళ్లు, అటవీ సంపదను కొల్లగొట్టే అక్రమార్కుల అడుగులు పడుతుండటంతో అలజడి ఎక్కువైంది. రెండు నెలల వ్యవధిలోనే నాలుగు పులులు మృత్యువాత పడటం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. అభయారణ్యంలోకి ఇతరులు ప్రవేశించేందుకు అటవీశాఖలోని ఇంటి దొంగల ప్రమేయం ఉందనే ఆరోపణలు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి.
● నల్లమల అభయారణ్యంలో అలజడి ● 2 నెలల వ్యవధిలో నాలుగు పులులు మృత్యువాత ● అడవిలో అనుమతులు లేని అడుగులు ● అటవీశాఖలో ఇంటి దొంగలు ఎవరు?
గిద్దలూరు రూరల్:
దేశంలోనే అతిపెద్ద టైగర్ జోన్‌గా పేరుగాంచిన నాగార్జున సాగర్ టైగర్ రిజర్వ్ పరిధిలో మార్కాపురం, ఆత్మకూరు, గిద్దలూరు, నంద్యాల అటవీశాఖ డివిజన్‌లు కలిసి 3,800 హెక్టార్లలో దట్టమైన అటవీ ప్రాంతం ఉంది. విశాలమైన అటవీ ప్రాంతంలో కలప, వెదురు నరికే వారి గొడ్డలి చప్పుళ్లతో పాటుగా వేటగాళ్ల తుపాకీ శబ్దాలకు వన్యప్రాణులు బిక్కు బిక్కు మంటున్నాయి. గడిచిన రెండు నెలల వ్యవధిలో ఆత్మకూరు నాగలూటి వద్ద ఒకటి, నంద్యాల డివిజన్ గుండ్లబ్రహ్మేశ్వరంలో ఒకటి, చలమ దిగువమెట్ట మధ్యలో రైల్వేట్రాక్ పై ఒకటి, రాచర్ల బీటు పరిధిలో ఒకటి మొత్తం నాలుగు పులులు మృత్యువాతపడ్డాయి. నల్లమలలో 80కిపైగా వరకు పులులు ఉండవచ్చని అటవీ శాఖాధికారుల అంచనా. 2022 నుంచి 2026 వరకు గుండ్లకమ్మ రేంజి పరిధిలో దుప్పి, జింక, ఉడుము, కణతి, నెమలి, అడవి పందులు, వంటి ఇతర వన్యప్రాణులను వేటాడిన కేసులు 50 కి పైగా నమోదయ్యాయని సమాచారం. వేటగాళ్ల చేతిలో గాయపడిన వన్యప్రాణులకు అటవీశాఖ అధికారులు చికిత్స అందించి సురక్షితంగా అభయారణ్యంలో వదిలిన సంఘటనలు అనేకం జరిగాయి. అటవీశాఖ వారి అనుమతులు లేనిదే అభయారణ్యంలో బయటివారు ఎలా అడుగు పెట్టగలుగుతున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
గిద్దలూరు డివిజన్‌లోని రాచర్ల బీటులో పెద్దపులి మరణించడం అటవీశాఖను ఉలిక్కిపడేలా చేసింది. గత నెల 31వ తేదీన అంబచెరువు, తట్టేమడుగు పరిసర ప్రాంతాల్లో లోతువాగులో పెద్దపులి కళేబరం కనిపించింది. అప్పటికి మరణించి 15 రోజులై ఉంటుందని భావిస్తున్నారు. ఇన్నిరోజులు ఒక పులి చనిపోయిన విషయం ఎందుకు బయటకు రాలేదు? కింది స్థాయి ఉద్యోగుల గస్తీ లేకపోవడమా.. ఉన్నతాధికారుల పర్యవేక్షణ కొరవడిందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పులిని వేటగాళ్లు చంపారా లేదా సహజమరణమా, అభయారణ్యంలో చనిపోయిన పులి వద్దకు ఎవరు వెళ్లారు, గోర్లు తీసే సమయం లేక పులి నాలుగు కాళ్లను నరికి ఎవరు తీసుకెళ్లారు అనే ప్రశ్నలకు సమాధానం ఇప్పటి వరకు రాలేదు. పులి మృతదేహం గుండ్లకమ్మ రేంజి రాచర్ల బీటులో లభ్యమైనా తురిమెళ్ల రేంజీలో చనిపోతే తమ సరిహద్దులో తీసుకొచ్చి వేశారనే విషయమై రెండు రేంజిల్లోని అటవీశాఖ అధికారులు వాదనలకు దిగుతున్నట్లు సమాచారం. రెండు రేంజిలకు సంబంధించిన సరిహద్దుల్లో పులి చనిపోవడం వారికి పెద్ద తలనొప్పిగా మారిందని తెలుస్తోంది.
గిద్దలూరు అటవీశాఖ పరిధిలో గుండ్లకమ్మరేంజి, తురిమెళ్లరేంజి, బేస్తవారిపేట రేంజి, గిద్దలూరు రేంజి, స్క్వాడ్ రేంజి, డీఈటీ రేంజీ, మొత్తం 6 రేంజీలు ఉన్నాయి. బేస్తవారిపేటకు రేంజర్ ఎం.వీరాస్వామి, గిద్దలూరుకు సత్యనారాయణరెడ్డి, తురిమెళ్లకు బి.మదుప్రియాంక మాత్రమే ఉన్నారు. గుండ్లకమ్మ, డీఈటీ రెండు రేంజీలకు వీరస్వామి అదనపు బాధ్యత వహిస్తున్నారు. స్క్వాడ్ రేంజికి అందులో ఉన్న డీఆర్‌ఓ శేషయ్యకు అదనపు బాధ్యతలు అప్పగించారు. గుండ్లకమ్మరేంజి ఆఫీసర్, డీఈటీ రేంజిలను సుమారు 50 కిలో మీటర్ల దూరంలో ఉన్న బేస్తవారిపేట రేంజి ఆఫీసర్‌కు అప్పగించి దగ్గరలో ఉన్న గిద్దలూరు రేంజీ ఆఫీసరు సత్యనారాయణరెడ్డికి అప్పగించకపోవడంలో ఆంతర్యం ఏమిటో అటవీశాఖ ఉన్నతాధికారులకే తెలియాలి.
అడవితో పాటుగా అడవిలోని వన్యప్రాణులను సంరక్షించాల్సిన అటవీశాఖ కేవలం అభయారణ్యంలో జరిగే చెక్‌డ్యామ్‌లు, బిల్డింగ్ పనులు, బేస్‌క్యాంపు నిర్మాణాలు, రోడ్డు వంటి ఇతర పనులకే ప్రాధాన్యత ఇస్తున్నారని తెలుస్తోంది. ఇంజినీరింగ్ సెక్షన్ పై ఎలాంటి అనుభవం లేని అటవీశాఖ ఉద్యోగులతో ఇటువంటి అన్ని పనులను వారే దగ్గర ఉండి పని చేయిస్తున్నారని తెలుస్తోంది. దీంతో ఆ వారి సమయం అంతా ఇటువంటి పనులకే పరిమితమైతే ఇక అడవితో పాటుగా వన్యప్రాణుల సంరక్షణను విస్మరించారు.


