డిగ్రీ ప్రవేశాల్లో జాప్యం ఆగస్టు వచ్చినా నోటిఫికేషన్ విడుదల చేయని ప్రభుత్వం ప్రైవేట్ కళాశాలల్లో చేరుతున్న విద్యార్థులు జిల్లాలో 4 ప్రభుత్వ, 29 ప్రైవేట్ డిగ్రీ కళాశాలలు కంభం, దోర్నాల ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు సొంతగూడు కరువు
విద్యావ్యవస్థలో సంస్కరణల సంగతి దేవుడెరుగు.. ఉన్న వ్యవస్థను సక్రమంగా నిర్వహించడంలో చంద్రబాబు ప్రభుత్వం ఘోరంగా విఫలమవుతోంది. ఇప్పటికే పాఠశాల విద్యను భ్రష్టు పట్టించిన ప్రభుత్వం ఉన్నత విద్యా వ్యవస్థనూ గాడితప్పిస్తోంది. ప్రైవేటు, కార్పొరేట్ విద్యాసంస్థలకు లబ్ధిచేకూర్చేలా ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల చేయడంలో తీవ్ర జాప్యం చేస్తోంది. ఫలితంగా విద్యార్థులంతా గత్యంతరం లేక ప్రైవేటు కాలేజీల్లో చేరాల్సి వస్తోంది.
కంభం: రెండేళ్లుగా విద్యా వ్యవస్థ పతనావస్థలో ఉంది. చంద్రబాబు పాలనలో ప్రభుత్వ విద్యను పట్టించుకోకుండా ప్రైవేటు, కార్పొరేట్‌కు వంత పాడుతూ ప్రభుత్వ పాఠశాలలు, కాలేజీలు, యూనివర్సిటీలను నిర్వీర్యం చేశాడు. ఇంటర్మీడియెట్ ఫలితాలు విడుదలై నెలలు గడుస్తున్నా 2026–27 విద్యా సంవత్సరానికి సంబంధించి డిగ్రీ ప్రవేశాలకు ప్రభుత్వం నేటికీ నోటిఫికేషన్ ఇవ్వకపోవడంపై విద్యార్థుల్లో ఆందోళన నెలకొంది. ఇప్పటికే పలువురు విద్యార్థులు బీటెక్, ఇతర కోర్సుల్లో చేరిపోతుండగా డిగ్రీ చదువుకోవాలనుకునే విద్యార్థులకు ఎదురు చూపు తప్పడం లేదు. విద్యారంగంలో సంస్కరణలంటూ చంద్రబాబు ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటున్నా క్షేత్రస్థాయిలో అది ఆచరణకు నోచుకోకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
గతేడాది కూడా అడ్మిషన్‌లలో జాప్యమే..
గతేడాది (2025–26) కూడా చంద్రబాబు ప్రభుత్వం డిగ్రీ అడ్మిషన్ల నోటిఫికేషన్ విడుదల చేయడంతో తీవ్ర జాప్యం చేసింది. దీంతో డిగ్రీలో చాలా ఆలస్యంగా చేరాల్సి వచ్చింది. అడ్మిషన్లు ఆలస్యం కావడంతో తరగతులు ఆలస్యంగా ప్రారంభమై సిలబస్ పూర్తి చేయడానికి అధ్యాపకులు నానా తంటాలు పడాల్సి వచ్చింది. ఈ సారైనా అడ్మిషన్‌ల నోటిఫికేషన్ సకాలంలో విడుదలవుతుందనుకుంటే ఇంత వరకు నోటిఫికేషన్ ఇవ్వలేదు.
ప్రైవేట్ కళాశాలల్లో చేరుతున్న విద్యార్థులు..
ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు ప్రైవేటు కళాశాలలకు లబ్ధి చేకూరేలా ఉన్నాయని విద్యార్థి సంఘాల నాయకులు, కమ్యూనిస్టు నాయకులు చెబుతున్నారు. నోటిఫికేషన్ ఇచ్చి అడ్మిషన్లు పూర్తయిన తర్వాత ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో తరగతులు ప్రారంభమవుతాయి. చాలా ప్రైవేటు కళాశాలల్లో మాత్రం ఇప్పటికే విద్యార్థులను చేర్చుకొని తరగతులు ప్రారంభించేశారు. నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత వారి అడ్మిషన్‌లను ఆన్‌లైన్ చేసుకునేందుకు ఇప్పటికే విద్యార్థుల నుంచి అవసరమైన సర్టిఫికెట్లను తీసుకొని సిద్ధంగా ఉంచుకున్నారు. దీని వల్ల ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో చేరే విద్యార్థుల సంఖ్య గణనీయంగా తగ్గిపోనుంది.
ప్రభుత్వ డిగ్రీ కళాశాలలకు సొంతగూడు కరువు..
మార్కాపురం జిల్లాలో 29 ప్రైవేటు డిగ్రీ కళాశాలలుండగా 4 చోట్ల (యర్రగొండపాలెం, కనిగిరి, కంభం, దోర్నాల) ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు ఉన్నాయి. యర్రగొండపాలెం, కనిగిరి కళాశాలలకు సొంత భవనాలుండగా, కంభం, దోర్నాలలో ఇంటర్మీడియెట్ కళాశాలలోనే పైన ఉన్న గదుల్లో తరగతులు నిర్వహిస్తూ వస్తున్నారు.
2008 డిసెంబర్‌లో అప్పటి కంభం ఎమ్మెల్యే ఉడుముల శ్రీనివాసులు రెడ్డి కృషితో కంభంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల మంజూరు చేశారు. కళాశాల నిర్మాణానికి స్థలం లేకపోవడంతో ప్రభుత్వ జూనియర్ కళాశాలలోనే నిర్వహించేలా నిర్ణయం తీసుకొని తరగతులు జరపడం ప్రారంభించారు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో దోర్నాలలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల మంజూరైంది. కళాశాలలో సుమారు 150 మంది విద్యార్థులుండగా సొంత భవనం లేకపోవడంతో జూనియర్ కళాశాలలోనే పైన ఉన్న గదుల్లో డిగ్రీ తరగతులను బోధిస్తున్నారు. గతేడాది మార్కాపురం సబ్ కలెక్టర్, రెవెన్యూ అధికారులు కంభం ప్రభుత్వ జూనియర్ కళాశాలలోని మైదానంలో ఓ వైపున డిగ్రీ కళాశాల కోసం ఒక ఎకరా స్థలాన్ని పరిశీలించి మంజూరు కోసం ఉన్నతాధికారులకు నివేదికలు పంపించినా ఇంకా అమలుకు నోచుకోలేదు. దోర్నాలలో అధికారులు సొంత స్థలం కేటాయించడంలో జాప్యం వహిస్తున్నారు.
ఎఫ్‌ఆర్‌ఎస్‌పైనా సందిగ్ధం..
ఎఫ్‌ఆర్‌ఎస్ ద్వారా విద్యార్థుల హాజరు నిబంధన పెడుతుండటంతో కళాశాలల యాజమాన్యాలు సందిగ్ధంలో పడ్డాయి. ఫీజు రీయింబర్స్‌మెంట్ పైనే ఆధారపడి నిర్వహిస్తున్న కళాశాలలకు 80 శాతం హాజరుండాలనే నిబంధన మరింత తలనొప్పిగా మారనుంది. యాప్‌లు సక్రమంగా పనిచేయకపోవడం, ఫేస్‌లు సరిగా పడకపోవడం వంటి సమస్యలు తలెత్తుతున్నాయని పేర్కొంటున్నారు.


