● రాజగోపురం నిర్మాణానికి రూ.2 కోట్లు వ్యయం
అద్దంకి: మండలంలోనే ప్రముఖ పుణ్యక్షేత్రమైన శింగరకొండ ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానంలో రాజగోపురాల పునఃనిర్మాణ కార్యక్రమానికి దేవదాయ శాఖ అధికారులు శ్రీకారం చుట్టారు. రాజగోపుర నిర్మాణానికి ముందుకు వచ్చే దాతల నుంచి అంగీకార పత్రాలను దేవస్థాన అధికారులు తీసుకుంటారన్నారు. ఈ క్రమంలో వైఎస్సార్ సీపీ సీనియర్ నాయకుడు, మాజీ ఏఎంసీ చైర్మన్ వైవీ భద్రారెడ్డి, రాజ్యసభ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి తండ్రి వైవీ పోలిరెడ్డి గతంలో ఇదే క్షేత్రంలో పడమర రాజగోపురాన్ని కట్టించారు. దాని పునఃనిర్మాణంలో భాగంగా అదే రాజగోపురాన్ని మళ్లీ తామే కట్టించేందుకు ఆదివారం వైవీ భద్రారెడ్డి ఆలయ ఏసీ మదమంచి తిమ్మాయనాయుడికి అంగీకార పత్రం అందజేశారు.
కనిగిరిరూరల్: బేస్ బాల్ అసోసియేషన్ జిల్లా నూతన కార్యవర్గాన్ని ఆదివారం మండలంలోని కంచర్లవారిపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షునిగా మల్లెబోయిన మల్లికార్జున, కార్యదర్శిగా మద్దులూరి కొండలరావు, జాయింట్ సెక్రటరీగా పొట్టేండ్ల బసవయ్యలను ఎన్నుకున్నారు. కార్యక్రమంలో పాఠశాల హెచ్‌ఎం సీహెచ్ విజయ భాస్కర్‌రెడ్డి, డీఎస్‌ఏ అబ్జర్వర్ సుకుమార్, బేస్‌బాల్ స్టేట్ అసోసియేషన్ నుంచి అబ్జర్వర్ రాజేంద్రనాథ్, న్యాయవాది దెవేండ్ల బాలాజీ, పీఈటీలు హజరత్‌రెడ్డి, ప్రసాద్, నరసింహారావు తదితరులు పాల్గొన్నారు.
చీమకుర్తి: వర్షాలు కురవాలని, పశువులకు పశుగ్రాసం కావాలని యాదవ రాజుల కుటుంబాలు ఆదివారం చీమకుర్తిలోని పోలేరమ్మ తల్లికి పొంగళ్లు పెట్టి తమ మొక్కులు తీర్చుకున్నారు. ఇళ్ల వద్దే వారు పొంగళ్లు పెట్టుకొని మేళ తాళాలతో ఊరేగింపుగా అమ్మవారికి నైవేద్యం పెట్టి తమ మొక్కులను తీర్చుకున్నారు. అమ్మవారిని సుందరంగా నూతన పట్టు వస్త్రాలతో అలంకరించి తమ కోర్కెలను తీర్చాలని మొక్కుకున్నారు.


