అభివృద్ధి ప్రాజెక్టులను ప్రైవేటుపరం చేస్తే పోరాటం | - | Sakshi
Sakshi News home page

అభివృద్ధి ప్రాజెక్టులను ప్రైవేటుపరం చేస్తే పోరాటం

Aug 3 2026 3:57 AM | Updated on Aug 3 2026 3:57 AM

రైతులకు గిట్టుబాటు ధర కల్పించే వరకు అండగా వైఎస్సార్‌ సీపీ రాజ్యసభ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి

ఒంగోలు సిటీ: ఉత్తరాంధ్ర అభివృద్ధే లక్ష్యంగా గత వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వం పలు కీలక ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టిందని, వాటిని ప్రైవేట్‌ సంస్థలకు అప్పగించే ప్రయత్నాలను తమ పార్టీ వ్యతిరేకిస్తుందని రాజ్యసభ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి పేర్కొన్నారు. ఒంగోలులోని తన స్వగృహంలో ఆదివారం మీడియాతో మాట్లాడారు. గత ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి హయాంలో ఉత్తరాంధ్ర అభివృద్ధిలో భాగంగా భోగాపురం విమానాశ్రయ అభివృద్ధి పనులకు ప్రాధాన్యం ఇచ్చామని, అలాగే మత్స్యకారుల అభ్యున్నతి కోసం ఫిషింగ్‌ హార్బర్ల అభివృద్ధికి శ్రీకారం చుట్టామని వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. ప్రస్తుతం ఈ ప్రాజెక్టులను ప్రైవేట్‌ సంస్థలకు అప్పగించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోందని ఆయన ఆరోపించారు. ప్రజా ప్రయోజనాలకు విరుద్ధంగా అలాంటి నిర్ణయాలు తీసుకుంటే వైఎస్సార్‌ సీపీ ప్రజలతో కలిసి ఉద్యమిస్తుందని స్పష్టం చేశారు.

రైతుల తరఫున పోరాడతాం..

రాష్ట్రంలో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వైవీ సుబ్బారెడ్డి పేర్కొన్నారు. మామిడి, పొగాకు, అరటి, పత్తి, శనగ తదితర పంటలకు రైతులకు గిట్టుబాటు ధర లభించడం లేదని, ఉప్పు సాగు చేసే రైతులు కూడా ధరలు లేక తీవ్ర ఆందోళనలో ఉన్నారని అన్నారు. రైతుల పంటలకు న్యాయమైన ధరలు లభించే వరకు వైఎస్సార్‌సీపీ వారి తరఫున పోరాటం కొనసాగిస్తుందని వెల్లడించారు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో 2021లో పొగాకు రైతుల కోసం ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేసి, అవసరమైన సమయంలో ప్రభుత్వమే కొనుగోళ్లు చేపట్టి రైతులకు అండగా నిలిచిందని వైవీ సుబ్బారెడ్డి గుర్తు చేశారు. రైతు సంక్షేమమే తమ పార్టీ ప్రధాన లక్ష్యమని, రైతుల ప్రయోజనాల విషయంలో ఎలాంటి రాజీ ఉండదని తెలిపారు. పొగాకు రైతుల విషయాన్ని కేంద్ర ప్రభుత్వంతో తాము మాట్లాడతామన్నారు. ఈ మధ్యకాలంలో జీఎస్టీ తగ్గిస్తేనే ఈ వ్యాపారులు ముందుకు వచ్చే పరిస్థితి ఉందని, కేంద్రమంత్రులతో, పార్లమెంట్‌లో కూడా ఈ అంశం గురించి మాట్లాడతామన్నారు. వైవీ సుబ్బారెడ్డి వెంట మాజీ మంత్రి, సంతనూతలపాడు నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ మేరుగు నాగార్జున, ఒంగోలు నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ చుండూరి రవిబాబు, పీడీసీసీ బ్యాంకు మాజీ చైర్మన్‌ మాదాసి వెంకయ్య తదితరులు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement