అధికారం ఉందని
నీళ్లుంటే నా మనవడు బతికేవాడా...
డ్రైనేజీ కాలువలో నీళ్లు ఉండిఉంటే నా మనవడు బతికే వాడా అంటూ క్షతగాత్రుడు రాజ్‌కుమార్ నాయనమ్మ రత్తమ్మ బోరున విలపిస్తోంది. కాలువలో నీళ్లు లేవుకాబట్టి కాలు విరిగి ప్రాణాలు నిలబడ్డాయి. అదే నీళ్లు ఉండి జోరుగా పారుతుంటే ప్రాణాలు దక్కేవేనా అంటూ రోదించింది. విరిగిన కాలు కదపనీయట్లేదు. పట్టుకుంటే ఏడుస్తున్నాడు. రాత్రింబవళ్లూ నిద్ర లేకుండా పిల్లాడు అల్లాడిపోతున్నాడు.
– రెబ్బవరపు రత్తమ్మ,
రాజ్ కుమార్ నాయనమ్మ
ఎమ్మెల్యే వచ్చినప్పుడు
స్లాబు వేయమని వేడుకున్నాం.
ఎమ్మెల్యే దామచర్ల జనార్దన రావు గ్రామానికి వచ్చినప్పుడు డ్రైనేజీ కాలువ మీద స్లాబు వేయమని వేడుకున్నాం. పిల్లలు ఆడుకుంటూ కాలువలో పడి తీవ్రగాయాల పాలవుతున్నారని కూడా చెప్పాం. కానీ ఎమ్మెల్యే కూడా కనీసం పట్టించుకోలేదు. స్లాబు వేసి ఉంటే రెండో తరగతి విద్యార్థి రాజ్ కుమార్ పరిస్థితి ఇలా ఉండేది కాదు.
– మందా దీప, అమూల్య తల్లి..
ఒంగోలు సబర్బన్: అధికార పార్టీ నేతల ఆగడాలకు అడ్డూ అదుపు లేకుండా పోతోంది. అధికారాన్ని అడ్డంపెట్టుకొని నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన భారీ డ్రైనేజీ..గ్రామంలోని చిన్నారులకు ప్రాణ సంకటంగా మారింది. అసలు కట్టాల్సిన చోట డ్రైనేజీ కట్టకుండా అడ్డగోలుగా నూతనంగా నిర్మాణం చేపట్టారు. ఇది ఎక్కడో మారుమూల ప్రాంతంలో కాదు ఒంగోలు నగరపాలక సంస్థ పరిధిలోని 18వ డివిజన్ చెరువుకొమ్ముపాలెంలోనే. ఆ డివిజన్‌కు కార్పొరేటర్‌గా గెలిచి మేయర్ పీఠమెక్కిన మహిళా ప్రజాప్రతినిధి ఏరియాలోనే. చెరువుకొమ్మపాలెంలో సదరు మహిళా నేత సొంత భవనం పక్కనే ఉన్న డ్రైనేజీని కాదని పడమరగా తీస్తే భవనం పోతుందని నిబంధనలకు విరుద్ధంగా గ్రామంలోని రోడ్డుకు తూర్పుగా తీసి బడుగుల రేకుల షెడ్లను కూలగొట్టించి మరీ డ్రైనేజీ నిర్మాణం చేపట్టే విధంగా అధికారులను పురమాయించారు. ఆ డ్రైనేజీ ప్రస్తుతం చెరువుకొమ్ముపాలెంలోని కొత్తపాలెం ఎస్సీ కాలనీవాసులకు ప్రాణాలపైకి వచ్చింది.
అలా నిర్లక్ష్యంగా వదిలిస్తే ఎలా..?
చెరువుకొమ్ముపాలెం గ్రామంలో బీఈడీ కాలేజీకి ఎదురుగా ఉన్న కొత్తపాలెం ఎస్సీ కాలనీ ముందు నూతనంగా నిర్మించిన భారీ డ్రైనేజీ కాలువ ఆ కాలనీలో చిన్నారుల పాలిట శాపంగా మారింది. ఆరడుగుల లోతులో నాలుగడుగుల వెడల్పులో డ్రైనేజీ నిర్మాణం చేశారు. అంత పెద్ద డ్రైనేజీ ఒంగోలు నగరంలో కూడా లేదు. అయితే ఆ భారీ డ్రైనేజీ మీద స్లాబు వేయకుండా వదిలేశారు. దాంతో ఆ పాలెంకు చెందిన చిన్నారులు ఆడుకుంటూనో, దాటే సమయంలోనో జారి ఆ కాలువలో పడి కాళ్లు, చేతులు విరగ్గొట్టు కోవటంతో పాటు తీవ్ర గాయాలపాలవుతున్నారు. గత మూడు, నాలుగు నెలల నుంచి దాదాపు 10 మందికి పైగా చిన్నారులు ఆ డ్రైనేజీ కాలువలో పడి తీవ్రగాయాల పాలయ్యారు. గాయాలపాలైన చిన్నారులంతా ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పేద విద్యార్థులే
గాయాల పాలైన వారందరో..?
కాలనీకి చెందిన రాజ్‌కుమార్ రెండో తరగతి చదువుతున్నాడు. పెళ్లూరులోని ప్రభుత్వ పాఠశాలకు వెళ్లి తిరిగి వస్తుండగా కాలు జారీ స్లాబు వేయకుండా వదిలేసిన డ్రైనేజీ కాలువలో పడటంతో కాలు విరిగింది. డ్రైనేజీ కాలువలో పడి రోదిస్తున్న రాజ్ కుమార్‌ను రోడ్డున వెళ్లే వారు గమనించి బయటకు తీశారు.
కుంటల్లో పడి ఐదుగురు చిన్నారుల మృత్యువాత....
చెరువుకొమ్ముపాలెం గ్రామంలోనే రెండు కుంటల్లో ప్రమాదవశాత్తూ పడటంతో ఐదుగురు చిన్నారులు మృతి చెందిన విషయం అందరికీ తెలిసిందే. జూలైలోనే ఈ రెండు ప్రమాదాలు సంభవించటంతో గ్రామం మొత్తం ఒక్కసారిగా శోకసంద్రంలోకి వెళ్లిపోయింది. అక్రమంగా మట్టి తవ్వటంతో లోతైన గొయ్యలుగా మారటంతో చిన్నారులు దిగిన వెంటనే లోతు తెలియకు ప్రాణాలు కోల్పోయారు. చెరువుకొమ్ముపాలెం నుంచి కందులూరుకు వెళ్లే డొంకలో అక్రమంగా గ్రావెల్ కోసం తవ్విన కుంటలో పడి ఒకే రోజు నలుగురు చిన్నారులు మృత్యువాత పడ్డారు. ఆ తరువాత గుర్రంవారి చెరువులో పడి మరో చిన్నారి మృతి చెందాడు.
అడ్టగోలుగా నిర్మాణం చేపట్టారు
కొత్త పాలెం ఎస్‌సీ కాలనీ వద్ద నిబంధనలకు విరుద్ధంగా భారీ స్థాయీలో డ్రైనేజీనిర్మించారు. మాజీ మహళా ప్రతినిది భవనం పోకుండా ఉండేందుకు పడమర వైపు ఉన్న పాత డ్రైనేజీ కాలువ స్థానంలో నిర్మాణం చేయాల్సింది పోయి తూర్పు వైపు నిర్మాణం చేయించారు. దాంతో ప్రస్తుతం ఎస్‌సీ కుటుంబాలకు చెందిన చిన్నారులు ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. మున్సిపల్ అధికారులు కూడా అడ్డగోలుగా నిర్మాణం చేపట్టారు.
– పూసపాటి సమర సింహా రెడ్డి, వైఎస్సార్‌సీపీ జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ
రోడ్డుకు పడమర వైపు నిర్మించాలని పోరాటం చేశాం..
డ్రైనేజీ నిర్మాణాన్ని రోడ్డుకు పడమర వైపు నిర్మాణం చేయాలని నిర్మాణ సమయంలో పోరాటం చేశాం. రోడ్డుకు పడమర వైపు 30 అడుగులు ఖాళీ స్థలం ఉంది. అది డ్రైనేజీ నిర్మాణం కోసమే గతంలో వదిలారు. ఆ స్థానంలోనే పాత డ్రైనేజీ కాలువ కూడా ఉంది. గ్రామానికి చెందిన దళిత నాయకుడు ఒకరు కావాలని ఈ కాలనీ మీద కక్షకట్టి మరీ మేయరుకు చెప్పి మరీ డ్రైనేజీ నిర్మాణాన్ని చేపట్టాడు.
– తాటిపర్తి రాగయ్య, వైఎస్సార్‌సీపీ జిల్లా ఎస్‌సీ సెల్ కార్యదర్శి...
చెరువుకొమ్ముపాలెం ఎస్సీ కాలనీలో లోతైన డ్రైనేజీతో భయం భయం..
నిబంధనలకు విరుద్ధంగా డ్రైనేజీ నిర్మాణం
మహిళా ప్రజాప్రతినిధి భవనం కాపాడేందుకు పాత డ్రైనేజీ కాదని కొత్త డ్రైనేజీ నిర్మాణం
డ్రైనేజీపై సిమెంట్ స్లాబు వేయకపోవడంతో ప్రమాదాల బారిన పడుతున్న చిన్నారులు


