కౌలు రైతులకు అవగాహన కల్పించాలి | - | Sakshi
Sakshi News home page

కౌలు రైతులకు అవగాహన కల్పించాలి

Jul 17 2026 7:15 AM | Updated on Jul 17 2026 7:15 AM

కౌలు రైతులకు అవగాహన కల్పించాలి రికార్డులు పక్కాగా ఉండాలి 19న రోల్‌బాల్‌ క్రీడాకారుల ఎంపిక రేపు జిల్లా వ్యాప్తంగా స్పెషల్‌ లోక్‌ అదాలత్‌లు

ఒంగోలు సబర్బన్‌: కౌలు రైతులకు ప్రభుత్వం అందిస్తున్న పథకాలు, హక్కులు, అందుబాటులో ఉన్న సౌకర్యాలపై విస్తృతంగా అవగాహన కల్పించాలని జాయింట్‌ కలెక్టర్‌ కల్పనా కుమారి అధికారులకు సూచించారు. దళిత బహుజన రిసోర్స్‌ సెంటర్‌ (డీబీఆర్‌ఎస్‌) వారు కౌలు రైతుల కోసం రూపొందించిన ప్రచార కరపత్రాలను తన చాంబర్‌లో గురువారం జేసీ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ కౌలు రైతులు తమ హక్కులు తెలుసుకుని ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కౌలు రైతులకు పంట రుణాలు, పంటల బీమా, సాగు ధ్రువీకరణ పత్రాలు, తదితర అంశాలపై అవగాహన కల్పించేందుకు దళిత బహుజన రిసోర్స్‌ సెంటర్‌ ప్రచార కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని అన్నారు. కార్యక్రమంలో దళిత బహుజన రిసోర్స్‌ సెంటర్‌ జిల్లా కో–ఆర్డినేటర్‌ దార్ల కోటేశ్వరరావు, దర్శి ఏరియా కో–ఆర్డినేటర్‌ గుంటూరు నాగమణి, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధి బిళ్ల శరత్‌ తదితరులు పాల్గొన్నారు.

ఒంగోలు సబర్బన్‌: వార్డు సచివాలయాల్లో స్వర్ణ గ్రామ–స్వర్ణ వార్డు రికార్డులు పక్కాగా ఉండాలని సంబంధిత విభాగం జిల్లా అధికారి ఎం.వెంకటేశ్వరరావు ఆదేశించారు. ఒంగోలు కార్పొరేషన్‌ పరిధిలోని పీర్లమాన్యంలో స్వర్ణ వార్డు కార్యాలయాన్ని గురువారం ఆకస్మికంగా ఆయన తనిఖీ చేశారు. పలు అంశాలకు సంబంధించిన రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించారు. తల్లికి వందనం కార్యక్రమానికి సంబంధించిన ఎస్‌ఈడీ డేటా వెరిఫికేషన్‌ను పరిశీలించారు. ప్రతి రికార్డును ఎప్పటికప్పుడు నవీకరిస్తూ ప్రభుత్వం జారీచేసిన మార్గదర్శకాల ప్రకారం పారదర్శకంగా నిర్వహించాలని సూచించారు.

స్పెషల్‌ ఆధార్‌ క్యాంపు పరిశీలన...

ఒంగోలు నగరంలోని ఏకేవీకే కాలేజీలో నిర్వహిస్తున్న స్పెషల్‌ ఆధార్‌ క్యాంపును కూడా గురువారం వెంకటేశ్వరరావు సందర్శించారు. ఆధార్‌ క్యాంపులో ప్రజలకు సిబ్బంది అందిస్తున్న సేవల గురించి అడిగి తెలుసుకున్నారు. స్పెషల్‌ ఆధార్‌ క్యాంపులో ఫేజ్‌ – 2 కింద జూలై 21 నుంచి 24వ తేదీ వరకు పేర్లలో ఉన్న తప్పులను సరిదిద్దుకోవడం, ఎంబీయూ అప్‌డేట్‌, పుట్టిన తేదీ కరెక్షన్స్‌ చేయించుకోవాలని ప్రజలకు సూచించారు. ప్రత్యేకంగా స్కూలు, కాలేజీ విద్యార్థులు ఇలాంటి పొరపాట్లు ఉంటే ప్రత్యేక ఆధార్‌ సెంటర్‌కు వచ్చి సరిచేసుకోవాలని పిలుపునిచ్చారు.

ఒంగోలు సిటీ: రోల్‌బాల్‌ జిల్లా క్రీడాకారుల ఎంపిక కార్యక్రమాన్ని ఈ నెల 19వ తేదీ సింగరాయకొండలోని ఇంటర్నేషనల్‌ ఢిల్లీ పబ్లిక్‌ స్కూల్‌ ప్రాంగణంలో నిర్వహించనున్నట్లు ప్రకాశం జిల్లా రోల్‌బాల్‌ సెక్రటరీ కె.అనీల్‌కుమార్‌రెడ్డి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. అండర్‌–11, అండర్‌–14, అండర్‌–17, ఆపై విభాగాల్లో పోటీలు నిర్వహించి క్రీడాకారులను ఎంపిక చేయనున్నట్లు చెప్పారు. పాల్గొనే క్రీడాకారులు అదేరోజు ఉదయం 8.30 గంటలకు తప్పనిసరిగా రిపోర్ట్‌ చేయాలని సూచించారు. జిల్లా నలుమూలల నుంచి అర్హులైన క్రీడాకారులు పాల్గొనాలని కోరారు. మరిన్ని వివరాలకు 9100553717 నంబర్‌ను సంప్రదించాలని సూచించారు.

ఒంగోలు వన్‌టౌన్‌: జిల్లా వ్యాప్తంగా ఈ నెల 18వ తేదీ స్పెషల్‌ లోక్‌ అదాలత్‌లు నిర్వహించనున్నట్లు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్‌ సివిల్‌ జడ్జి సీహెచ్‌వీ రామకృష్ణ తెలిపారు. ఒంగోలులోని జిల్లా న్యాయస్థానం ఆవరణలోని బార్‌ అసోసియేషన్‌ హాలులో న్యాయవాదులతో గురువారం సమావేశం నిర్వహించి మాట్లాడారు. స్పెషల్‌ లోక్‌ అదాలత్‌లలో ఎక్కువ సంఖ్యలో చెక్‌ బౌన్స్‌ కేసులు పరిష్కరించే విధంగా న్యాయవాదులు సహకరించాలని కోరారు. కార్యక్రమంలో బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు చావలి రమేష్‌బాబు, ఇతర న్యాయవాదులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement