4 సవర్ల బంగారం చోరీ | - | Sakshi
Sakshi News home page

4 సవర్ల బంగారం చోరీ

Jul 17 2026 7:15 AM | Updated on Jul 17 2026 7:15 AM

4 సవర్ల బంగారం చోరీ ట్రాక్టర్‌ ఢీకొని యువకుడి దుర్మరణం రైలు ఢీకొని గొర్రెల కాపరి మృతి

బల్లికురవ: మండలంలో వరుస చోరీలతో ప్రజలు, రైతులు బెంబేలెత్తుతున్నారు. బుధవారం అర్ధరాత్రి అంబడిపూడి గ్రామంలోని వల్లపు వెంకటేశ్వర్లు ఇంటి వెనుక భాగం నుంచి దొంగలు ప్రవేశించి బీరువాలో ఉంచిన సుమారు 4 సవర్ల బంగారు ఆభరణాలు అపహరించారు. బీరువాలో బట్టలు చెల్లాచెదురుగా పడేశారు. ఇంటి వరండాలో నిద్రిస్తున్న వెంకటేశ్వర్లు, కుటుంబ సభ్యులు గురువారం ఉదయం తలుపులు తీయగా చోరీ జరిగినట్లు గుర్తించారు. స్థానిక పోలీస్‌స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో ఎస్సై నాగరాజు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. ఒంగోలు నుంచి వచ్చిన క్లూస్‌ టీమ్‌, డాగ్‌ స్క్వాడ్‌లు పరిశీలించి ఆధారాలు సేకరించాయి. వారం రోజుల్లోపు మండలంలోని వల్లాపల్లి, నక్కబొక్కలపాడు, కొణిదెన గ్రామాల పొలాల్లోని వ్యవసాయ బోర్లకు అమర్చిన సుమారు 30 మోటార్లకు విద్యుత్‌ సరఫరా చేసే వైర్ల చోరీకి పాల్పడ్డారు. బొర్ల కింద సాగు చేసిన పంటలు కాపాడుకొనేందుకు తిరిగి అమర్చుకుంటున్నా దొంగలు తమ పని తాము చేసుకెళ్తున్నారు.

ముండ్లమూరు: ట్రాక్టర్‌ ఢీకొట్టిన ఘటనలో ద్విచక్ర వాహనంపై వెళ్తున్న యువకుడు అక్కడికక్కడే దుర్మరణం పాలైన విషాద ఘటన ముండ్లమూరు సమీపంలో బుధవారం రాత్రి చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. మండలంలోని పులిపాడు గ్రామానికి చెందిన గంగవరపు బాలకోటయ్య కుమారుడు కాశింబాబు (21) రెండు నెలలుగా ముండ్లమూరులో సెలూన్‌ షాపు నిర్వహిస్తున్నాడు. రోజూ పులిపాడు నుంచి వచ్చి వ్యాపారం చూసుకుని రాత్రికి తిరిగి వెళ్లేవాడు. ఈ క్రమంలో బుధవారం రాత్రి 8 గంటల సమయంలో షాపు మూసివేసి తన ద్విచక్ర వాహనంపై స్వగ్రామానికి బయలుదేరాడు. అద్దంకి–దర్శి ప్రధాన రహదారిపై ముండ్లమూరు విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ సమీపంలోకి రాగానే, పక్కనే ఉన్న పొలాల్లోంచి మెయిన్‌ రోడ్డు పైకి వేగంగా వచ్చిన ఓ ట్రాక్టర్‌ (ఏపీ 26 టీటీ 4192) కాశింబాబు బైక్‌ను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తలకు తీవ్ర గాయాలు కావడంతో యువకుడు అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. మృతుడి తండ్రి బాలకోటయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు గురువారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

జరుగుమల్లి (సింగరాయకొండ): ప్రమాదవశాత్తు రైలు ఢీకొనడంతో ఓ గొర్రెల కాపరి అక్కడికక్కడే మృతి చెందిన విషాద ఘటన జరుగుమల్లి మండల పరిధిలో గురువారం సాయంత్రం చోటుచేసుకుంది. రైల్వే జీఆర్పీ ఎస్సై శ్రీరామ్‌ తెలిపిన వివరాల ప్రకారం.. కె.బిట్రగుంట గ్రామానికి చెందిన తాతపూడి ఏసురత్నం(48) గొర్రెలు మేపుకుంటూ సమీపంలోని రైలు పట్టాల వద్దకు వెళ్లాడు. అదే సమయంలో విజయవాడ వైపు వేగంగా వెళ్తున్న మెము రైలును అతడు గమనించలేదు. రైలు బలంగా ఢీకొట్టడంతో తీవ్ర గాయాలపాలైన ఏసురత్నం అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఒంగోలు జీజీహెచ్‌కు తరలించారు. మృతుడికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఏసురత్నం మృతితో స్థానిక ఎస్సీ కాలనీలో విషాదఛాయలు అలుముకున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement