ప్రయాణికులకు చుక్కలు..! | - | Sakshi
Sakshi News home page

ప్రయాణికులకు చుక్కలు..!

Jul 17 2026 7:15 AM | Updated on Jul 17 2026 7:15 AM

నేడు నరసరావుపేటలో చంద్రబాబు సభకు 250 బస్సుల కేటాయింపు అసలే జిల్లాలో అరకొర బస్సులతో నరకం చూపిస్తున్న ఆర్టీసీ తరచూ సీఎం పర్యటనలకు ఆర్టీసీ బస్సులు తరలిస్తుండటంతో ప్రయాణికులకు ఇక్కట్లు

బాబు సభకు బస్సులు..

ఒంగోలు టౌన్‌: పల్నాడు జిల్లా నరసరావుపేటలో శుక్రవారం నిర్వహించనున్న రుణమేళా సభకు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌, ముఖ్యమంత్రి చంద్రబాబు వస్తుండటంతో పెద్ద సంఖ్యలో జనాలను తరలించడానికి ఆర్టీసీ బస్సులు కేటాయించారు. దీనిపై ప్రయాణికుల నుంచి, ముఖ్యంగా ఉచిత బస్సు లబ్ధిదారులైన మహిళా ప్రయాణికుల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యమంత్రి పర్యటనకు ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని ఏడు ఆర్టీసీ డిపోల నుంచి మొత్తం 170 ఆర్టీసీ బస్సులను నరసరావుపేట తరలించినట్లు సమాచారం. అందుకోసం గురువారం మధ్యాహ్నం నుంచే బస్సులను డిపోలకు తరలించారు. దాంతో ఎక్కడికక్కడ ప్రయాణికులు తీవ్రంగా ఇబ్బందిపడ్డారు.

పల్లెవెలుగు బస్సులన్నీ నరసరావుపేటకే...

ఒంగోలు డిపోలో మొత్తం 85 పల్లెవెలుగు బస్సులున్నాయి. అందులో 35 అద్దె బస్సులు కాగా, మిగిలిన 50 బస్సులు ఆర్టీసీకి చెందినవి. ఈ 50 బస్సుల్లో 40 బస్సులను నరసరావుపేట పర్యటనకు కేటాయించారు. గురువారం సాయంత్రం నరసరావుపేట అర్బన్‌లో ఒంగోలు ఆర్టీసీ డిపో బస్సులు రిపోర్టు చేయాలని ఆదేశాలు వచ్చినట్లు సమాచారం. అక్కడి నుంచి రాత్రికి రాత్రి పల్నాడు జిల్లాలోని వివిధ గ్రామాలకు బస్సులు పంపించి భారీగా జన సేకరణ చేయనున్నట్లు సమాచారం. ఒక్క ఒంగోలు నుంచే కాకుండా ప్రకాశం జిల్లాలోని కందుకూరు, అద్దంకి ఆర్టీసీ డిపోల నుంచి కూడా బస్సులు పంపించారు. అద్దంకి డిపో నుంచి 15 బస్సులు, కందుకూరు డిపో నుంచి 20 బస్సులు పంపించారు. అదేవిధంగా మార్కాపురం జిల్లాలో మార్కాపురం, కనిగిరి, గిద్దలూరు, పొదిలి డిపోలు ఉండగా, మార్కాపురం డిపో నుంచి 35 బస్సులు, గిద్దలూరు డిపో నుంచి 20 బస్సులు, కనిగిరి డిపో నుంచి 30 బస్సులు, పొదిలి డిపో నుంచి 20 బస్సులను నరసరావుపేట తరలించినట్లు సమాచారం. దీంతో గురువారం సాయంత్రం నుంచి ఆయా డిపోల్లో పల్లెవెలుగు బస్సుల కోసం మహిళా ప్రయాణికులు గంటల తరబడి పడిగాపులు కాయాల్సి వచ్చింది. రెండుమూడు గంటలకో బస్సు వస్తుండటంతో ప్రయాణికుల రద్దీ తీవ్రంగా పెరిగి వారి మధ్య తోపులాటలు జరిగాయి.

శుక్రవారం ప్రయాణం నరకమే...

ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని 7 డిపోల నుంచి 170 బస్సులను ముఖ్యమంత్రి సభకు తరలించడంతో శుక్రవారం ప్రయాణం నరకంగా మారుతుందని ఆర్టీసీ ఉద్యోగులే చెబుతున్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని అత్యవసర పనులు ఉంటే తప్ప ప్రయాణాలు పెట్టుకోకపోవడం మంచిదంటున్నారు. తిరిగి శనివారం ప్రయాణికులకు పల్లెవెలుగు బస్సులు అందుబాటులోకి వస్తాయని చెబుతున్నారు. గతేడాది ఆగస్టు 15వ తేదీ నుంచి సీ్త్ర శక్తి పేరుతో మహిళలకు ఉచిత బస్సు పథకాన్ని అమలు చేస్తున్నారు. దీంతో మహిళా ప్రయాణికుల సంఖ్య విపరీతంగా పెరిగిందిగానీ, దానికి తగినట్లు బస్సులు లేవు. తరచూ ఏదోక కార్యక్రమం పేరుతో ముఖ్యమంత్రి సభలకు జనాలను తరలించడానికి పల్లెవెలుగు బస్సులు తరలిస్తుండటంపై ప్రజలు, ఆర్టీసీ కార్మిక సంఘాల నుంచి విమర్శలు వినిపిస్తున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement