లోకాయుక్త ఆదేశాలు బేఖాతర్..
కురిచేడు:
పేదలకు దక్కాల్సిన సాగుభూమి భూబకాసురుల పాలవుతోంది. అధికార పాలకుల అండదండలు, రెవెన్యూ అధికారుల కాసుల కక్కుర్తి తోడై సర్కారు భూములకు రెక్కలొస్తున్నాయి. కంచే చేను మేసిన చందంగా.. రక్షణ కల్పించాల్సిన అధికారులే అసైన్డ్ (డీకేటీ) భూములను అడ్డగోలుగా ఆన్‌లైన్ చేస్తూ అక్రమార్కులకు కట్టబెడుతున్నారు. లోకాయుక్త కోర్టు ఆదేశాలను సైతం బేఖాతర్ చేస్తూ.. కురిచేడు మండలంలో సాగుతున్న ఈ అవినీతి బాగోతం విస్మయం కలిగిస్తోంది. పర్వతం లాంటి ఈ భూదోపిడీలో కిందిస్థాయి అధికారులను బలిచేసి.. అసలు సూత్రధారులు యథేచ్ఛగా దందా సాగిస్తున్నారు.
రికార్డుల మాయాజాలం ఇలా..
మండలంలోని పొట్లపాడు గ్రామంలో పాత సర్వే నంబరు 22ను విభజించి 619 నుంచి 663 వరకు కొత్త నంబర్లు ఇచ్చారు. అలాగే పాత సర్వే నంబరు 99ను విభజించి మరికొన్ని సర్వే నంబర్లుగా సబ్ డివిజన్ చేశారు. వీటితో పాటు సర్వే నంబర్లు 81, 85, 87లో ప్రభుత్వ గయాళు భూమి ఉంది. ఇందులో గతంలో కొందరు పేదలకు డీకేటీ పట్టాలు ఇచ్చారు. చట్టప్రకారం ఈ భూములను అమ్మడానికి వీల్లేదు. కానీ, నిబంధనలకు పాతరేసి ఈ భూమి మొత్తాన్ని అక్రమార్కుల పేరిట ‘కొనుగోలు ద్వారా సంక్రమించినట్లు’ ఆన్‌లైన్ చేసేశారు. ఖాతా నంబరు 1199తో నీలకంఠన్ ప్రభాకరన్ పేరిట 17 సర్వే నంబర్లలో ఏకంగా 42.70 ఎకరాలు, ఖాతా నంబరు 1200తో చింతా వెంకటేశ్వరరావు పేరిట మరో 17 సర్వే నంబర్లలో 38.69 ఎకరాలను ఆన్‌లైన్ చేసి అధికారికంగా భూకబ్జాకు తెరతీశారు.
తహసీల్దార్‌పై వేటు.. అసలు దొంగలకు రక్షణ
ఈ భారీ కుంభకోణంపై గతంలో ఆరోపణలు వెల్లువెత్తడంతో.. కంటితుడుపు చర్యగా అప్పటి తహసీల్దార్ వరకుమార్‌ను సస్పెండ్ చేసి అధికారులు చేతులు దులుపుకున్నారు. ఆ భూమిని ఆన్‌లైన్ నుంచి తొలగించాలని, అది ప్రభుత్వ భూమి అని, ఆక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని భూమి వద్ద రెవెన్యూ అధికారులు ఓ హెచ్చరిక బోర్డు కూడా పాతారు. కానీ లోపాయికారీ ఒప్పందాలతో కథ వేరేలా నడిచింది. చింతా వెంకటేశ్వరరావు పేరిట ఉన్న 38.69 ఎకరాల్లో.. సర్వే నంబరు 631–2లో 3.48 ఎకరాలు, 635–1లో 4.82 ఎకరాలు (మొత్తం 8.30 ఎకరాలు) రికార్డుల్లో అలాగే ఉంచి, మిగతాది మాత్రమే ఆన్‌లైన్‌లో తొలగించారు. ఇక నీలకంఠన్ ప్రభాకరన్ పేరిట ఉన్న 42.70 ఎకరాల భూమిని నేటికీ ఆన్‌లైన్ నుంచి తొలగించకపోవడం రెవెన్యూ అధికారుల బరితెగింపునకు నిదర్శనం.
కోర్టు ఆదేశాలు ధిక్కరించి..
ఈ భూదోపిడీపై ఆ గ్రామానికి చెందిన ఓ రైతు ఏపీ లోకాయుక్తను ఆశ్రయించారు. విచారించిన న్యాయస్థానం స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినా.. జిల్లా రెవెన్యూ అధికారులు వాటిని బుట్టదాఖలు చేశారు. ఆక్రమణదారులు మళ్లీ ఆ భూమిని దున్ని చదును చేస్తున్నా.. రెవెన్యూ అధికారులు చోద్యం చూడటమే అందుకు నిదర్శనం. పైగా అది సర్వే నంబర్ 87 లోనిదని, పేదలు విక్రయించుకున్నారంటూ కబ్జాదారులకే వత్తాసు పలకడం వారి అనైతికతను స్పష్టం చేస్తోంది. ఇప్పటికై నా కలెక్టర్ స్పందించి.. క్షేత్రస్థాయిలో సమగ్ర సర్వే నిర్వహించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. పాలకుల అండతో పేదల భూములను స్వాహా చేస్తున్న కబ్జాకోరుల నుంచి సర్కారు భూములు స్వాధీనం చేసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
పేదల అసైన్డ్ భూములు స్వాహా.. పాలకుల అండతో రెవెన్యూ లీలలు
చేతులు మారుతున్న లక్షల రూపాయలు.. అందినకాడికి దండుకుంటున్న అధికారులు
కురిచేడు మండలంలో పేట్రేగిపోతున్న భూబకాసురులు


