సంక్షేమానికి చిరునామా.. జగన్‌ | - | Sakshi
Sakshi News home page

సంక్షేమానికి చిరునామా.. జగన్‌

Apr 12 2026 2:30 AM | Updated on Apr 12 2026 2:30 AM

సంక్షేమానికి చిరునామా.. జగన్‌

మార్కాపురం: అభివృద్ధి, సంక్షేమానికి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చిరునామాగా మారారని వైఎస్సార్‌ సీపీ ఉమ్మడి ప్రకాశం జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి అన్నారు. మార్కాపురంలో లక్ష్మీచెన్నకేశవస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం రాత్రి మార్కాపురం పట్టణంలోని మెయిన్‌ బజారులో పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు అధ్యక్షతన ఏర్పాటు చేసిన విద్యుత్‌ ప్రభపై ముఖ్యఅతిథిగా పాల్గొని బూచేపల్లి మాట్లాడారు. ఎన్ని కష్టాలు, నష్టాలు వచ్చినా పార్టీని నమ్ముకొని ఉన్న కార్యకర్తలకు తలొంచి నమస్కరిస్తున్నానన్నారు. గత ఎన్నికల్లో ప్రజలు చంద్రబాబును నమ్మి ఓట్లు వేస్తే ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా వెన్నుపోటు పొడుస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలు కూడా హామీలు ఇచ్చి అమలు చేసిన ముఖ్యమంత్రి జగన్‌ కావాలో.. హామీలు అమలు చేయని చంద్రబాబు కావాలో తేల్చుకోవాలన్నారు. వైఎస్సార్‌ సీపీ కార్యకర్తలకు తాను అండగా ఉంటానని, జగనన్నకు సైనికునిగా పనిచేస్తానని అన్నారు. మార్కాపురం జిల్లాలో ప్రభుత్వ కార్యాలయాల్లో మాత్రమే నిధులు ఇచ్చారని, అభివృద్ధికి నిధులు ఇవ్వలేదని విమర్శించారు. రూ.3.50 లక్షల కోట్ల అప్పుతెచ్చి అమరావతి అభివృద్ధి పేరుతో దోచుకుంటున్నారని, కొత్తగా ఏర్పడిన మార్కాపురం జిల్లాకు ఎందుకు నిధులివ్వలేదంటూ ప్రశ్నించారు. ఇటీవల మార్కాపురం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో బాధితులు 108కు ఫోన్‌ చేస్తే స్పందించలేదని, వైఎస్‌ జగన్‌ ప్రభుత్వంలో అంబులెన్స్‌లు ఇంటివద్దకు వచ్చి సేవలు అందించాయని గుర్తుచేశారు. మెడికల్‌ కాలేజీ ఇక్కడే కట్టి ఉంటే చాలామంది ప్రాణాలతో బయటపడేవారని అన్నారు. తమ వంతు బాధ్యతగా ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు పరిహారం అందించామని చెప్పారు. వైఎస్సార్‌ సీపీ మార్కాపురం ఇన్‌చార్జి అన్నా రాంబాబు నీతికి, నిజాయితీకి మారుపేరని, నియోజకవర్గ ప్రజలు, కార్యకర్తలు ఆయనకు అండగా నిలవాలని బూచేపల్లి పిలుపునిచ్చారు.

మార్కాపురం భూముల రేట్లు.. అమరావతి భూముల రేట్లు ఒకటే : అన్నా రాంబాబు

మార్కాపురం జిల్లా ప్రకటించిన తరువాత ఇక్కడ భూముల రేట్లు అమరావతిలో భూముల ధరలతో పోటీపడుతున్నాయని, దీంతో సామాన్య ప్రజలు ఇల్లు కట్టుకోలేని పరిస్థితి ఏర్పడిందని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్‌ సీపీ మార్కాపురం నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ అన్నా రాంబాబు అన్నారు. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పరిపాలనలో ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకుని సంక్షేమ పథకాలను ఇళ్ల వద్దకు చేర్చాడని అన్నారు. ఈ ప్రభుత్వంలో ఒక్క పెన్షన్‌ కూడా మంజూరు కాలేదని, నిరుద్యోగ భృతి కూడా ఇవ్వలేదని, చంద్రబాబు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా మోసం చేస్తున్నాడని విమర్శించారు. దొనకొండను రాజధాని చేసి ఉంటే ఈ ప్రాంతం అభివృద్ధి చెందేదని అన్నారు. జిల్లా ఇచ్చారని సంబరాలు చేస్తున్నారని, నిధులు ఇవ్వకుండా అభివృద్ధి ఎలా జరుగుతుందని ప్రశ్నించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్‌ సీపీ సత్తాచాటాలని పిలుపునిచ్చారు.

ఎన్నికలు ఎప్పుడొచ్చినా వైఎస్సార్‌ సీపీని

గెలిపిద్దాం : తాటిపర్తి చంద్రశేఖర్‌

ఎన్నికలు ఎప్పుడొచ్చినా వైఎస్సార్‌ సీపీని గెలిపించేందుకు నాయకులు, కార్యకర్తలు ఇప్పటి నుంచే కష్టపడాలని యర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్‌ పిలుపునిచ్చారు. రాష్ట్రంలో చంద్రబాబు పాలన అధ్వానంగా తయారైందని, ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు అమలు చేయడంలేదని విమర్శించారు. సంక్షేమం, అభివృద్ధి కావాలంటే వైఎస్సార్‌ సీపీని గెలిపించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. మాజీ ఎమ్మెల్యే జంకె వెంకటరెడ్డి మాట్లాడుతూ అందరికీ చెన్నకేశవస్వామి ఆశీస్సులు ఉండాలని, జగనన్నను సీఎంగా చేసుకుందామని కోరారు. నాటి వైఎస్సార్‌ పాలన, నేటి కూటమి పాలనను ప్రజలు గమనించాలని కోరారు. కార్యక్రమంలో జెడ్పీ చైర్‌పర్సన్‌ బూచేపల్లి వెంకాయమ్మ, అన్నా కృష్ణ చైతన్య, ఎస్‌ఈసీ మెంబరు వెన్నా హనుమారెడ్డి, మున్సిపల్‌ మాజీ చైర్మన్‌ బాలమురళీకృష్ణ, పార్టీ పట్టణ అధ్యక్షుడు, మాజీ కౌన్సిలర్‌ షేక్‌ సలీమ్‌, మార్కాపురం తర్లుపాడు మండలాల కన్వీనర్లు చెంచిరెడ్డి, మురారి, ఏఎంసీ మాజీ చైర్మన్‌ గొలమారి శ్రీనివాసరెడ్డి, మాజీ కౌన్సిలర్‌ డాక్టర్‌ కనకదుర్గ, ఎస్‌ఈసీ మెంబరు ఉడుముల కోటిరెడ్డి, పార్టీ నాయకులు బట్టగిరి తిరుపతిరెడ్డి, జె.రంగారెడ్డి, కొండయ్య, దూదేకుల మస్తాన్‌, సుధీర్‌, గాయం శ్రీనివాసరెడ్డి, మాజీ కౌన్సిలర్‌ సిరాజ్‌, పలువురు రాష్ట్ర, జిల్లా నాయకులు పాల్గొన్నారు. అనంతరం బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి, వెంకాయమ్మను అన్నా రాంబాబు ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు.

ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చని సీఎం చంద్రబాబు : ఎమ్మెల్యే బూచేపల్లి

ఎన్నికలు ఎప్పుడొచ్చినా జగన్‌ను సీఎంను చేసుకుందాం : ఎమ్మెల్యే చంద్రశేఖర్‌

మార్కాపురం జిల్లా ఇచ్చినా నిధులివ్వకపోవడంతో నిరాశే : మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు

వైఎస్సార్‌ సీపీ విద్యుత్‌ ప్రభపై ప్రజలనుద్దేశించి ప్రసంగం

మార్కాపురంలో ఘనంగా

చెన్నకేశవస్వామి తిరునాళ్లు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement