ఒంగోలు టౌన్: చిన్న చిన్న పనులు చేస్తే వచ్చే కూలి డబ్బులు జల్సాలకు సరిపోవడంలేదని దొంగలుగా మారారు. దేవుడి సొమ్ముతో జల్సాలు చేసేందుకు దేవాలయాలకు కన్నం వేయడం మొదలుపెట్టారు. చివరకు పోలీసుల చేతికి చిక్కి కటకటాలపాలయ్యారు. ఆ వివరాలను ఒంగోలులోని జిల్లా పోలీసు కార్యాలయంలో శనివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఎస్పీ హర్షవర్థన్‌రాజు వెల్లడించారు. మహారాష్ట్రలోని అమరావతి జిల్లాకు చెందిన అనికేత్ కై లాస్ కసరోడే, సునీల్ దేవరావు సూర్యవంశీ, మనీష్ గోపాల్ వడివే, మరో ఇద్దరు మైనర్ బాలురు రోజువారీ కూలి పనులు చేసి కుటుంబాన్ని పోషించేవారు. అయితే, జల్సాలు చేయడానికి చేతిలో డబ్బులు ఉండేవి కావు. దాంతో అడ్డదారి తొక్కారు. దొంగలుగా మారారు. దేవుడి సొత్తు కాజేసి జల్సాలు చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో ఈ ఏడాది ఫిబ్రవరి 23వ తేదీ అన్నమయ్య జిల్లా మదనపల్లెలో హైవే సమీపంలోని కృష్డుడి ఆలయంలో వెండి, బంగారు అభరణాలు దోచుకున్నారు. ఈ నెల 1వ తేదీ ప్రకాశం జిల్లా జె.పంగులూరు మండలం రామకూరు గ్రామంలోని శ్రీరామలింగేశ్వరస్వామి దేవాలయం తాళాలు పగులగొట్టి లోపలకు ప్రవేశించారు. గుడిలో స్వామివారికి చెందిన 19 గ్రాముల బంగారు ఆభరణాలు, 7 కిలోల వెండి వస్తువులు దొంగలించారు. చోరీ సొత్తు తీసుకుని లారీలో ఒంగోలు వైపు ప్రయాణం మొదలుపెట్టారు. దారిలో రేణంగివరం గ్రామంలో త్రిశక్తి పీఠం కనిపించింది. వెంటనే లారీ ఆపి అక్కడ చోరీ చేశారు. గుడి తాళాలు పగులగొట్టి గర్భగుడిలోకి ప్రవేశించి ముగ్గురు దేవతల వద్ద ఉన్న 2 కిలోల వెండి కిరీటాలు దొంగలించారు.
ప్రత్యేక బృందాలతో గాలింపు...
దేవాలయాల్లో వరుసగా దొంగతనాలు జరుగుతుండటంతో ఎస్పీ హర్షవర్థన్‌రాజు సీరియస్‌గా తీసుకున్నారు. ఆయన స్వీయ పర్యవేక్షణలో దర్శి డీఎస్పీ మార్గదర్శకత్వంలో అద్దంకి రూరల్ సీఐ డి.మల్లికార్జునరావు, సీసీఎస్ సీఐ ఎం.బీమానాయక్, ఫింగర్ ప్రింట్ సీఐ బి.వినోద్‌బాబు, మేదరమెట్ల ఎస్సై షేక్ రఫీ, కొరిశపాడు ఎస్సై వై.సురేష్ తదితరులతో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి సాక్ష్యాధారాలు సేకరించారు. పక్కా సమాచారంతో శనివారం అద్దంకి మండలం సింగరకొండ ఆంజనేయస్వామి ఆలయ సమీపంలో పొలాల వద్ద అమరావతి దొంగల ముఠా సభ్యులు ఐదుగురిని అరెస్టు చేశారు.
నిందితుల నుంచి
బంగారు ఆభరణాలు స్వాధీనం...
నిందితులు చోరీ చేసిన సొత్తును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. శ్రీరామలింగేశ్వరస్వామి దేవాలయంలో చోరీ చేసిన వెండి చేతులు 2, వెండి చెవులు 2, వెండి కిరీటం 1, వెండి తొండం 1, మరికొన్ని ఆభరణాలతో పాటు బంగారు మంగళ సూత్రాలు 12, మారేడు బిల్వం 1, తెల్ల రాళ్లు 4, ఎర్రరాయి 1 కలిగిన ముక్కుపుడక 1, బంగారపు ముక్కుపుడక 1, బంగారు బొట్టు 1, ముత్యాల దండ పతకం 1, బంగారు పతకం 1 కలిపి మొత్తం 19 గ్రాముల బంగారు నగలు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ సుమారు రూ.4,70,000 ఉంటుందని అంచనా వేస్తున్నారు. రేణంగివరం గ్రామంలో త్రిశక్తి పీఠంలో దొంగిలించిన 2 కేజీల వెండి కిరీటాలను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలి...
ఈ సందర్భంగా ఎస్పీ హర్షవర్థన్‌రాజు మాట్లాడుతూ దేవాలయాల భద్రతను దృష్టిలో ఉంచుకుని ముఖ్య ప్రదేశాలలో పీపీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. తరచూ సీసీ కెమెరాల పనితీరును పరిశీలించాలని, కెమెరాలకు సంబంధించి డీవీఆర్‌లను ఎత్తయిన ప్రదేశాలలో భద్రపరచుకోవాలని చెప్పారు. చోరీ కేసు ఛేదించిన పోలీసు బృందాన్ని ఎస్పీ అభినందించారు.
మహారాష్ట్రలోని అమరావతి నుంచి వచ్చి రాష్ట్రంలోని దేవాలయాల్లో దొంగతనాలు
ఐదుగురు అంతరాష్ట్ర దొంగలను అరెస్టు చేసిన పోలీసులు
వివరాలు వెల్లడించిన ఎస్పీ హర్షవర్థన్‌రాజు


