సాక్షి ప్రతినిధి, ఒంగోలు: ఒంగోలు నగరానికి చెందిన యువ న్యాయవాది శ్రీరామ హరిప్రసాద్ హత్య రాష్ట్రంలో సంచలనం సృష్టిస్తోంది. నగర శివారులోని ఒక వివాదాస్పద భూమి విషయంలోనే హత్య జరిగిందా..అని నగర ప్రజలు చర్చింకుంటున్నారు. భూవివాదం గురించి న్యాయవాది హరిప్రసాద్ మీడియాతో మాట్లాడిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. చీమకుర్తికి చెందిన శ్రీరామ హరిప్రసాద్ (37) కొంతకాలంగా ఒంగోలులో న్యాయవాదిగా చేస్తున్నారు. నగరంలోని కర్నూలు రోడ్డులో ఒక హోటల్ వెనక నివాసం ఉంటున్న హరిప్రసాద్‌కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఆయన తల్లి తిరుపతమ్మ ఒంగోలు కోర్టులో ప్రాసెస్ సర్వర్‌గా పనిచేస్తున్నారు. ఈ నెల 9వ తేదీ సాయంత్రం 5 గంటలకు హైకోర్టులో ఒక కేసు ఫైల్ చేయాల్సిన పని ఉందని తల్లి తిరుపతమ్మతో చెప్పి బయల్దేరాడు. రాత్రి 9 గంటల సమయంలో తల్లి ఫోన్ చేసినప్పుడు చిలకలూరిపేటలో ఒక హోటల్లో భోజనం చేస్తున్నట్లు చెప్పాడు. మరుసటి రోజు ఉదయానికి చిలకలూరిపేట మండలం యడవల్లి పరిధిలో కోటప్పకొండ నుంచి చిలకలూరిపేట వైపు వెళ్లే దారి పొలాల్లో నిర్జీవంగా పడి ఉన్నాడు. ఆయన తల వెనుక బండరాళ్లతో కొట్టిన గాయాలు ఉండటం, మృతదేహంపై స్కూటీ పెట్టిన తీరు చూసిన వారికి హత్యగా అనుమానం కలిగించింది. దీంతో తొలుత అనుమానాస్పద మృతిగా భావించిన పోలీసులు తల్లి తిరుపతమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు హత్యగా కేసు నమోదు చేశారు. హత్య ఎందుకు జరిగిందనే విషయంపై పలురకాల చర్చ జరుగుతోంది.
కేశవరాజుకుంట భూవివాదమే కారణమా?
కేశవరాజుకుంటకు చెందిన టీడీపీ కార్యకర్త పోతురాజుకు స్థానిక మల్లేశ్వరకాలనీలో 24 గదుల స్థలం ఉంది. ఆ స్థలాన్ని అధికార పార్టీకి చెందిన కొందరు కబ్జా చేసుకొని ప్లాట్‌లు వేసి విక్రయించినట్లు సమాచారం. న్యాయవాది హరిప్రసాద్ ఈ కేసును వాదిస్తున్నారు. బాధితుడు పోతురాజు, న్యాయవాది హరిప్రసాద్ ఇటీవల మీడియాతో మాట్లాడారు. ఈ వీడియో ఇప్పుడు జిల్లాలో హల్‌చల్ చేస్తోంది. కబ్జాకు పాల్పడిన వ్యక్తులు తనను చంపుతామని బెదిరిస్తున్నారని పోతురాజు మీడియా ముందు ఆందోళన వ్యక్తం చేశారు. చిలకలూరిపేట పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో న్యాయవాది తల్లి ఇదే ఆరోపణ చేశారు. తనను చంపుతామని బెదిరింపు కాల్స్ వస్తున్నాయని కుమారుడు చెప్పినట్లు పేర్కొన్నారు. భూ కబ్జాల విషయంలోనే గిట్టని వారు తన కుమారుడిని హత్య చేసి ఉంటారని అనుమానాలు వ్యక్తం చేశారు. హరి ప్రసాద్ హత్యకు, భూ కబ్జాలకు సంబంధం ఉందన్న ప్రచారం జోరందుకుంది. పోలీసులు ఎలాంటి ఒత్తిళ్లకు లొంగకుండా నిజాయితీగా విచారణ జరిపితే వాస్తవాలు బయటకు వస్తాయని న్యాయవాదులు చెబుతున్నారు. న్యాయవాదులకే రక్షణ లేకపోతే ఎలా అని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నగరంలో యథేచ్ఛగా భూకబ్జాలు జరుగుతున్నాయి. అక్రమార్కులు చట్టాలను లెక్కచేయడం లేదు. నిబంధనలు పట్టించుకోవడం లేదు. దీంతో నగర ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. ఒంగోలులో భూములు కొనాలంటే భయపడిపోతున్నారు.
న్యాయవాది హత్యపై జిల్లాలో జోరుగా చర్చ
న్యాయవాది హరిప్రసాద్ వీడియో హల్‌చల్


