పెద్దారవీడు: రాష్ట్రంలో అన్ని విధాలా యాదవులకు సముచిత స్థానం కల్పించిన ఘనత వైఎస్సార్ సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికే దక్కుతుందని మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు పేర్కొన్నారు. పెద్దారవీడు మండలం గుండంచర్ల సమీపంలో నల్లమల అడవిలో వెలసిన వేనూతల కాటమరాజుస్వామి తిరునాళ్ల సందర్భంగా బుధవారం రాత్రి వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో యాదవులు ఏర్పాటు చేసిన విద్యుత్ ప్రభపై ఆయన మాట్లాడారు. దివంగత వైఎస్సార్ మాదిరిగానే యాదవుల సంక్షేమానికి వైఎస్ జగన్ కృషి చేశారన్నారు. యాదవులకు నామినేటెడ్ పదవులివ్వడంతోపాటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను చేసిన ఘనత వైఎస్ జగన్‌కే దక్కిందని కొనియాడారు. భారతదేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ప్రభుత్వ పాఠశాలను అభివృద్ధి చేసి ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెట్టి విద్యాభివృద్ధికి కృషి చేసింది జగనన్న మాత్రమేనన్నారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలో బీసీలకు సంక్షేమ పథకాలు, ప్రభుత్వ పాఠశాలల్లో చిన్నారులకు ఇంగ్లిష్ మీడియం చదువులు, ట్యాబ్‌లు అందడం లేదని, మధ్యాహ్నం భోజన పథకాన్ని సైతం నీరుగార్చారని ధ్వజమెత్తారు. దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతూ ఐక్యరాజ్య సమితి వేదికపై బీసీ బిడ్డలు అనార్గళంగా ఇంగ్లిష్‌లో ప్రసంగించింది జగనన్న పాలనలోనే అని గుర్తు చేశారు. జగన్‌నన్నను మరోమారు సీఎంగా చేసుకుంటేనే పేదలకు సంక్షేమ పథకాలు అందుతాయని, అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. రాష్ట్రంలో గంజాయి, డ్రగ్స్ విచ్చలవిడిగా అమ్ముతున్నా పట్టించుకున్న నాథుడే లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజా సంక్షేమాన్ని గాలికొదిలేసిన సీఎం చంద్రబాబు.. రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో ముంచేస్తున్నారని మండిపడ్డారు. వైఎస్సార్ సీపీ హయాంలో యాదవుల కల్యాణ మండపం కోసం రూ.50 కోట్లు మంజూరు చేస్తే, ఆ ఫైల్‌ను నేడు తొక్కిపెట్టారన్నారు. వైఎస్ జగన్ కాగానే కాటమరాజు ఆలయాన్ని రూ.100 కోట్లతో అభివృద్ధి చేస్తామని, జగనన్నతోనే ఆ పనులకు శంకుస్థాపన చేయిస్తామని పేర్కొన్నారు. యాదవులంతా వైఎస్ జగన్‌కు అండగా నిలవాలని పిలుపునిచ్చారు.
వైఎస్సార్ సీపీ అధికార ప్రతినిధి, వైపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో 20 ఏళ్లకు పైగా అధికారం వెలగబెట్టిన టీడీపీ ప్రభుత్వం.. చేసిన అభివృద్ధి శూన్యమని విమర్శించారు. చంద్రబాబు దృష్టిలో సూపర్‌సిక్స్ అంటే మైన్స్, మగువ, మద్యం, ల్యాండ్స్, గంజాయి, డ్రగ్స్, డ్యాన్స్‌లు చేయడమేనని ఎద్దేవా చేశారు. కాటమరాజుస్వామి ఆలయ భూములను టీడీపీ నాయకులు తమ పేరుపై ఎక్కించుకుని ప్రభుత్వం నుంచి డబ్బు దోచుకున్నారని ఆరోపించారు. వైపాలెం నియోజకవర్గంలో అధికారాన్ని అడ్డం పెట్టుకొని టీడీపీ నేతలు విచ్చలవిడిగా అవినీతికి పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు. అక్రమార్జనే లక్ష్యంగా ఇసుక, మట్టి మాఫియా చెలరేగుతోందని, ఎవరైనా ప్రశ్నిస్తే పోలీసులను అడ్డం పెట్టుకొని మరీ లూటీ చేస్తున్నారని నిప్పులు చెరిగారు. జగనన్న ముఖ్యమంత్రి అయిన వెంటనే కాటమరాజుస్వామి దేవాలయం అభివృద్ధికి, రహదారుల నిర్మాణానికి అన్నివిధాలా తోడ్పాటు అందిస్తామని హామీ ఇచ్చారు. యాదవులపై ఎంతో ప్రేమతో కాటమరాజుస్వామిపై ట్వీట్ పెట్టిన విషయాన్ని గుర్తు చేశారు. రాష్ట్రంలో టీడీపీ దొంగలు, దోపిడీదారుల ప్రభుత్వాన్ని గంగలో కలిపేంత వరకు కార్యకర్తలు విశ్రమించవద్దని పిలుపునిచ్చారు. యర్రగొండపాలెం గడ్డపై మళ్లీ వైఎస్సార్ సీపీ జెండాను రెపరెపలాడించేందుకు సిద్ధం కావాలని కోరారు. మాజీ ఎమ్మెల్యేలు అన్నా రాంబాబు, కేపీ నాగార్జురెడ్డి, పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి యనమల నాగార్జునయాదవ్ మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం విధానాలను తూర్పారబట్టారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ ఏరువ చలమారెడ్డి, ఒంగోలు పట్టణ అధ్యక్షుడు కఠారి శంకర్, వైఎస్సార్ సీపీ జిల్లా మేధావుల సంఘం అధ్యక్షుడు, సర్పంచ్ అంగిరేకుల ఆదినారాయణయాదవ్, పార్టీ రాష్ట్ర యూత్ కార్యదర్శి ఏరువ శేషశయనారెడ్డి, మండల పార్టీ ఉపాధ్యక్షుడు తోకల ఆవులయ్య, బీసీ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శి గుమ్మా ఎల్లేష్‌యాదవ్, దివ్యాంగుల విభాగం నియోజకవర్గ అధ్యక్షుడు గుర్రం ముత్యాలయ్య, మాజీ ఎంపీపీ నన్నెబోయిన రవికుమార్‌యాదవ్, మాజీ సర్పంచ్‌లు గుమ్మా రాజయ్యయాదవ్, ఈర్ల రాజశేఖర్‌యాదవ్, పార్టీ నాయకులు ఒంటేరు నాగేశ్వరరావుయాదవ్, సుబ్బయ్య యాదవ్, గుమ్మా రామాంజనేయయాదవ్, నాలి కొండయ్యయాదవ్, మురారి గాలెయ్యయాదవ్, కార్యకర్తలు పాల్గొన్నారు.
మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు
కాటమరాజు ఆలయంలో వైఎస్సార్ సీపీ నేతలతో కలిసి పూజలు
హాజరైన ఎమ్మెల్యే తాటిపర్తి, మాజీ ఎమ్మెల్యేలు అన్నా, కేపీ


