దేవుడిపైనే
మార్కాపురం టౌన్:
మార్కాపురం జిల్లా ఏర్పడి మూడు నెలలు అవుతున్నా దేవదాయ ధర్మాదాయ శాఖలో నేటికీ జిల్లా స్థాయి అఽధికారులను నియమించకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మార్కాపురం జిల్లాలో పలు శాఖలకు ఉన్నతాధికారులుగా ఇన్‌చార్జిలను నియమించి కార్యాలయాలు ఏర్పాటు చేశారు. అయితే దేవదాయ శాఖకు మాత్రం కేవలం కార్యాలయ బోర్డు ఏర్పాటు చేసి అధికారిని నియమించకపోవడంతో ప్రజలు, పలువురు భక్తులు ప్రశ్నిస్తున్నారు. గత ఏడాది డిసెంబరు 30న మార్కాపురం జిల్లాను ప్రకటించిన నాటి నుంచి నేటి వరకు దేవదాయ శాఖకు అసిస్టెంట్ కమిషనర్‌గా ఎవరిని నియమించకపోవడంతో పనుల నిమిత్తం ఇక్కడి ప్రజలు ఒంగోలు ఏసీ కార్యాలయానికి వెళ్లక తప్పడం లేదు. దేవదాయ శాఖ సిబ్బంది సైతం తమ సర్వీసు రికార్డులు, ఎన్‌ఓసీలు, సమస్యల పరిష్కార నిమిత్తం పొలోమంటూ ఒంగోలు వెళ్లాల్సి వస్తోంది.
మార్కాపురం జిల్లాలోని 21 మండలాల్లో ఈఓల పరిధిలోని ఆలయాలతోపాటు దేవదాయశాఖలో కలిసిన ఆలయాలను కలుపుకొని సుమారుగా 470 వరకు ఉన్నాయి. ముఖ్యంగా జిల్లా కేంద్రమైన మార్కాపురంలో భూదేవి శ్రీదేవి సమేత శ్రీ లక్ష్మీ చెన్నకేశవస్వామి ఆలయం, మార్కండేశ్వరస్వామి ఆలయం, త్రిపురాంతకంలోని త్రిపురాంతకేశ్వరస్వామి, బాలా త్రిపురసుందరీదేవి ఆలయాలు, రాచర్ల మండలంలోని నెమలిగుండ్ల రంగనాయకస్వామి ఆలయం, కొనకనమిట్ల మండలంలోని వెలుగొండ వెంకటేశ్వర స్వామి ఆలయం, పొదిలిలోని నిర్మమహేశ్వర ఆలయం, సీఎస్ పురంలోని భైరవకోన, మిట్టపాలెం నారాయణస్వామి ఆలయాలతోపాటు దేవదాయశాఖలో కలిసిన ఆలయాలు ఉన్నాయి. వీటన్నింటి పర్యవేక్షణకు ఇప్పటి వరకు దేవదాయశాఖ జిల్లా అధికారిని నియమించకపోవడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించి దేవదాయశాఖ జిల్లా అధికారిని నియమించాలని ప్రజలతో పాటు ఆ శాఖ సిబ్బంది కోరుతున్నారు.


