దర్శి: క్రికెట్ బెట్టింగ్ వలలో చిక్కుకుని అప్పులపాలై జీవితాలు నాశనం చేసుకోవద్దని దర్శి డీఎస్పీ లక్ష్మీనారాయణ సూచించారు. రానున్న ఐపీఎల్ సీజన్ నాటికి బెట్టింగ్‌ను పూర్తిగా కట్టడి చేస్తామని చెప్పారు. బెట్టింగ్‌కు పాల్పడి అప్పులపాలైన కొందరు యువకులు ఆత్మహత్య చేసుకుంటున్న వైనంపై ‘బెట్టింగ్ వల ప్రాణాలు విలవిల’ శీర్షికన గురువారం ‘సాక్షి’లో ప్రచురించిన కథనానికి ప్రకాశం జిల్లా పోలీసులు స్పందించారు. బెట్టింగ్‌కు పాల్పడుతున్నట్లు అనుమానం ఉన్న యువత కుటుంబ సభ్యులకు దర్శి డీఎస్పీ లక్ష్మీనారాయణ గురువారం రాత్రి కౌన్సెలింగ్ ఇచ్చారు. అనంతరం విలేకరుల సమావేశంలో డీఎస్పీ మాట్లాడుతూ.. పిల్లలు ఏం చేస్తున్నారో తల్లిదండ్రులు గమనిస్తూ ఉండాలని సూచించారు. చెడు స్నేహం, పిల్లలకు బెట్టింగ్ ముఠాతో సంబంధాలు ఉన్నట్లు గుర్తిస్తే వెంటనే మందలించాలని సూచించారు. తప్పని తెలియక, బెట్టింగ్‌రాయుళ్ల మాయమాటలు నమ్మి ఒకటీరెండు సార్లు పందెం కాసిన వారిని కౌన్సెలింగ్ ఇచ్చి వదిలేస్తున్నామన్నారు. వారు మళ్లీ బెట్టంగ్‌లో పాల్గొన్నట్లు గుర్తిస్తే కటకటాల వెనక్కు నెడతామని చెప్పారు. బెట్టింగ్‌ను ఆదాయ మార్గంగా ఎంచుకుని యువతను ఆ ఊబిలోకి దించి, వారి జీవితాలు నాశనం చేస్తున్న వ్యక్తులను వదిలిపెట్టే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. బెట్టింగ్ రాకెట్‌ను ఛేదించేందుకు ఇప్పటికే అరెస్ట్ అయ్యి రిమాండ్‌లో ఉన్న నలుగురు నిందితులను విచారించేందుకు పోలీస్ కస్టడీకి తీసుకున్నట్లు చెప్పారు. నిందితుల బ్యాంక్ లావాదేవీలు పరిశీలించి, సాంకేతిక ఆధారాలు సేకరిస్తున్నట్లు చెప్పారు. రెండు లేదా మూడు రోజుల్లో బెట్టింగ్ రాకెట్ నిందితుల వివరాలు రాబడతామన్నారు. కార్యక్రమంలో సీఐ రామారావు, ఎస్సైలు శివ, మల్లికార్జున్ పాల్గొన్నారు.
బాధితులు ఎవరూ ఆత్మహత్యకు పాల్పడవద్దు
బెట్టింగ్ రాకెట్ సూత్రధారులను
వదిలే ప్రసక్తే లేదు
దర్శి డీఎస్పీ లక్ష్మీనారాయణ


