తౌషిక్‌ అనుమానాస్పద మృతి కేసు.. శ్రీచైతన్య స్కూల్‌ గుర్తింపు రద్దు | - | Sakshi
Sakshi News home page

తౌషిక్‌ అనుమానాస్పద మృతి కేసు.. శ్రీచైతన్య స్కూల్‌ గుర్తింపు రద్దు

Mar 20 2026 10:16 AM | Updated on Mar 20 2026 10:16 AM

గిరిజన బాలికకు అటవీశాఖ నష్ట పరిహారం జనావాసాల మధ్యకు చుక్కల దుప్పి అంపైర్ల శిక్షణకు ఏప్రిల్‌ 6 నుంచి వర్క్‌షాప్‌

ఒంగోలు సిటీ: సింగరాయకొండలోని మూలగుంటపాడులో శ్రీచైతన్య ప్రాథమికోన్నత పాఠశాల గుర్తింపును రద్దు చేసినట్లు డీఈఓ సీవీ రేణుక గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా డీఈఓ రేణుక మాట్లాడుతూ.. శ్రీ చైతన్య నవోదయ కోచింగ్‌ సెంటర్‌లో 6వ తరగతి విద్యార్థి సయ్యద్‌ తౌషిక్‌ అనుమానాస్పదంగా మృతి చెందిన ఘటనకు సంబంధించి కలెక్టర్‌ ఆదేశాల మేరకు ఫిబ్రవరి 22వ తేదీన త్రీమెన్‌ కమిటీ ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. పాఠశాలలో త్రీమెన్‌ కమిటీ చేపట్టిన విచారణలో పలు అవకతవకలను గుర్తించినట్లు వెల్లడించారు. ఈ మేరకు ఆ పాఠశాల గుర్తింపును 2026–2027 విద్యా సంవత్సరం నుంచి ఎందుకు రద్దు చేయకూడదో వివరణ ఇవ్వాలని కోరుతూ యాజమాన్యానికి షోకాజ్‌ నోటీసు ఇచ్చినట్లు తెలిపారు. నిర్దేశించిన సమయంలోగా శ్రీచైతన్య ప్రాథమికోన్నత పాఠశాల యాజమాన్యం వివరణ ఇవ్వని కారణంగా గుర్తింపును రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశామని పేర్కొన్నారు.

చిరుత దాడి నుంచి క్షేమంగా బయటపడిన బాలిక

పెద్దదోర్నాల: చిరుతపులి దాడిలో గాయపడి తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్న చిన్నారుట్ల గిరిజన తండాకు చెందిన బాలికకు అటవీశాఖ అధికారులు రూ.2 లక్షల నష్ట పరిహారం అందజేశారు. గురువారం నెక్కంటి ఫారెస్ట్‌ రేంజి కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో చిన్నారుట్లకు చెందిన కుడుముల అంజలి తల్లి లింగేశ్వరికి నష్టనరిహారం చెక్కు అందజేశారు. గత ఏడాది ఆగస్టు నెల 13వ తేదీన ఇంట్లో తల్లిదండ్రులు కుడుముల అంజయ్య, లింగేశ్వరితో కలిసి నిద్రిస్తున్న మూడేళ్ల బాలిక అంజమ్మ తలను నోట కరుచుకుని చిరుత అడవిలోకి వెళ్లేందుకు ప్రయత్నించింది. దీంతో అప్రమత్తమైన తల్లిదండ్రులు పెద్దపెట్టున కేకలు వేసి అడ్డుకున్నారు. నాటి నుంచి చిన్నారి అంజమ్మకు వైద్య చికిత్స చేయించిన అధికారులు గురువారం నష్టపరిహారం అందజేశారు. కార్యక్రమంలో ఫారెస్ట్‌ సెక్షన్‌ అఫీసర్‌ వెంకటయ్య, బీట్‌ ఆఫీసర్‌ మదన్‌, కరీముల్లా తదితరులు పాల్గొన్నారు.

పెద్దదోర్నాల: దారి తప్పిన ఓ చుక్కల దుప్పి జనావాసాల మధ్యకు ప్రవేశించింది. ఈ సంఘటన పెద్దదోర్నాలలో బుధవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. వివరాలు.. మండల కేంద్రానికి సమీపంలో ఉన్న నల్లమల అటవీ ప్రాంతం నుంచి పంట పొలాల్లోకి జింకలు, దుప్పులు తరచూ వచ్చి వెళ్తుంటాయి. ఈ క్రమంలో దారి తప్పిన ఓ చుక్కల దుప్పి మండల కేంద్రంలోని బైపాస్‌ రోడ్డు దాటి అర్ధరాత్రి వేళ పట్టణంలోకి ప్రవేశించింది. ఇందిరానగర్‌, ఫారంబజార్‌, శ్రీశైలం బస్టాండ్‌ తదితర ప్రాంతాల్లో చక్కర్లు కొట్టిన చుక్కల దుప్పి ఎట్టకేలకు అటవీ ప్రాంతంలోకి వెళ్లినట్లు అటవీశాఖ అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా ఫారెస్టు రేంజ్‌ అధికారి హరి మాట్లాడుతూ.. అడవిలో అగ్ని ప్రమాదాల వల్ల వన్యప్రాణులు జనావాసాల మధ్యకు వస్తున్నాయని తెలిపారు. ప్రతి ఒక్కరూ సామాజిక స్పృహతో అడవుల సంరక్షణకు కృషి చేయాలని కోరారు.

ఒంగోలు: ఆంధ్రా క్రికెట్‌ అసోసియేషన్‌ పరిధిలో అంపైర్ల కొరతను అధిగమించేందుకు ఏప్రిల్‌ 6 నుంచి 9వ తేదీ వరకు విజయనగరం జిల్లా నార్త్‌ జోన్‌ అకాడమీలో వర్క్‌షాప్‌ నిర్వహించనున్నట్లు ప్రకాశం జిల్లా క్రికెట్‌ అసోసియేషన్‌ కార్యదర్శి కారుసాల నాగేశ్వరరావు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. 40 ఏళ్లలోపు వయసు కలిగి స్థానిక క్రికెట్‌ టోర్న మెంట్లలో అంపైరింగ్‌ చేసిన అనుభవం ఉన్న వారు అర్హులని స్పష్టం చేశారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ నెల 24వ తేదీలోగా తమ వివరాలను ప్రకాశం జిల్లా క్రికెట్‌ అసోసియేషన్‌ మెయిల్‌ ఐడీ pdcaongole@gmail. comకు పంపాలని సూచించారు. ఎంపికై న అభ్యర్థులకు ఏసీఏ ఆధ్వర్యంలో ఉచిత వసతి కల్పించడంతోపాటు ప్రయాణ ఖర్చులు అందిస్తారని తెలిపారు. వివరాలకు 9246222999ను సంప్రదించాలని సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement