సిలిండర్‌ | - | Sakshi
Sakshi News home page

సిలిండర్‌

Mar 14 2026 7:38 AM | Updated on Mar 14 2026 7:38 AM

ఇరాన్‌–ఇజ్రాయిల్‌ యుద్ధ ప్రభావంతో గ్యాస్‌ కొరత భయాలు గ్యాస్‌ బుకింగ్‌కు పనిచేయని సర్వర్లు బుకింగ్‌కు తప్పని తిప్పలు గ్యాస్‌ అందక వినియోగదారుల కష్టాలు మూతపడుతున్న చిరు వ్యాపారాలు

మార్కాపురం: ఇరాన్‌–ఇజ్రాయిల్‌ యుద్ధ ప్రభావం వంటింట్లో గ్యాస్‌ కష్టాలు తెచ్చింది. గ్యాస్‌ కొరత ఏర్పడనుందన్న సమాచారంతో ఒక్కసారిగా అందరూ ఆన్‌లైన్‌లో గ్యాస్‌ను బుక్‌ చేయడంతో సర్వర్లు పనిచేయక తిప్పలు పడుతున్నారు. ఓటీపీ వస్తేనే గ్యాస్‌ సిలిండర్‌ డెలవరీ అవుతుంది. కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా సరఫరా తగ్గిపోవడంతో ఏజెన్సీ నిర్వాహకులు గ్యాస్‌ సిలిండర్ల డెలివరీ టెన్షన్‌ భరించలేక తల పట్టుకుంటున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా గ్యాస్‌ కొరత ప్రారంభమైంది. బుకింగ్‌ సమయాన్ని 21 రోజుల నుంచి 40 రోజులకు పెంచారని సోషల్‌ మీడియాలో వైరల్‌ కావడంతో ప్రతి ఒక్కరూ గ్యాస్‌ సిలిండర్‌ బుకింగ్‌కు కాల్‌ సెంటరుకు ఫోన్‌ చేయడంతో సర్వర్‌ మొరాయిస్తోంది. దీంతో గ్యాస్‌ బుక్‌ అవ్వక, సిలిండర్‌ రాదేమోనన్న ఆందోళన మహిళల్లో ఏర్పడింది. తాత్కాలికంగా విద్యుత్‌ పొయ్యిలను, ఇండెక్షన్‌ స్టవ్‌లను బయటకు తీస్తున్నారు. హోటల్‌ నిర్వాహకులు కూడా అతి పొదుపుగా వాడుతున్నారు. మార్కాపురంలో ఒక్కొక్క గ్యాస్‌ ఏజెన్సీకి రోజుకు 2 లారీల లోడ్‌ వస్తోంది. అయితే మూడు రోజుల నుంచి రెండు రోజులకు ఒక లోడ్‌మాత్రమే రావడంతో డెలివరీ ఆలస్యమవుతోంది. ప్రధానంగా హోటల్స్‌, చిరువ్యాపారులకు, టిఫిన్‌ బండ్ల నిర్వాహకులకు కమర్షియల్‌ సిలిండర్‌ అవసరం ఎక్కువగా ఉంది. గ్యాస్‌ ధర పెంచినప్పటికీ సిలిండర్‌ సకాలంలో అందితే చాలనే భావన ఏర్పడింది. ప్రతి గ్యాస్‌ ఏజెన్సీలో సిలిండర్‌ బుక్‌ చేసుకునేవారి సంఖ్య రోజుకు 400 నుంచి 500 మధ్య ఉంటోందని ఒక ఏజెన్సీ నిర్వాహకులు తెలిపారు. సిలండర్ల డెలివరీ తక్కువ కావడం, డిమాండ్‌ ఎక్కువ కావడంతో సకాలంలో డెలివరీ చేయలేక నిర్వాహకులు ఫోన్లు స్విచ్ఛాప్‌ చేసుకుంటున్నారు. మార్కాపురం పట్టణంలో గత రెండు రోజుల నుంచి బండ్లపై టిఫిన్‌ తయారు చేసే వాటిని మూసేశారు. కేవలం సిలిండర్‌ల కొరత కారణంగానే వీటిని మూసివేస్తున్నారు. గత వారం వరకూ బుక్‌చేసుకున్న 2 నుంచి 3 రోజులకే గ్యాస్‌ సిలిండర్‌ డెలివరీ అయ్యేది. ఇప్పుడు నెల వరకూ పట్టవచ్చనే వార్తలు అటు వ్యాపారుల్లో ఇటు గృహ యజమానుల్లో టెన్షన్‌కు దారితీస్తోంది.

వంట గ్యాస్‌ సిలిండర్ల కోసం క్యూ

సంతమాగులూరు(అద్దంకి): యుద్ధంతో గ్యాస్‌ కొరత ఏర్పడిందన్న ప్రచారంతో గతంలో ఎన్నడూ లేని విధంగా గ్యాస్‌ సిలిండర్ల కోసం వినియోగదారులు క్యూకట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. మండలంలోని కొమ్మాలపాడు గ్రామంలో శుక్రవారం గ్యాస్‌ వాహనం రాగానే బుక్‌ చేసుకున్న వినియోగదారులు క్యూ కట్టారు. గతంలో రెండు రోజులకు ఒక సారి వచ్చే గ్యాస్‌ వాహనం ఇప్పుడు 15 రోజులకు ఒక సారి వస్తుండడంతో ఈ పరిస్థితి నెలకొందని చెబుతున్నారు. మండలంలో మొత్తం 15 వేల కనెక్షన్లు ఉండగా, 10 వేల మంది సిలిడర్లు కావాలని బుక్‌ చేసుకున్నారని, వారికి వెంటనే సిలిండర్లు ఇచ్చేందుకు వీలు కావడం లేదని నిర్వాహకులు చెబుతున్నారు.

ఇలా అయితే వ్యాపారాలు చేయలేము

మార్కాపురం పట్టణంలో గత ఎనిమిదేళ్లుగా టిఫిన్‌ బండి పెట్టుకుని జీవనం సాగిస్తున్నా. ఇప్పటి వరకూ గ్యాస్‌ కొరత లేకపోవడంతో ఉదయం టిఫిన్‌, సాయంత్రం స్నాక్స్‌ వేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాను. వారం రోజుల నుంచి గ్యాస్‌ కొరత వేధిస్తోంది. దీంతో సాయంత్రం పూట స్నాక్స్‌ బండిని ఆపేశాను. పొదుపుగా వాడుకోవాల్సిన పరిస్థితి వస్తోంది. మరోవైపు ఉగాది పండుగ, రంజాన్‌ వస్తోంది. వ్యాపారాలు ఎక్కువగా ఉంటాయని ఆశతో ఉంటే గ్యాస్‌ కొరత భయపెడుతోంది.

– సుబ్బారావు, టిఫిన్‌ బండి నిర్వాహకుడు

ఒంగోలులో గ్యాస్‌ గోడౌన్‌ వద్ద వినియోగదారుల పడిగాపులు

ఒంగోలులోని ఓ హోటల్‌లో కట్టెల పొయ్యిపై వంట

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement