అడ్డగోలు నిబంధనలతో అన్నదాత సుఖీభవ నిధుల్లో కోత.. మొదటి ఏడాది చంద్రబాబు ఎగనామం పెట్టింది ఒక్కో రైతుకు రూ.20 వేలు రెండో ఏడాదిలో ఇప్పటి వరకు ఇచ్చింది రూ.10 వేలు మాత్రమే ఎన్నికల సమయంలో పీఎం కిసాన్ కాకుండా ఒక్కో రైతుకు రూ.20 వేలు ఇస్తానని మోసం కాకిలెక్కలతో రైతుల జాబితాలు తయారు కౌలు రైతుల ఊసే లేకుండా, కొత్త దరఖాస్తులు లేకుండా లబ్ధిదారులు ఏవిధంగా పెరిగారని రైతుల విస్మయం మొదటి రెండు విడతల్లో జమకాని రైతులు దాదాపు 90 వేలకు పైనే.. అసలు మోంథా తుఫాను నష్టం ఊసేలేని వైనం..
ఊసేలేని మోంథా తుపాను నష్టం...
అన్నదాత సుఖీభవ రావడం లేదు
మాకు గత ప్రభుత్వంలో రైతు భరోసా పథకం కింద డబ్బులు వచ్చాయి. రెండేళ్ల క్రితం నా భర్త చనిపోయాడు. పొలం నాపేరున ఉన్నా ఈ ప్రభుత్వం ఇస్తున్న అన్నదాత సుఖీభవ రెండో విడతలో రాలేదు. ఇప్పుడు కూడా రాలేదని చెబుతున్నారు. నా వయసు 65 సంవత్సరాలు. పిల్లలు లేరు. ఇటువంటి పరిస్థితుల్లో కనీసం ఈ పథకం నాకు వర్తిస్తే బాగుండేది. కానీ నాకు ఈ పథకంలో పేరు లేకుండా పోయింది. దీనిపై సచివాలయంలో అధికారులను అడిగినా సరైన సమాధానం ఇవ్వడం లేదు. ఎవరికి చెప్పుకోవాలో తెలియడం లేదు.
– నలమలపు ఈశ్వరమ్మ, గురవారెడ్డిపాలెం, మద్దిపాడు మండలం
సాక్షి ప్రతినిధి, ఒంగోలు: రైతులను చంద్రబాబు ప్రభుత్వం నిలువునా మోసం చేసింది. 2024 ఎన్నికల సమయంలో అన్నదాత సుఖీభవ కింద ఏడాదికి ప్రతి రైతుకు రూ.20 వేలు అక్షరాలా ఇస్తానన్న చంద్రబాబు అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాది రైతులకు వ్యవసాయ పెట్టుబడి ఎగనామం పెట్టాడు. చివరకు రెండో ఏడాదిలో అయినా సకాలంలో ఇచ్చాడా అంటే అదికూడా లేదు. మే నెలలో ఇవ్వాల్సిన పెట్టుబడి సాయం ఇవ్వకుండా ఆగస్టులో రెండో విడత ఇవ్వాల్సిన సాయం రూ.5 వేలు రైతుల బ్యాంకు అకౌంట్లకు జమ చేశాడు. అంటే మొదటి విడతతో కలిపి రూ.10 వేలు ఇవ్వాల్సి ఉంటే ఒక విడత మాత్రమే ఇచ్చి మ..మ..అనిపించాడు. 2026 ఆగస్టు రెండో తేదీన మొదటి విడత పీఎం కిసాన్–అన్నదాత సుఖీభవ పథకం ద్వారా రైతుల బ్యాంకు ఖాతాలకు డబ్బులు జమ చేసే కార్యక్రమాన్ని జిల్లా నుంచి ప్రారంభించారు. దర్శి అసెంబ్లీ నియోజకవర్గంలోని తాళ్లూరు మండలం తూర్పు వీరాయపాలెం గ్రామంలో ఎర్రటి ఎండలో రైతులను మంచాల మీద కూర్చోబెట్టి నానా అవస్థల పాలు చేశాడు. అయితే ఆ రోజు చంద్రబాబు మనస్సులోని మాటను బయట పెట్టకనే పెట్టాడు. ‘‘చంద్రన్న ఉన్నంత వరకు రైతుకు భరోసా ఉండదు...ఉండబోదు...ఇది నా ప్రామిస్’’ అని స్వయానా చంద్రబాబు పలికాడు. ఒక్కోసారి ఎంత దాచుకుందామన్నా మనస్సులోని మాటలు అస్సలు దాగవు కదా..
మూడో విడతలో 72,081 మంది రైతులు పెరిగారట...
అన్నదాత సుఖీభవ–పీఎం కిసాన్ పథకంలో లబ్ధిదారులైన రైతులు మూడో విడతలో 72,081 మంది రైతులు పెరిగారని అధికారులు లెక్కలు కట్టారు. ఒక పక్క రైతులు పథకం డబ్బులు పడలేదని, అనేకరకాల కొర్రీలు పెట్టి అర్హులైన రైతులను కూడా జాబితాల నుంచి తొలగించారని మొత్తుకుంటుంటే అధికారులు మాత్రం కాకి లెక్కలు చూపించి రైతులను నిలువునా మోసం చేస్తున్నారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో రెండో విడతలో పీఎం కిసాన్ పథకంలో మొత్తం 2,31,383 మంది రైతులను లబ్ధిదారులుగా తేల్చారు. కానీ అన్నదాత సుఖీభవ పథకం కోసం ఉమ్మడి ప్రకాశం జిల్లాలో మొత్తం 5,31,369 మంది రైతులను వెరిఫై చేసి 4,38,251 రైతుల జాబితాను సిద్ధం చేశారు వ్యవసాయ అధికారులు. ఆ జాబితాను ఉన్నతాధికారులకు పంపించారు. అందులో ఆర్‌ఐజీఎస్ పరిధిలో ఆ జాబితాను పరిశీలించి 2,72,824 మంది రైతులను లబ్ధిదారులుగా గుర్తించారు. వీరికి ఈకేవైసీ పూర్తి చేయాలని గ్రామ వ్యవసాయ సహాయకులను ఆదేశించారు. చివరకు అన్నదాత సుఖీభవ లబ్ధిదారులు 2,68,168గా తేల్చారు. ప్రస్తుతం మూడో విడతకు వచ్చే సరికి ప్రకాశం జిల్లాలో 1,88,056 మంది, మార్కాపురం జిల్లాలో 1,52,190 మంది మొత్తం కలిపి 3,40,246 మంది రైతులను లబ్ధిదారులుగా తేల్చారు. చివరకు ఇవన్నీ కాకిలెక్కలేనని తేలిపోయింది. కౌలు రైతుల ఊసే ఎత్తకుండా, లబ్ధిదారుడైన భర్త చనిపోయినా భార్య పేరు జాబితాలో చేర్చకుండా, కొత్త లబ్ధిదారులు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించకుండా లబ్ధిదారుల జాబితాను పెంచి చూపించడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వాస్తవంగా అంత మందికి అకౌంట్లలో నగదు జమకావడం లేదని తెలుస్తోంది.
రెండు విడతల్లో 90 వేల మందికి పైగా ఎగనామం...
అన్నదాత సుఖీభవ–పీఎం కిసాన్ పథకంలో గతంలో ఇచ్చిన రెండు విడతల్లో దాదాపు 90 వేల మందికి పైగా బ్యాంకుల్లో జమ కాలేదు. రైతులు అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేసినా సాంకేతికపరమైన సమస్యల వల్ల పడలేదు.
తరువాత జమవుతాయని నమ్మబలికారు. కానీ ఏ ఒక్కరికి కూడా ఆ రెండు విడతల్లో రావాల్సిన పెట్టుబడి సాయం రానేలేదు. మూడో విడతలో కూడా అనేక రకాలుగా కోతలు విధించారు. కానీ లబ్ధిదారులు పెరిగారని అధికారులు అంకెల గారడీ చేసి చూపిస్తున్నారు.
మోంథా తుపాను జిల్లాను అతలాకుతలం చేసింది. గతంలో ఎన్నడూ పడనంతగా ఒక్కరోజులోనే 26 సెంటీ మీటర్ల వర్షం కురిసింది. పొలాలు, రోడ్లు చెరువులను తలపించాయి. దాదాపు 60 వేల ఎకరాలకు పైగా నష్టం సంభవిస్తే కేవలం 30 వేల ఎకరాల లోపే నష్టం జరిగిందని అంచనాలు పంపించేలా ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చాయి. అయితే ఇప్పటి వరకు మోంథా తుపాను నష్టం ఒక్క రూపాయి కూడా జిల్లా రైతాంగానికి రానేలేదు. ఆ తుపానుతో పంటలు పూర్తిగా పాడైపోయి రైతులు మళ్లీ పంటలు వేసుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. కానీ ఇంత వరకు అప్పటి పంట నష్టం రాకపోవటంతో రైతన్నలు అప్పుల పాలై అల్లాడిపోతున్నారు.


