● మెడికల్ రిప్రజెంటేటివ్స్ యూనియన్ డిమాండ్
ఒంగోలు టౌన్: ఫార్మా రంగంలో కార్పొరేట్ దోపిడీని అరికట్టాలని, మెడికల్ రెప్రజెంటేటివ్స్‌కు నష్టం కలిగించే లేబర్ కోడ్లను రద్దు చేయాలని ఆంధ్ర ప్రదేశ్ మెడికల్ అండ్ సేల్స్ రెప్రజెంటేటివ్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు సీహెచ్ కుమార్ డిమాండ్ చేశారు. శని, ఆదివారాలలో ఒంగోలులో జరిగే యూనియన్ రాష్ట్ర మహాసభల నేపథ్యంలో శుక్రవారం అంబేడ్కర్ భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ రంగంలోని ఐడీపీఎల్ వంటి ఫార్మా కంపెనీలను పునరుద్ధరించాలని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను నిలిపి వేయాలని, నిత్యావసర, అత్యవసర మందుల ధరలను తగ్గించాలని కోరారు. నకిలీ, నాసిరకం మందుల తయారీ, విక్రయాలను కట్టడి చేయడానికి ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సి.వెంకటరావు మాట్లాడుతూ మెడికల్ రిప్రజెంటీలకు, కార్మికులకు నష్టం కలగజేసే నాలుగు లేబర్ కోడ్లను కేంద్ర ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. మెడికల్ రిప్రజెంటేటివ్స్ పోరాడి సాధించుకున్న సేల్స్ ప్రమోషన్ ఎంప్లాయిస్ యాక్ట్–1976ను పునరుద్ధరించాలని కోరారు. కచ్చితమైన పని విధానాలకు రూపొందించాలన్నారు. ప్రభుత్వం వేసిన త్రిసభ్య కమిటీని వెంటనే సమావేశ పరిచి సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలన్నారు. సమస్యల సాధన కోసం రిప్రజెంటేటివ్‌లు ఐక్యతగా పోరాడాలన్నారు. సమావేశంలో యూనియన్ జాతీయ, రాష్ట్ర నాయకులు జి.మనోహర్, యుఎస్ రవికుమార్, ఐకే కృష్ణ మోహన్, సీహెచ్ చిరంజీవి తదితరులు పాల్గొన్నారు.


