ఒంగోలు: ప్రాథమిక స్థాయిలోనే వ్యాజ్యాల పరిష్కార కార్యక్రమం అభినందనీయమని జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి షేక్ ఇబ్రహీం షరీఫ్ అన్నారు. గురువారం స్థానిక జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యాలయంలో ప్యానల్ అడ్వకేట్లతో ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కక్షిదారులకు ఉచిత న్యాయ సహాయం అందించడంతో పాటు ప్రాథమిక స్థాయిలోనే వ్యాజ్యాల పరిష్కారంతో కక్షిదారులకు కూడా ఎంతో ఉపయోగం ఉంటుందన్నారు. రాష్ట్రస్థాయి న్యాయసేవాధికార సంస్థ రూపొందించిన న్యాయ సహాయ జాబితాలో భాగంగా చట్టాల పట్ల అవగాహన కూడా కలిగిస్తున్న విధానాన్ని వివరించారు. ఏడాదికి రూ.3 లక్షల్లోపు ఆదాయం కలిగిన కుటుంబాలు, మహిళలు, షెడ్యూల్డు తెగలు, జాతుల వారికి ఉచిత న్యాయ సహాయం అందిస్తున్నట్లు తెలిపారు. ఈ అవకాశాన్ని అవసరమైన ప్రజలు సద్వినియోగం చేసుకునేలా అవగాహన కల్పించాలన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ లీగల్ ఎయిడ్ కౌన్సిల్ పి.వీర రాఘవులు, న్యాయవాదులు పరుచూరి లక్ష్మీకుమారి, షేక్ అజీజ్, నాయుడు ఈశ్వరరావు, డేగల రాజేంద్ర ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
ఒంగోలు టౌన్: నిరుద్యోగుల పట్ల కపట ప్రేమ నటిస్తున్న చంద్రబాబు రాష్ట్ర చరిత్రలో విఫల ముఖ్యమంత్రిగా నిలబడిపోతారని అఖిల భారత యువజన సమాఖ్య (ఏఐవైఎఫ్) రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి షేక్ సుభాని ధ్వజమెత్తారు. అసెంబ్లీ సమావేశాల్లో చంద్రబాబు చెప్పిన 20 లక్షల ఉద్యోగాలు ఎక్కడ ఇచ్చారో చెప్పాలని ప్రశ్నించారు. ప్రపంచ ప్రసిద్ధ కంపెనీలు రాష్ట్రానికి వస్తున్నాయని, కోట్లాది రూపాయల పెట్టుబడులు వస్తున్నాయని 20 నెలలుగా ఊదరగొట్టడమే కానీ ఒక్క కంపెనీ రాలేదు, నిధులు రాలేదని తేల్చి చెప్పారు. మాయమాటలతో రాష్ట్రంలోని నిరుద్యోగులను మోసపుచ్చుతున్నారని మండిపడ్డారు. ప్రభుత్వ శాఖల్లో వేలాది ఉద్యోగాలు ఖాళీగా ఉంటే ఎందుకు భర్తీ చేయడం లేదని అడిగారు. నిరుద్యోగుల ఆకలి కేకలు ముఖ్యమంత్రికి వినిపించడంలేదని, చెవిటివాని ముందు శంఖం ఊదినట్లే ఉందని విమర్శించారు. రాష్ట్రంలోని ప్రజలకు చెందిన విలువైన భూములను కార్పొరేట్ శక్తులకు అప్పనంగా కట్టబెడుతున్నారని ఆరోపించారు. ప్రజా సమస్యలను పక్కదారి పట్టించి లడ్డూ రాజకీయంతో విలువైన అసెంబ్లీ సమయాన్ని వృథా చేశారని విమర్శించారు. ఇప్పటికై నా ఒట్టిమాటలు కట్టబెట్టి ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయాలని, జిల్లాలో భారీ పరిశ్రమలను నెలకొల్పి ఉపాధి అవకాశాలను మెరుగుపరచాలని డిమాండ్ చేశారు. ఉద్యోగమో, ఉపాధి కల్పనో చూపించేంత వరకు ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీ మేరకు నెలకు రూ.3 వేల భృతి ఇవ్వాలని కోరారు. సమావేశంలో ఏఐవైఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పోతుల ప్రభాకర్, జిల్లా అధ్యక్షుడు కరుణానిధి, ఏఐఎస్‌ఎఫ్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు పి.పవన్, ఎస్.రామాంజి యాదవ్, ఊటికొండ గోపి, కట్ట ఆంజనేయులు, నాగరాజు పాల్గొన్నారు.
జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి ఇబ్రహీం షరీఫ్


