రెండు రోజులైనా దొరకని మహిళ ఆచూకీ | - | Sakshi
Sakshi News home page

రెండు రోజులైనా దొరకని మహిళ ఆచూకీ

Mar 6 2026 8:07 AM | Updated on Mar 6 2026 8:07 AM

రెండు రోజులైనా దొరకని మహిళ ఆచూకీ 11 నుంచి వెలుగొండలో.. జాతీయ స్థాయి ఎడ్ల పోటీలు మృతి చెందిన కానిస్టేబుల్‌ కుటుంబానికి సాయం

ఆందోళనలో కుటుంబ సభ్యులు

బల్లికురవ: సాగర్‌ అద్దంకి బ్రాంచ్‌ కెనాల్‌లో మంచి నీటి కోసం దిగి గల్లంతైన మహిళ ఆచూకీ రెండు రోజులైనా లభించలేదు. మండలంలోని వల్లాపల్లి గ్రామానికి చెందిన గుంటుపల్లి భవాని(28) భర్త వీరాంజనేయులుతో కలిసి మంగళవారం సాయంత్రం గొర్రెపిల్లల మేత కోసం అద్దంకి బ్రాంచ్‌ కాలువ 33/0 మైలు ఎగువకు వెళ్లింది. ఈ క్రమంలో దాహం వేయడంతో నీటి కోసం సాగర్‌ కాలువలోకి దిగింది. పైకి వచ్చే క్రమంలో జారి పడటంతో నీటి ప్రవాహ ఉధృతికి కొట్టుకుపోయింది. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు, రెస్క్యూ టీమ్‌ సభ్యులు రెండు రోజులుగా ముమ్మరంగా గాలిస్తున్నారు. గజ ఈతగాళ్ల సాయంతో కాలువలో అనుమానిత ప్రాంతాలను జల్లెడపడుతున్నారు. అయినప్పటికీ భవానీ ఆచూకీ లభ్యం కాకపోవడంతో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. ఆశతో కుటుంబ సభ్యులంతా సాగర్‌ కాలువ కట్టపైనే పడిగాపులు కాస్తున్నారు.

కొనకనమిట్ల: ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వెలుగొండలో శ్రీవారి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని ఈ నెల 11, 12, 13వ తేదీల్లో జాతీయ స్థాయి ఎడ్ల బల ప్రదర్శన పోటీలు నిర్వహించనున్నట్లు ఉత్సవ కమిటీ అధ్యక్షుడు కుందురు కాశిరెడ్డి, సభ్యులు జవ్వాజి బాషాపతినాయుడు, మేకలవారిపల్లి రెడ్ల సంఘం సభ్యులు తెలిపారు. 11వ తేదీన ఆరు పళ్ల సైజు విభాగంలో, 12, 13వ తేదీల్లో న్యూ కేటగిరీ, సీనియర్‌ విభాగాల్లో పోటీలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఆయా విభాగాల పోటీలలో గెలుపొందిన ఎడ్ల యజమానులకు బహుమతులు అందజేస్తామని తెలిపారు.

బహుమతుల వివరాలివీ..

ఆరు పళ్ల సైజు విభాగంలో గెలుపొందిన ఎడ్లకు మొదటి, రెండు, మూడు, నాలుగు, ఐదు, ఆరు, ఏడు బహుమతులు వరుసగా రూ.60 వేలు, రూ.40 వేలు, రూ.30 వేలు, రూ.20 వేలు, రూ.15 వేలు, రూ.10 వేలు, రూ.7 వేలు, న్యూ కేటగిరీ విభాగంలో గెలుపొందిన ఎడ్లకు మొదటి ఏడు బహుమతులు వరుసగా రూ.75 వేలు, రూ.60 వేలు, రూ.40 వేలు, రూ.30 వేలు, రూ.20 వేలు, రూ.15 వేలు, రూ.8 వేలు, అలాగే సీనియర్‌ విభాగంలో గెలుపొందిన ఎడ్లకు మొదటి ఏడు బహుమతులు వరుసగా రూ.90 వేలు, రూ.70 వేలు, రూ.50 వేలు, రూ.40 వేలు, రూ.30 వేలు, రూ.20 వేలు, రూ.10 వేలను దాతల సహకారంతో అందజేస్తామని నిర్వాహకులు వెల్లడించారు. ఎడ్ల పోటీల్లో పాల్గొని బహుమతి దక్కని ప్రతి ఎడ్ల జతకు రూ.5 వేల చొప్పున కాసు చారిటబుల్‌ ట్రస్టు చైర్మన్‌ కాసు వెంకటేశ్వరరెడ్డి అందజేస్తారని కమిటీ సభ్యులు ప్రకటించారు. పోటీల్లో పాల్గొనే ఎడ్ల యజమానులు ప్రవేశ రుసుం చెల్లించి పేర్లు నమోదు చేసుకోవాలని కోరారు. వివరాలకు 8008716521, 9505345703, 9963429928, 9581137317ను సంప్రదించాలని సూచించారు.

ఒంగోలు టౌన్‌: రోడ్డు ప్రమాదంలో మరణించిన కానిస్టేబుల్‌ షేక్‌ సాజిద్‌ కుటుంబానికి 2009 బ్యాచ్‌కు చెందిన పోలీసు సిబ్బంది అండగా నిలిచారు. కందుకూరు పోలీసు స్టేషన్లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తిస్తూ ఈ ఏడాది జనవరి 19వ తేదీ జరిగిన రోడ్డు ప్రమాదంలో సాజిద్‌ మరణించారు. అతని కుటుంబం కోసం సహోద్యోగులు సేకరించిన రూ.2,14,000ను గురువారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ హర్షవర్థన్‌రాజు చేతుల మీదుగా సాజిద్‌ తండ్రి షేక్‌ బాషాకు అందజేశారు. ఈ సందర్భంగా సాజిద్‌ కుటంబ వివరాలడిగి తెలుసుకున్న ఎస్పీ.. పోలీసు శాఖ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఏవైనా సమస్యలుంటే తనను సంప్రదించాలని సూచించారు. సాజిద్‌ కుటుంబానికి ఆర్థిక సాయం చేసిన సహోద్యోగులను అభినందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement