సింగరాయకొండ: సరైన భద్రతా చర్యలు పాటించకుండా మద్యం మత్తులో అతివేగంగా వాహనం నడపడంతో రెండు భారీ గ్రానైట్ బండలు రోడ్డుపై జారిపడిన సంఘటన జాతీయ రహదారిపై సింగరాయకొండ మండల పరిధిలో పెరల్ డిస్టిలరీ సమీపంలో గురువారం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఎవరికీ ఎటువంటి ప్రాణ నష్టంగానీ, గాయాలుగానీ కాకపోవడంతో పెను ప్రమాదం తప్పినట్లయింది. పోలీసుల కథనం ప్రకారం.. బల్లికురవలోని ఓ గ్రానైట్ క్వారీ నుంచి బెంగళూరుకు రెండు భారీ గ్రానైట్ బండలను ఎటువంటి భద్రతా చర్యలు చేపట్టకుండా రవాణా చేస్తున్నారు. దానికితోడు లారీ ట్రాలీ డ్రైవర్ ఎన్.తిరుమల మద్యం సేవించి అతివేగంగా నడపటంతో పెరల్ డిస్టిలరీ సమీపంలోకి రాగానే రెండు గ్రానైట్ రాళ్లు ట్రాలీ నుంచి జారి రోడ్డు మధ్యలో డివైడర్‌పై పడ్డాయి. ఒంగోలు వైపు వెళ్లే రోడ్డుకు డివైడర్ అంచునపడగా, ఆ సమయంలో అటుగా ఎలాంటి వాహనాలు రాకపోవడంతో భారీ ప్రమాదమే తప్పింది. ట్రాలీ లారీ డ్రైవర్‌కు డ్రంక్ డ్రైవ్ పరీక్ష చేయగా, 264 పాయింట్లు వచ్చిందని, పూర్తిగా మద్యం మత్తులో వాహనం నడపడం, భద్రతా చర్యలు చేపట్టకపోవడం వలనే ప్రమాదం జరిగినట్లు తెలుస్తోందని స్థానిక ఎస్సై బీ మహేంద్ర తెలిపారు. ఈ ఘటనపై క్రిమినల్ కేసు నమోదు చేశామని, లారీ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నామని వెల్లడించారు.
హైవేపై జారి పడిన భారీ గ్రానైట్ బ్లాకులు
త్రుటిలో తప్పిన పెను ప్రమాదం
అతివేగంగా వాహనం నడపడమే
కారణమంటున్న పోలీసులు


