వేలం మార్చిపోయారా! | - | Sakshi
Sakshi News home page

వేలం మార్చిపోయారా!

Mar 6 2026 8:06 AM | Updated on Mar 6 2026 8:06 AM

ప్రక్రియ జాప్యంపై పొగాకు రైతుల ఆందోళన గతేడాది మార్చి 10వ తేదీ నాటికే వేలం ప్రారంభం నేడు బోర్డు అధికారుల సమావేశం ఇప్పటికే రైతుల వద్ద భారీగా పొగాకు ఉత్పత్తుల నిల్వలు నాణ్యత దెబ్బతింటుందని ఆందోళన బ్రైట్‌ గ్రేడ్‌ రకం అధికంగా రావడంతో ధరలపై ఆశలు రైతుల ఆశలపై నీళ్లు చల్లుతున్న కర్ణాటక వేలం ధరలు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా దాదాపు 85 వేల హెక్టార్లలో పొగాకు పంట సాగు

పొగాకు రైతు తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాడు. రెండేళ్లుగా కనీస మద్దతు ధర లభించక ఆర్థికంగా కుదేలయ్యాడు. కొనుగోళ్లు సరిగ్గా లేక, నాణ్యత పేరుతో తక్కువ ధర నిర్ణయిస్తూ కంపెనీలు మోసం చేయడంతో అప్పుల ఊబిలో కూరుకుపోయాడు. తక్కువ ధరకు తెగనమ్ముకోలేని రైతులు పొగాకును కోల్డ్‌ స్టోరేజీల్లో భద్రపరుచుకున్నారు. ఈసారైనా కష్టాలు తీరుతాయని ఆశలు పెంచుకున్నారు. అయితే ఇప్పటి వరకూ వేలం కేంద్రాలు ప్రారంభం కాకపోవడం, బోర్డు అధికారులు సైతం ఏర్పాట్లు చేయకపోవడంపై రైతులు ఆందోళన చెందుతున్నారు. కర్ణాటక రాష్ట్రంలో జరుగుతున్న వేలంలో ఆశించిన ధరలు రాకపోవడం ఇక్కడి రైతుల ఆశలపై నీళ్లు చల్లేలా ఉంది.

సాక్షి ప్రతినిధి, ఒంగోలు : జిల్లాలో ప్రధాన పంట అయిన పొగాకు అమ్మకాల ప్రారంభంపై స్పష్టత రావడం లేదు. కర్ణాటక రాష్ట్రంలో వేలం ఆలస్యం ఇక్కడి వేలం ప్రారంభంపై ప్రభావం చూపుతోంది. ఇప్పటికీ కర్ణాటకలో వేలం పూర్తికాకపోవడంతో 2026–27 ఏడాదికి సంబంధించిన వేలాన్ని ఎప్పటి నుంచి ప్రారంభించాలనే దానిపై ఒక నిర్ణయానికి బోర్డు అధికారులు రాలేకపోతున్నారు.

జాప్యంతో నష్టం..

ఈ ఏడాది వాతావరణం అనుకూలంగా ఉండడంతో జిల్లా వ్యాప్తంగా పొగాకు పంటను రైతులు ముందుగానే సాగు చేశారు. దీంతో ఇప్పటికే ఆకురెలుపు, క్యూరింగ్‌ జరిగి రైతుల వద్ద పొగాకు ఉత్పత్తులు అధికంగా నిల్వ ఉన్నాయి. ప్రస్తుత పరిస్థితుల ప్రకారం అయితే ఇప్పటికే పొగాకు బోర్డు పరిధిలోని 11 వేలం కేంద్రాల పరిధిలో పొగాకు వేలం ప్రక్రియను ప్రారంభించాల్సి ఉంది. ప్రతి ఏడాది కర్ణాటక రాష్ట్రంలో వేలం ప్రక్రియ ముగిసిన తరువాత ఇక్కడ వేలం ప్రారంభమవుతుంది. అయితే ఈ ఏడాది కర్ణాటకలో వేలం ప్రక్రియ దాదాపు రెండు వారాల ఆలస్యంగా ప్రారంభమైంది. ప్రస్తుతం కర్ణాటక వేలం కొనసాగుతోంది. దీంతో ఇక్కడ ప్రారంభం కావాల్సిన వేలం ప్రక్రియ ఆలస్యమవుతోంది. అదే గతేడాది మార్చి 10వ తేదీ నాటికే జిల్లాలోని పలు వేలం కేంద్రాల్లో వేలం ప్రక్రియ ప్రారంభమైంది. ఈ ఏడాది ఇప్పటికీ బోర్డు అధికారులు ఓ స్పష్టతకు రావడం లేదు. ఇటీవల జరిగిన బోర్డు అధికారుల సమావేశంలో మార్చి నెలాఖరు నుంచి వేలం ప్రారంభించాలని భావించినా దానిపై కూడా అధికారికంగా ఓ నిర్ణయానికి రాలేదు. వేలం కేంద్రాల వారీగా రైతుల అభిప్రాయాలు తీసుకొని వేలం ప్రారంభించాలని అధికారులు భావిస్తున్నారు. అయితే వేలం ప్రక్రియ జాప్యం జరిగితే రైతులకు నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది. పెరుగుతున్న ఎండల దృష్ట్యా వాటి నాణ్యత దెబ్బతింటుందనే ఆందోళన రైతుల్లో ఉంది.

ఆశలు రేకెత్తిస్తున్న నాణ్యత

ఒంగోలు పొగాకు రీజినల్‌ పొగాకు బోర్డు పరిధిలోని ఉమ్మడి ప్రకాశం, నెల్లూరు జిల్లాల పరిధిలో దాదాపు 85 వేల హెక్టార్లలో ఈ ఏడాది పొగాకు పంటను సాగైంది. వాతావరణం అనుకూలంగా ఉండడంతో ఈ ఏడాది పొగాకు పంట నాణ్యత బాగుంది. క్యూరింగ్‌లో అధికంగా దాదాపు 60 శాతానికి పైగా బ్రైట్‌ గ్రేడ్‌ రకం పొగాకు ఉత్పత్తులు రావడం రైతుల్లో ఆశలు పెంచుతోంది. రెండేళ్ల నుంచి రైతులకు సరైన ధరలు రావడం లేదు. దీంతో రైతులు నష్టాలను మూటగట్టుకున్నారు. కనీసం ఈ ఏడాదైనా మద్దతు ధరలు ఇచ్చి ఆదుకోవాలని రైతుల నుంచి డిమాండ్‌ వినిపిస్తోంది.

కర్ణాటక ప్రభావం ఎంత...

కర్ణాటక రాష్ట్రంలో జరుగుతున్న పొగాకు వేలంలో ఆశించిన మేర ధరలు రాకపోవడం ప్రస్తుతం ఆందోళన కలిగించే అంశం. మొదట్లో బ్రైట్‌గ్రేడ్‌ రకం పొగాకు కేజీకి రూ.320లకు ధరలు ఇచ్చి వ్యాపారులు తరువాత దాన్ని రూ.280లకు తగ్గించి ప్రస్తుతం రూ.300ల వరకు ఇస్తున్నారు. ఈ ప్రభావం ఇక్కడి మార్కెట్‌ ఎంత ఉంటుందనే చర్చలు నడుస్తున్నాయి. ఇక్కడ ప్రారంభమయ్యే వేలం కూడా ఇదే రకమైన రేట్లు ఉంటే మరోసారి నష్టాలు తప్పవనే అభిప్రాయం రైతుల్లో ఉంది.

నేడు బోర్డు మీటింగ్‌

పొగాకు వేలం ప్రక్రియ ప్రారంభంపై నేడు గుంటూరులో పొగాకు బోర్డు కీలక సమావేశం నిర్వహించనుంది. ఈ సమావేశంలో పొగాకు వేలం ప్రారంభంపై ఓ నిర్ణయం తీసుకోనున్నారు. మార్చి నెలాఖరుకు ప్రారంభించాలా లేదా ఏప్రిల్‌ మొదటి వారంలో ప్రారంభించాలా అన్న దానిపై ఓ నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంది. కర్ణాటకలో వేలం ముగియనందునే ఇక్కడ ఆలస్యమవుతుందని, అక్కడి వేలం ముగిసి వ్యాపారులు వస్తేనే వేలం ప్రారంభించాలనే ఆలోచనలో బోర్డు ఉన్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో వేలం ప్రారంభంపై నేడు జరిగే బోర్డు మీటింగ్‌ కీలకం కానుంది.

కోల్డ్‌ స్టోరేజ్‌ల్లో భారీగా నిల్వలు

ఇప్పటికే క్యూరింగ్‌ పూర్తి అవడంతో రైతుల వద్ద భారీగా పొగాకు ఉత్పత్తులు నిల్వ ఉన్నాయి. దీంతో వీటి నాణ్యత దెబ్బతినకుండా కోల్డ్‌స్టోరేజ్‌ల్లో నిల్వ చేస్తున్నారు. బోర్డు నిర్ణయించిన దాని ప్రకారం 11 వేలం కేంద్రాల పరిధిలో 90.20 మిలియన్‌ కేజీలు మాత్రమే విక్రయించాల్సి ఉంది. దాదాపు 130 మిలియన్‌ కేజీల వరకు ఉత్పత్తి ఉండవచ్చని బోర్డు అధికారులు భావిస్తున్నారు. అంటే దాదాపు నవంబర్‌, డిసెంబర్‌ వరకు వేలం జరిగే అవకాశాలు ఉన్నాయి. సుదీర్ఘకాలం వేలం జరిగే అవకాశం ఉన్నందున నాణ్యత దెబ్బతినకుండా, మార్కెట్‌కు అనుగుణంగా అమ్ముకోవచ్చనే అభిప్రాయంతో రైతులు కోల్డ్‌స్టోరేజ్‌ల్లో అధికంగా పొగాకును నిల్వ చేసుకుంటున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement