కొనకనమిట్ల: ప్రసిద్ధిగాంచిన వెలుగొండ పుణ్యక్షేత్రంలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. గురువారం తెల్లవారుజామున వేద పండితుల మంత్రోచ్ఛారణలు, మంగళ వాయిద్యాల నడమ శ్రీలక్ష్మీ అలివేలుమంగ సమేత వెంకటేశ్వర స్వామి కల్యాణోత్సవం కమనీయంగా నిర్వహించారు. భక్తుల గోవింద నామ స్మరణతో వెలగొండ క్షేత్రం ప్రతిధ్వనించింది. ముందుగా రంగురంగుల పుష్పాలతో శోభాయమానంగా అలంకరించిన వేదికపై ఉభయదేవేరులతో సహా శ్రీవారి ఉత్సవమూర్తులను ప్రతిష్ఠించి పూజలు చేశారు. కల్యాణ ఉభయదాతలుగా వాగిచెర్ల, జూటూరి, మూర్తి, తాడి కుటుంబ సభ్యులు, ఆలయ ఈఓ చెన్నకేశవరెడ్డి, కమిటీ సభ్యుడు కుందురు కాశిరెడ్డి దంపతులు వ్యవహరించి స్వామి వారికి పట్టువస్త్రాలు, పసిడి, రజత, ఆభరణాలు సమర్పించారు. వేద పండితులు వెంకటరమణాచార్యులు భార్గవ రామాచార్యులు, పవన్‌కుమార్‌శర్మ, తిరుమలాచార్యులు కల్యాణ క్రతువును శాస్త్రోక్తంగా నిర్వహించారు. కల్యాణ వ్యాఖ్యాతగా తాల్లూరి దుర్గా వెంకటేశ్వరరావు వ్యవహరించారు. వెలుగొండ క్షేత్ర పరిసర గ్రామాల ప్రజలతోపాటు ఒంగోలు, మార్కాపురం, విజయవాడ, తెనాలి, చీరాల, వినుకొండ, నంద్యాల, హైదరాబాద్ తదితర ప్రాంతాల నుంచి భక్తులు హాజరై కల్యాణాన్ని తిలకించారు.
శ్రీవారికి ముత్యాల తలంబ్రాలు
స్వామివారికి భక్తులు సమర్పించిన ముత్యాలతో ఉభయదాతలు తలంబ్రాలు పోశారు. తొలుత తాడివారిపల్లికి చెందిన తాడివారు కత్తులు కటార్లతో ఆచారం ప్రకారం గుర్రాల మీద ఉత్సవంగా ఆలయానికి చేరుకున్నారు. కల్యాణానికి ముందు నిశ్చితార్ధ రాయబార ఘట్టం ఉత్సాహంగా సాగింది. కల్యాణం అనంతరం మహిళలకు ముత్యాల తలంబ్రాలు, తీర్థ ప్రసాదాలు, అలాగే లాటరీ ద్వారా 10 మంది మహిళా భక్తులకు చీరలు అందజేశారు. ఉదయం ఆల్పాహరాన్ని బ్రాహ్మణ అన్నదాన సత్రం కమిటీ సభ్యులు ఏర్పాటు చేశారు.
వైభవంగా సాగుతున్న వెలుగొండ బ్రహ్మోత్సవాలు
ముత్యాలతో స్వామివారికి తలంబ్రాలు
గోవింద నామస్మరణతో
పరవశించిన భక్తులు


