గురువారం శ్రీ 12 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2026
న్యూస్‌రీల్
లేబర్ కోడ్స్‌ను వెంటనే ఉపసంహరించుకోవాలి
పోస్టల్ కార్యాలయాల్లో ఆధార్ ప్రత్యేక క్యాంపులు
కార్మిక నగర్ భూములు కబ్జా చేసేందుకు యత్నాలు ఇక్కడి నుంచి వెళ్లిపోవాలంటూ నివాసితులకు బెదిరింపులు కంచె వేయడానికి వచ్చిన పచ్చ ముఠా అడ్డుకున్న కార్మిక నగర్ బాధితులు ఇంత జరుగుతున్నా పట్టించుకోని అధికారులు 2013లోనే కార్మికనగర్ చిరునామాతో ఆధార్ కార్డులు ఆక్రమణల మరకలు వైఎస్సార్ సీపీకి అంటించేందుకు ఎల్లో గ్యాంగ్ యత్నాలు
కంచె వేయడానికి వచ్చిన వారిని అడ్డుకుంటున్న బాధిత మహిళలు
వారంతా కార్మికులు. చిన్నపాటి ఉద్యోగాలు చేసుకుంటూ కుటుంబాలను పోషించుకుంటున్నారు. పదిహేను సంవత్సరాలుగా కార్మికనగర్‌లో చిన్న చిన్న ఇళ్లు నిర్మించుకుని నివాసముంటున్నారు. రూ.కోట్ల విలువజేసే ఈ భూములపై బడాబాబుల కన్నుపడింది. ఈ నెల 4వ తేదీ అధికార పార్టీ ప్రజాప్రతినిధుల అండతో కిరాయి దుండగులు రాత్రికిరాత్రే జేసీబీలతో ఇళ్లను కూల్చేసి నిలువ నీడ లేకుండా చేశారు. అవి ఇనాం భూములని రికార్డుల్లో ఉంది. కానీ, రిజిస్టర్డ్ భూములంటూ ప్రైవేటు వ్యక్తులు వచ్చి ఇళ్లు కూల్చేస్తుంటే పోలీసులు, రెవెన్యూ, నగరపాలక సంస్థ అధికారులు పట్టించుకోకపోవడం గమనార్హం. వారం రోజులవుతున్నా ఇళ్లు కూల్చేసిన వారిపై ఎలాంటి కేసులు నమోదు చేయకపోవడంపై భిన్న కథనాలు ప్రచారంలో ఉన్నాయి. అసలు ఈ కూల్చివేతల వెనుకున్న అదృశ్య శక్తి ఎవరన్న దానిపై చర్చ సాగుతోంది.
15 ఏళ్లుగా నివాసం ఉంటున్నాం
కుటుంబంతో కలిసి 15 ఏళ్లుగా కార్మిక నగర్లోనే నివాసం ఉంటున్నాం. మేము ఎవరి రిజిస్టర్ భూములనూ ఆక్రమించుకోలేదు. ఇనాం భూములలో తలదాచుకున్నాం. ఈ భూమిని సర్వే చేసి ప్రభుత్వ భూమిలో మాకు పట్టాలు ఇవ్వాలని పదేళ్లుగా అధికారుల చుట్టూ తిరుగుతున్నాం. ఇప్పుడు కూడా మేము అదే అడుగుతున్నాం. వెంటనే ఈ భూమిని సర్వే చేసి నిజానిజాలు తేల్చాలి. అప్పటి వరకు మేము కార్మిక నగర్లోనే నివాసం ఉండేందుకు అనుమతివ్వాలి. ప్రభుత్వం రక్షణ కల్పించాలి.
– గరికపూడి సుధాకర్
అధికారులు జోక్యం చేసుకోవాలి
నేను ప్రైవేటు కారుకు డ్రైవర్‌గా పనిచేస్తుంటాను. నగరంలో ఉండటానికి ఇళ్లు లేక 15 ఏళ్లుగా కార్మిక నగర్లో నివాసం ఉంటున్నాను. రాత్రికి రాత్రి మా ఇళ్లను కూల్చివేశారు. ఇళ్లు ఖాళీ చేసి వెళ్లిపొమ్మని బెదిరిస్తున్నారు. ఎక్కడికి వెళ్లాలో అర్థం కావడంలేదు. ప్రభుత్వం, అధికారులు వెంటనే జోక్యం చేసుకోవాలి. ఇనాం భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకుని నివాసితులకు పట్టాలివ్వాలి.
– కురగంటి మనోహర్
కూల్చివ్యథలు
సాక్షి ప్రతినిధి, ఒంగోలు: ముక్తినూతలపాడు పంచాయతీ పరిధిలోని సర్వే నంబర్ 186/1లో 4.62 ఎకరాలు, 186/2లో 4.47 ఎకరాల ఇనాం భూమిలో నగరంలోని వివిధ ప్రాంతాలకు చెందిన ఇళ్లు లేని నిరుపేదలు కొందరు నివాసాలు ఏర్పాటు చేసుకున్నారు. తొలుత తడికలతో పాకలు వేసుకున్నారు. తరువాత చిన్న చిన్న రేకుల షెడ్లు వేసుకుని పిల్లాపాపలతో జీవిస్తున్నారు. వీరిలో కొందరికి 2012 నుంచి కార్మికనగర్, నియర్ ఎంఎన్‌ఆర్ కేన్సర్ హాస్పిటల్ చిరునామాతో ఆధార్ కార్డులు కూడా మంజూరయ్యాయి. మధ్యలో ఒకసారి 2018లో చదలవాడ గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు ఈ భూమి తమదని చెబుతూ 50 మందిని తీసుకొచ్చి నాలుగు ఇళ్లు కూల్చివేశారు. దాంతో బాధితులు కోర్టును ఆశ్రయించారు. కోర్టు 2018లో ఇంజక్షన్ ఆర్డర్ ఇచ్చింది. ప్రస్తుతం కేసు కోర్టు పరిధిలో ఉంది. ఆ తరువాత 2023లో సిట్ కేసు నమోదు చేసి కొందరిని అరెస్టు చేశారు. అయితే, రెవెన్యూ రికార్డుల్లో మీ భూమి వెబ్‌సైట్‌లో ఇప్పటికీ ఈ భూములు ఇనాం భూములుగానే రికార్డయి ఉండటం గమనార్హం. వాస్తవాలు ఇలా ఉండగా, ఈ మరకలను వైఎస్సార్ సీపీకి అంటించడానికి ఎల్లో మీడియా విషపు రాతలు రాస్తోంది. ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నిస్తుండడంతో బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
దౌర్జన్యంగా ఇళ్లు కూల్చివేత...
పరిస్థితి ఇలా ఉండగా ఈ నెల 4వ తేదీ సాయంత్రం సుమారు 150 నుంచి 200 మంది ప్రైవేటు సైన్యాన్ని వెంటబెట్టుకొని కొందరు వ్యక్తులు కార్మిక నగర్లోకి ప్రవేశించారు. వెంట మూడు జేసీబీలు తీసుకొచ్చారు. వచ్చీరాగానే మూడు గ్రూపులుగా విడిపోయి బలవంతంగా ఇళ్లను కూల్చివేయడం మొదలుపెట్టారని బాధితులు చెబుతున్నారు. ఇళ్లల్లో నిద్రపోతున్న చిన్నారులు, పిల్లలను బయటకు లాగి పడేశారు. అడ్డొచ్చిన మహిళలు, యువకులపైకి ఎగబడ్డారు. కనీసం ఇంట్లోని సామాన్లు తీసుకునేందుకు అవకాశం ఇవ్వమని బతిమాలినా వినలేదంటూ బాధితులు వాపోతున్నారు. ఇళ్లు కూల్చివేసిన తరువాత ఇంటి నిర్మాణానికి వాడిన కర్రలు, సిమెంటు రేకులను ధ్వంసం చేశారని, కాలనీలో చెట్లను నరికినట్లు మొదలుకంటా తీసేశారని, చివరికి పొయ్యి మీద ఉడుకుతున్న అన్నం గిన్నెను కూడా కాలితో తన్నారని ఒక బాధిత మహిళ కన్నీటి పర్యంతమైంది. డయల్ 100కు ఫోన్ చేస్తే ముగ్గురు పోలీసులు వచ్చి చోద్యం చూస్తూ నిలబడ్డారని బాధితులు ఆరోపించారు. 15 ఏళ్లకుపైగా ఇక్కడ నివాసం ఉంటున్న నిరుపేదలు కట్టుబట్టలతో రోడ్డున పడ్డారు. వారం రోజుల నుంచి ప్రైవేటు వ్యక్తులు బాధితులను బెదిరిస్తూనే ఉన్నారు. రోజూ ఏదోక సమయంలో కార్మిక నగర్లోకి వచ్చి ఘర్షణలు పెట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. బుధవారం కార్మిక నగర్‌కు వచ్చిన ప్రైవేటు వ్యక్తులు ఫెన్సింగ్ వేసేందుకు ప్రయత్నించడంతో బాధితులు అడ్డుకున్నారు.
అధికారులు, పోలీసులు ఏమయ్యారు...
కార్మిక నగర్‌లోని పేదల ఇళ్లను కూల్చివేసి నేటికి వారం రోజులు. ఇళ్లను కూల్చివేసిన ప్రదేశంలో మీడియా సమావేశం పెట్టి బహిరంగంగా తామే ఇళ్లను కూల్చివేశామని ప్రైవేటు వ్యక్తులు ప్రకటిస్తుంటే ప్రభుత్వం ఏమైంది? ప్రభుత్వ అధికారులు, పోలీసులు ఏమాయ్యారని నగర ప్రజలు, ప్రజా సంఘాల నాయకులు ప్రశ్నిస్తున్నారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకున్న వ్యక్తుల మీద కేసులు ఎందుకు నమోదు చేయలేదు, ఎందుకు అరెస్టు చేయలేదన్న ప్రశ్నలకు అధికారుల నుంచి జవాబులేదు. ప్రభుత్వ పెద్దల ఒత్తిడి వలనే అధికారులు నోరు మెదపడంలేదన్న వాదనలు వినిపిస్తున్నాయి.
ఇనాం భూములను రిజిస్టర్ ఎలా చేస్తారు..?
కార్మిక నగర్‌ను కూల్చివేసిన ప్రైవేటు వ్యక్తులు ఈ భూమిని రిజిస్టర్డ్ భూమిగా ప్రచారం చేస్తున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. రెవెన్యూ రిజిస్టర్లో ఈ భూములు ఇనాం భూములుగా ఉన్నాయి. అయితే ఇందులో 186/1లో 0.1800 భూమి ఒక వ్యక్తికి అనువంశికంగా, 0.1100 భూమి మరో వ్యక్తి కొనుగోలు చేసినట్లు ఉంది. ఇనాం భూములు ఎవరూ కొనడానికి, అమ్మడానికి వీలులేదని ప్రభుత్వ నిబంధనలు పేర్కొంటున్నాయి. మరి ఇనాం భూముని ఒక వ్యక్తి కొనుగోలు చేసినట్లు మీ భూమి వెబ్‌సైట్‌లో చూపించడం పట్ల బాధితులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఇనాం భూములను ఎలా రిజిస్టర్ చేశారని బాధితులు ప్రశ్నిస్తున్నారు. దీనికి రెవెన్యూ అధికారులు జవాబు చెప్పడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇన్నేళ్లుగా లేని అభ్యంతం ఇప్పుడే ఎందుకు వచ్చిందన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ భూమిని సర్వే చేసి ఇందులో ప్రభుత్వ భూమి లెక్క తేల్చాలని గత పదేళ్లుగా అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నప్పటికీ పట్టించుకోవడం లేదని బాధితులు చెబుతున్నారు. ప్రభుత్వ భూమి అయితేనే తమకు పట్టాలు ఇవ్వాలని అధికారులకు మొరపెడుతున్నా పట్టించుకోవడంలేదని వాపోతున్నారు.
కూల్చివేతల వెనక పెద్ద తలకాయలు...
కార్మిక నగర్ కూల్చివేతల వెనక పెద్ద తలకాయలు ఉన్నట్లు జిల్లాలో ప్రచారం జరుగుతోంది. ఒక కీలక నేత ఆదేశాలతోనే కూల్చివేత జరిగినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. నగర పరిధిలో దశాబ్దాలుగా కాపురాలు చేసుకుంటున్న వారి నివాసాలను ప్రైవేటు వ్యక్తులు వచ్చి ఎలా కూలగొడతారని బాధితులు ప్రశ్నిస్తున్నారు. సుమారు రూ.100 కోట్ల విలువ చేసే ఈ భూములపై కన్నేసిన అధికార పార్టీ నాయకులు ఎలాగైనా సరే దీన్ని కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. మంగళవారం రాత్రి బాధితులను పిలిపించిన కీలక నేత ఆ స్థలం ఖాళీ చేసి వెళ్లాలని హుకుం జారీ చేసినట్లు ప్రచారం జరుగుతోంది.
ఒంగోలు సబర్బన్: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన లేబర్ కోడ్స్‌ను వెంటనే ఉపసంహరించుకోవాలని యూఎఫ్‌బీయూ కన్వీనర్ రాజీవ్ రతన్ దేవ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం నగరంలోని నెల్లూరు బస్టాండ్ సెంటర్‌లోని యూనియన్ బ్యాంకు ఆఫ్ ఇండియా ముందు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రాజీవ్ రతన్ దేవ్ మాట్లాడుతూ ఈ నెల 12న దేశ వ్యాప్తంగా నిర్వహిస్తున్న సార్వత్రిక సమ్మెకు సంఘీభావంగా నిరసన చేపట్టామన్నారు. అన్ని యూనియన్లు సార్వత్రిక సమ్మెకు మద్దతు తెలుపుతున్నాయన్నారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కార్యక్రమంలో యూనియన్ల నాయకులు సుబ్బారావు, రాజేష్ ఖన్నా, వి.శ్రీనివాస రావు, ఉమా శంకర్, సుధాకరరావు, బ్రహ్మనాయుడుతో పాటు పలువురు పాల్గొన్నారు.
ఒంగోలు వన్‌టౌన్: ప్రకాశం పోస్టల్ డివిజన్ పరిధిలోని చీమకుర్తి, మద్దిపాడు, వేటపాలెం, పర్చూరు పోస్టల్ కార్యాలయాల్లో ఉన్న ఆధార్ కేంద్రాల్లో ప్రత్యేక ఆధార్ క్యాంపులు నిర్వహించనున్నట్లు సీనియర్ సూపరింటెండెంట్ ఎండీ జాఫర్ సాధిక్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆధార్ ప్రత్యేక క్యాంపులను ఈ నెల 12 నుంచి 28వ తేదీ వరకూ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఐదేళ్ల వయస్సు నుంచి 15 సంవత్సరాల వయస్సు ఉన్న వారికి ఆధార్ బయోమెట్రిక్ తప్పనిసరి అని తెలిపారు. ఈ సేవలు ఈ నెల 30వ తేదీ వరకూ పూర్తి ఉచితంగా నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఒంగోలు, కందుకూరు, చీరాల, సంతనూతలపాడు, టంగుటూరు పోస్టు ఆఫీసులలో ఆధార్ సేవలు ప్రజలకు అందుబాటులో ఉంటాయన్నారు. ఆధార్ నమోదు పూర్తిగా ఉచితం అని, డిమోగ్రాఫిక్ అప్‌డేట్‌కు రూ.75, బయోమెట్రిక్ అప్‌డేట్ రూ.125 చెల్లించాల్సి ఉంటుందన్నారు. 15 నుంచి 17 సంవత్సరాల మధ్య వారికి బయోమెట్రిక్ అప్‌డేట్ తప్పనిసరి అన్నారు.
గురువారం శ్రీ 12 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2026
గురువారం శ్రీ 12 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2026
గురువారం శ్రీ 12 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2026
గురువారం శ్రీ 12 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2026


