ఉగాది నాటికి ఇళ్ల నిర్మాణాలు పూర్తికావాలి
మార్కాపురం: వచ్చే నెలలో ఉగాది పండుగ నాటికి నిర్దేశించిన లక్ష్యం ప్రకారం లబ్ధిదారులతో ఇళ్లు కట్టించి గృహ ప్రవేశం చేయించాలని మార్కాపురం జిల్లా గృహ నిర్మాణ శాఖ ఇన్‌చార్జి పీడీ శ్రీనివాసప్రసాద్ చెప్పారు. బుధవారం ఎంపీడీఓ కార్యాలయంలో జిల్లాలోని హౌసింగ్ డీఈలు, ఏఈలు, వర్క్ ఇన్‌స్పెక్టర్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. మార్కాపురం, గిద్దలూరు, యర్రగొండపాలెం, కనిగిరి నియోజకవర్గాల్లో మొత్తం 5,169 ఇళ్ల నిర్మాణాన్ని ఉగాది రోజు ప్రారంభించేలా చర్యలు చేపట్టాలన్నారు. ఇందులో వైపాలెం నియోజకవర్గంలో 1140, గిద్దలూరు నియోజకవర్గంలో 1469, మార్కాపురం నియోజకవర్గంలో 1971, కనిగిరి నియోజకవర్గంలో 598 గృహాలను లక్ష్యంగా పెట్టుకుని పూర్తిచేయించాలన్నారు. ఇందులో బీసీ ఎస్సీలకు రూ.50 వేలు, ఎస్టీలకు రూ.75 వేలు, చెంచులకు ప్రత్యేకంగా 1 లక్ష రూపాయలను ప్రభుత్వం మంజూరు చేస్తుందన్నారు. ఆయా గృహాల్లో టాయిలెట్ల నిర్మాణం పూర్తి చేయించాలన్నారు. జిల్లాలో ఆవాస్ పీఎంజేవై పథకం కింద 24,177 ఇళ్ల నిర్మాణాల సర్వే పూర్తయిందని చెప్పారు. ఇల్లు కట్టుకునే విషయంలో లబ్ధిదారులకు సలహాలు, సూచనలు ఇవ్వాలని, త్వరగా పూర్తయ్యేలాగా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అనంతరం పట్టణ శివార్లలో నిర్మాణంలో ఉన్న పలు గృహాలను మార్కాపురం ఇన్‌చార్జి ఈఈ పవన్‌కుమార్‌తో కలిసి పరిశీలించారు.


