దివ్యాంగుల పెన్షన్ మంజూరులో కూటమి వివక్ష
వైఎస్సార్ సీపీ దివ్యాంగుల విభాగం రాష్ట్ర అధ్యక్షుడు పులిపాటి దుర్గారెడ్డి
ఒంగోలు టౌన్: రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత దివ్యాంగుల పెన్షన్ మంజూరు, తొలగింపులో తీవ్ర వివక్ష కొనసాగుతోందని వైఎస్సార్ సీపీ దివ్యాంగుల విభాగం రాష్ట్ర అధ్యక్షుడు పులిపాటి దుర్గారెడ్డి విమర్శించారు. రాష్ట్ర పర్యటనలో భాగంగా ఆయన బుధవారం ఒంగోలుకు వచ్చారు. కిమ్స్ హాస్పిటల్ జాతీయ రహదారి వద్ద ఆయనను వైఎస్సార్ విభాగం జిల్లా నాయకుడు కొండరాజు రమణయ్య ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా పులిపాటి దుర్గారెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత దివ్యాంగుల పెన్షన్ విషయంలో ఉద్దేశపూర్వకంగా గందరగోళ పరిస్థితులు సృష్టించారని ఆరోపించారు. దాంతో రాష్ట్ర వ్యాప్తంగా దివ్యాంగుల పరిస్థితి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లు తయారైందన్నారు. సదరన్ రీ వెరిఫికేషన్‌లో కూటమి ప్రభుత్వం దివ్యాంగులను వేధింపులకు గురిచేస్తోందని చెప్పారు. దివ్యాంగులు ప్రతి ఒక్కరూ లబ్ధిదారులుగా ఉండాలన్నదే తన లక్ష్యమన్నారు. దివ్యాంగులను చైతన్యపరుస్తూ రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తున్నట్లు చెప్పారు. పులిపాటి దుర్గారెడ్డి వెంట రాష్ట్ర వర్కింగ్ ప్రసిడెంట్ ఆవుల నాగేందర్, ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షుడు కోణతం చంద్రశేఖర్ తదితరులు ఉన్నారు.


