శంకరా..పయనమెలా..
శ్రీశైలానికి పెరిగిన భక్తుల రద్దీ యాత్రికుల సౌకర్యంపై దృష్టి సారించని దేవస్థానం అధికారులు నడక భక్తుల కోసం టెంట్లు, తాగునీరు సైతం ఏర్పాటు చేయని సిబ్బంది
పెద్దదోర్నాల: మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీశైలంలోని శ్రీగిరి పర్వతంపై వెలసిన భ్రమరాంబ మల్లికార్జునల దర్శనానికి తరలివెళ్లే శివభక్తుల సంఖ్య రోజురోజుకూ గణనీయంగా పెరుగుతోంది. శివరాత్రి పర్వదినానికి ముందే అట్టహాసంగా ప్రారంభమైన బ్రహ్మోత్సవాల్లో పాల్గొనేందుకు భక్తులు భారీగా తరలివెళ్తున్నారు. దీంతో శ్రీశైల ముఖద్వారంగా పేరొందిన దోర్నాలలో యాత్రికులు, శివస్వాముల రద్దీ పెరిగింది.
యాత్రికుల సౌకర్యంపై దృష్టి సారించని దేవస్థానం అధికారులు..
శివరాత్రి పర్వదినానికి మరో రెండు రోజులు మాత్రమే ఉన్నా మండల కేంద్రంలో దేవస్థానం అధికారులు ఎటువంటి సౌకర్యాలు కల్పించకపోవటంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శ్రీశైలం ముఖద్వారంగా పేరొందిన పెద్దదోర్నాలలో యాత్రికులకు కనీస సౌకర్యాలు కల్పించడంలో శ్రీశైల దేవస్థానం అధికారులు చొరవ చూపకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తెలంగాణ జిల్లాలను మినహాయించి రాష్ట్రంలోని అన్ని జిల్లాలతో పాటు కేరళ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుంచి వచ్చే భక్తులు సైతం పెద్దదోర్నాల మండల కేంద్రం మీదుగా శ్రీశైలం వెళ్లాల్సిందే. సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు దోర్నాల నుంచి 50 కిలోమీటర్ల మేర నల్లమలగుండా శ్రీశైలం ప్రయాణించాల్సి ఉంది. అటవీ ప్రాంతంలో ఎటువంటి సౌకర్యాలు లేనందున ఎందరో భక్తులు దోర్నాలలోనే బసచేసి భోజన, అల్పాహార కార్యక్రమాలు చూసుకున్న తరువాత శ్రీశైలం ప్రయాణమవుతారు. దీంతో సాధారణ సమయాల్లోనే అధిక రద్దీ ఉన్న దోర్నాలలో శివరాత్రి, ఉగాది పర్వదినాల సందర్భంగా వేల మంది యాత్రికులతో మండల కేంద్రం కిటకిటలాడుతుంది. దీనిని దృష్టిలో ఉంచుకుని దేవస్థానం అధికారులు మండల కేంద్రంలో మంచినీటి సౌకర్యం, తాత్కాలిక వసతి సౌకర్యం, తాత్కాలిక మరుగుదొడ్లు ఏర్పాటు చేయకపోవడంపై యాత్రికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతంలో మండల కేంద్రంలోని శివసదనంలో టెంట్లు వేసి దానికి అనుగుణంగా విశ్రాంతి తీసుకునేందుకు కార్పెట్లు ఏర్పాటు చేసేవారు. అధికారుల నిర్లక్ష్యంతో టెంట్లను సైతం వేయకపోవటంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.


