నారీ విలాపం | - | Sakshi
Sakshi News home page

నారీ విలాపం

Jan 5 2026 7:35 AM | Updated on Jan 5 2026 7:35 AM

నారీ

నారీ విలాపం

● రోజుకు ఇద్దరు మహిళలపై నేరాలు ● నాలుగు రోజులకో బాలికపై లైంగికదాడి ● బడిలో కూడా రక్షణ కరువు ● ప్రేమ పేరుతో మోసపోయిన ఎంటెక్‌ విద్యార్థిని ఆత్మహత్య ● బాలికను నాగార్జున సాగర్‌ తీసుకెళ్లి లైంగికదాడి ● పని ప్రదేశంలో మహిళలపై పెరిగిన లైంగికదాడులు ● దిశను నిర్వీర్యం చేసిన చంద్రబాబు ప్రభుత్వం

మహిళలు, బాలికలపై వేధింపులు, లైంగికదాడులు చంద్రబాబు ప్రభుత్వంలో నిత్యకృత్యమయ్యాయి. నిత్యం ఎక్కడో ఒక చోట మహిళలపై అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి. చివరకు బడిలో కూడా బాలికలకు రక్షణ లేకుండా పోయింది. వీటికి తోడు బాలికలు, మహిళల మిస్సింగులు కొనసాగుతూనే ఉన్నాయి. మహిళలపై అకృత్యాలకు సంబంధించి గత రెండేళ్లలో జిల్లాలో 1564 కేసులు నమోదవడం పరిస్థితికి అద్దం పడుతోంది.
● రోజుకు ఇద్దరు మహిళలపై నేరాలు ● నాలుగు రోజులకో బాలికపై లైంగికదాడి ● బడిలో కూడా రక్షణ కరువు ● ప్రేమ పేరుతో మోసపోయిన ఎంటెక్‌ విద్యార్థిని ఆత్మహత్య ● బాలికను నాగార్జున సాగర్‌ తీసుకెళ్లి లైంగికదాడి ● పని ప్రదేశంలో మహిళలపై పెరిగిన లైంగికదాడులు ● దిశను నిర్వీర్యం చేసిన చంద్రబాబు ప్రభుత్వం
● గత ఏడాది కాలంలో మిస్‌ అయిన బాలికలు: 136 మంది, మహిళలు: 264 మంది

బిలాల్‌ నగర్‌లో బాలికను వేధిస్తున్నట్లు ఫిర్యాదు

నగరంలోని బిలాల్‌ నగర్‌లో ఒక బాలికను వేధిస్తున్నట్లు బాలిక తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదు చేసి 15 రోజులు గడుస్తున్నా పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోలేదని బాధితుడు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించే మీ కోసం వేదికలో ఎస్పీని కలిసి ఫిర్యాదు చేశాడు. కలెక్టర్‌కు కూడా ఫిర్యాదు చేశాడు. డీఎస్పీని కలిసి తన కూతురికి రక్షణ కల్పించడమంటూ వేడుకున్నా ప్రయోజనం లేకుండా పోయిందని, అధికార పార్టీ నాయకుల ఒత్తిడి వల్లనే పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని బాధితుడు వాపోతున్నాడు. ఇలా నిత్యం ఎక్కడో ఒక చోట మహిళలు, బాలికలపై అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి.

చదువుకోవడానికి బడికి వెళితే..

చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక చదువుకోడానికి బడికి వెళ్లినా రక్షణ లేకుండా పోయిందని బాలికల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దర్శి పట్టణంలోని కురిచేడు రోడ్డులో నివాసం ఉండే ఇద్దరు చిన్నారులు పట్టణంలోని ఒక ప్రభుత్వ పాఠశాలలో 5వ తరగతి చదువుకుంటున్నారు. అదే పాఠశాలలో చదువు చెబుతున్న ఒక ఉపాధ్యాయుడు వీరి మీద కన్నేశాడు. ఎప్పటిలాగే స్కూలుకు వెళ్లిన ఆ ఇద్దరు చిన్నారులను సాయంత్రం స్కూలు వదిలిన తరువాత కూడా వేచి ఉండమని చెప్పాడు. విద్యార్థులందరూ వెళ్లి పోయాక ఆ చిన్నారులతో అసభ్యంగా ప్రవర్తించాడు. ఉపాధ్యాయుడి ప్రవర్తన చూసి భయపడిపోయిన చిన్నారులు ఇంటికి వెళ్లి జరిగింది చెప్పడంతో కేసు నమోదు చేయడమే కాకుండా కీచక గురువును సస్పెండ్‌ చేశారు.

నారా వారి

పాలనలో..

సాక్షి ప్రతినిధి, ఒంగోలు:

హిళలకు రక్షణ కల్పిస్తామని ప్రగల్భాలు పలికిన చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత జిల్లాలో మరింతగా దాడులు, అత్యాచారాలు పెరిగిపోయాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొత్తలోనే టంగుటూరు ప్రభుత్వ పాఠశాలలో ఆరేళ్ల చిన్నారిపై ఉపాధ్యాయుడు లైంగికంగా అసభ్యంగా ప్రవర్తించడం కలకలం సృష్టించింది. ఆ తరువాత వరుసగా బాలికల మీద లైంగికదాడులు జరుగుతూనే ఉన్నాయి. బాలికలకు రక్షణ కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇక మహిళల సంగతి సరే సరి. ప్రతి రోజూ అదనపు కట్నం కోసమో, ఇతరత్రా కారణాలతో మహిళల మీద నేరాలు జరుగుతూనే ఉన్నాయి. ఒక మహిళా హోం మంత్రి పాలనలో కూడా మహిళలకు రక్షణ లేకుండాపోవడం బాధాకరమని మహిళా సంఘాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి.

రోజుకు ఇద్దరు మహిళలపై అఘాయిత్యం..

రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత జిల్లాలో మహిళలపై అఘాయిత్యాలు పెరిగిపోయాయి. ప్రతి రోజూ ఇద్దరు మహిళలు ఏదో ఒక రకమైన వేధింపులకు గురవుతున్నారు. కట్నం కోసం హతమార్చడం కావచ్చు, అదనపు కట్నం కోసం వేధింపులు, గృహహింస, ఇతరత్రా కారణాలతో మహిళలు ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. మహిళలపై అకృత్యాలకు సంబంధించి 2024లో 475 కేసులు నమోదు కాగా, 2025లో 440 కేసులు నమోదయ్యాయి. ఈ రెండేళ్లలో 915 కేసులు నమోదయ్యాయి. ఇక మహిళల హత్యలు, కిడ్నాపులు వంటి కేసులు 2024లో 274 నమోదు కాగా, 2025లో 180 కేసులు నమోదవడం గమనార్హం. మొత్తం మీద మహిళలకు వ్యతిరేకంగా 2024లో 855 కేసులు, 2025లో 709 కేసులు నమోదయ్యాయి. అంటే ఈ రెండేళ్లలో 1564 కేసులు నమోదయ్యాయి. ఈ ఏడాది ఒక్కటే ప్రతి రోజూ రెండు కేసుల చొప్పున నమోదయ్యాయి. పోలీసు స్టేషన్‌ గడప తొక్కని కేసులు ఇంకెన్ని ఉన్నాయో ఊహించడం కష్టం. మహిళల రక్షణ కోసం వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వంలో తీసుకొచ్చిన దిశ యాప్‌ను మూలనడేసిన చంద్రబాబు ప్రభుత్వం కొత్తగా శక్తి యాప్‌ అని తీసుకొచ్చింది. శక్తి యాప్‌ను నామమాత్రంగా మహిళల ఫోన్‌లలో డౌన్‌లోడ్‌ చేసి ఇక దాని గురించి పట్టించుకోవడం మానేశారు. దీంతో ఈ యాప్‌ వల్ల మహిళలకు ఎటువంటి ఉపయోగం లేకుండా పోయింది.

బాలికలకు రక్షణేది..

జిల్లాలో బాలికల మీద లైంగికదాడులు పెరిగిపోయాయి. బాలికల మీద ఈ రెండేళ్లలో 177 కేసులు నమోదయ్యాయి. ఈ ఏడాది పోలీసు రికార్డులు పరిశీలిస్తే నాలుగు రోజులకో బాలిక మీద లైంగికదాడి జరిగినట్లు తెలుస్తోంది. పిక్కిలి ఆంజనేయులు అనే టీడీపీ నాయకుడు యర్రగొండపాలెం మండలంలోని ఒక గ్రామంలో కిరణా దుకాణం నిర్వహిస్తున్నాడు. తినుబండరాల కోసం దుకాణానికి వెళ్లిన 9, 8 సంవత్సరాల వయసు కలిగిన ఇద్దరు బాలికలను మాయమాటలతో మభ్య పెట్టి దుకాణం వెనకకు తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డాడు. కురిచేడు పరిసరాలకు చెందిన ఒక 16 ఏళ్ల బాలికను రాగుల శ్రీను అనే కామాంధుడు మాయమాటలతో నాగార్జున సాగర్‌కు తీసుకెళ్లి లాడ్జిలో నిర్బంధించి ఐదు రోజుల పాటు లైంగికదాడి చేశాడు. ఈ ఘటనలో బాలిక తల్లిదండ్రులు కేసు పెట్టకుండా రాజీ చేసేందుకు ప్రయత్నించారు. దళిత సంఘాలు రంగంలోకి దిగడంతో తప్పనిసరి పరిస్థితుల్లో పోలీసులు కేసు నమోదు చేశారు.

ప్రేమ పేరుతో మోసం..ఆత్మహత్య..

ఇటీవల నగరానికి చెందిన ఒక దళిత యువతి ఆత్మహత్య చేసుకోవడం కలకలం సృష్టించింది. ఎంటెక్‌ చదువుకున్న బాలిక నగరానికి చెందిన మరో యువకుడిని ప్రేమించింది. పెళ్లి చేసుకుంటానని నమ్మించిన సదరు యువకుడు ఆమెను లోబరుచుకున్నాడు. చివరకు పెళ్లి చేసుకోమని అడగడంతో నీ కులం వేరు మా కులం వేరు అంటూ మొహం చాటేశాడు. యువకుడి ఇంటికి వెళ్లిన యువతిని నెట్టివేయడంతో మనస్తాపం చెందిన యువతి ఆత్మహత్య చేసుకొని మరణించింది. ఈ ఘటనలోనూ యువకుడి అధికార పార్టీ నాయకుల ఒత్తిడి మేరకు అరెస్టు చేయడం లేదని దళిత సంఘాల నాయకులు ఆందోళన నిర్వహించారు.

ఆగని బాలికలు, మహిళలు మిస్సింగ్‌లు...

జిల్లాలో బాలికలు, మహిళల మిస్సింగులు కొనసాగుతూనే ఉన్నాయి. పోలీసు రికార్డుల ప్రకారమే గత ఏడాది కాలంలో 136 మంది బాలికలు, 264 మంది మహిళలు మిస్సింగ్‌ అయ్యారు. అయితే పోలీసుల అప్రమత్తత కారణంగా ఈ కేసుల్లో 90 శాతానికి పైగా ట్రేస్‌ చేశారు. అయినా కొంతమంది బాలికలు ప్రాణాలు కోల్పోయారు. 2024 జూన్‌లో మద్దిపాడు మండలం దొడ్డవరప్పాడు గ్రామ శివారులోని కపిల్‌ లేఔట్‌ వద్ద సింగరాయకొండకు చెందిన 14 ఏళ్ల బాలిక హత్యకు గురైంది. తొలుత ఈ బాలిక మిస్సింగ్‌ అయినట్లు కుటుంబ సభ్యులు భావించారు. పోస్టుమార్టం రిపోర్టులో అత్యాచారం చేసి హతమార్చినట్లు నివేదిక రావడంతో పోలీసులు విచారణ కొనసాగించారు. ఏడాదిన్నర తరువాత 2025 డిసెంబర్‌ 31న నిందితులను అరెస్టు చేశారు. ఈ ఏడాదిన్నర కాలంలో బాలిక కుటుంబ సభ్యులు నరకం అనుభవించారు.

మహిళలపై అకృత్యాలకు సంబంధించి గత రెండేళ్లలో నమోదైన కేసులు: 1564 బాలికల మీద లైంగికదాడుల కేసులు: 177

మహిళలు, బాలికలపై దాడులు పెరగడం ఆందోళనకరం

రాష్ట్రంలో ఇటీవల కాలంలో మహిళలు, బాలికల మీద అత్యాచారాలు, దాడులు విపరీతంగా పెరిగిపోయాయి. విద్యాబుద్దులు చెప్పాల్సిన ఉపాధ్యాయులు సైతం బాలికలపై లైంగిక దాడులకు పాల్పడడం ఆందోళన కలిగిస్తోంది. చివరికి పాఠశాలల్లో కూడా బాలికలకు రక్షణ లేకపోతే పరిస్థితి ఏంటి? గ్రామగ్రామానికి మద్యం అందుబాటులోకి రావడంతో మహిళలపై హింస కూడా పెరిగింది. గృహహింస గురించి ఎంత తక్కువగా చెప్పుకుంటే అంతమంచిదన్నట్లుగా తయారైంది. మహిళల సాధికారిత గురించి గొప్పలు చెప్పే ప్రభుత్వం మహిళ రక్షణ గురించి నోరుమెదపడం లేదు.

– ఎం.విజయ, మహిళా సమాఖ్య జిల్లా అధ్యక్షురాలు

మద్య నిషేధం చేయడం ఒక పరిష్కారం

ఇటీవల కాలంలో మద్యం తాగడం ఎక్కువైపోయింది. ప్రభుత్వం టార్గెట్‌ విధించి మరీ తాగిస్తున్నారు. గ్రామాల్లో బెల్ట్‌ షాపులు వచ్చాయి. రాష్ట్రంలో మద్యం ఏరులై పారుతోంది. చిన్నపిల్లలు సైతం మద్యం తాగుతున్నారు. దీంతో పాటుగా అశ్లీల చిత్రాల ప్రసారం మితిమీరింది. మద్యపానాన్ని నిషేధించాలి. విష సంస్కృతిని కట్టడి చేయకుండా మహిళలపై హింసను అరికట్టడం అసాధ్యం. ప్రభుత్వం విడుదల చేసిన గణాంకాలను చూస్తే ఆందోళన కలుగుతోంది. ప్రభుత్వాలు మహిళలకు వ్యతిరేకంగా జరుగుతున్న హింసను సీరియస్‌గా తీసుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది.

– బి.పద్మ, పీఓడబ్ల్యూ రాష్ట్ర కార్యదర్శి

నారీ విలాపం1
1/2

నారీ విలాపం

నారీ విలాపం2
2/2

నారీ విలాపం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement