అంధుల్లో ఆత్మవిశ్వాసం నింపిన బ్రెయిలీ
ఒంగోలు వన్‌టౌన్: అంధులకు అక్షర జ్ఞానం ప్రసాదించి, ఆత్మవిశ్వాసం నింపిన మహనీయుడు బ్రెయిలీ అని రాష్ట్ర సాంఘిక, దివ్యాంగుల సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా బాల వీరాంజనేయ స్వామి అన్నారు. లూయిస్ బ్రెయిలీ 217వ జయంతి సందర్భంగా ఆదివారం కలెక్టరేట్‌లో నిర్వహించిన రాష్ట్ర స్థాయి వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ బాపట్లలో ప్రస్తుతం ఉన్న ప్రభుత్వ పాఠశాల, జూనియర్ కాలేజీతో పాటు వినికిడి లోపం ఉన్న విద్యార్థుల కోసం ప్రత్యేక డిగ్రీ కాలేజీ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. వయోవృద్ధుల సంక్షేమశాఖ డైరెక్టర్ రవి ప్రకాష్ రెడ్డి, దివ్యాంగులు, వయోవృద్ధుల సంక్షేమ సంస్థ చైర్‌మన్ గుడిపూటి నారాయణస్వామి మాట్లాడుతూ దివ్యాంగుల కోసం ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేసేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. డీఆర్‌ఓ బి.చిన ఓబులేసు మాట్లాడుతూ దివ్యాంగులకు సింగిల్ రేషన్ కార్డు జారీ చేసేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక పంపించామన్నారు. దివ్యాంగుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో 8 మంది విద్యార్థులకు మంత్రి చేతుల మీదుగా ల్యాప్ టాప్‌లు పంపిణీ చేశారు. దివ్యాంగ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో రూపొందించిన క్యాలెండరును ఆవిష్కరించారు. తొలుత కలెక్టరేట్ వద్ద ఉన్న బ్రెయిలీ విగ్రహానికి పూలమాలలు వేశారు. కార్యక్రమంలో విజువల్లి ఛాలెంజ్డ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు జి.రవీంద్రబాబు, నేషనల్ ఫెడరేషన్ ఫర్ ది బ్లైండ్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.రామసుబ్బయ్య, విజువల్లి ఛాలెంజ్డ్ అన్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్.రతన్ రాజు, అర్జున్ అవార్డు గ్రహీత అజయ్ కుమార్ రెడ్డి, దివ్యాంగ ఉద్యోగుల ప్రకాశం జిల్లా అసోసియేషన్ ప్రతినిధులు, బాపట్ల జిల్లా అసోసియేషన్ ప్రతినిధులు, గుడ్ న్యూస్ బ్లైండ్ స్కూల్ విద్యార్థులు, సూర్య చారిటబుల్ ట్రస్ట్, ఇతర స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు కూడా పాల్గొని ప్రసంగించారు.


