9 నుంచి రావినూతలలో సంక్రాంతి కప్
మేదరమెట్ల: ఈనెల 9వ తేదీ నుంచి 16వ తేదీ వరకు కొరిశపాడు మండలంలోని రావినూతల స్పోర్ట్స్ అండ్ కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రావినూతల క్రికెట్ స్టేడియంలో 32వ అంతర్ రాష్ట్ర టీ 20 క్రికెట్ పోటీలు నిర్వహించనున్నట్లు అసోసియేషన్ ప్రెసిడెంట్ కారుసాల నాగేశ్వరరావు (బాబు) తెలిపారు. ఆర్‌ఎస్‌సీఏ స్టేడియంలో ఆదివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఈపోటీలు సంక్రాంతి కప్–2026 పేరుతో నిర్వహిస్తామన్నారు. నాకౌట్ పద్ధతిలో జరిగే పోటీలకు వివిధ రాష్ట్రాల నుంచి మొత్తం 16 జట్లు పాల్గొంటున్నట్లు తెలిపారు. 20–20 ఫార్మాట్‌లో పోటీలు జరుగుతాయని, ఈ పోటీల్లో గెలుపొందిన మొదటి జట్టుకు రూ.3 లక్షలు, రెండో జట్టుకు రూ.2 లక్షలు, మూడో జట్టుకు రూ.1 లక్ష నగదు బహుమతితో పాటు కప్‌లు అందచేయనున్నట్లు నాగేశ్వరరావు (బాబు) తెలిపారు. సినీనటుడు యర్రా రఘుబాబు మాట్లాడుతూ సంక్రాంతి పండగను పురస్కరించుకొని నిర్వహిస్తున్న ఈ క్రికెట్ పోటీలను ఆనందోత్సాహాలతో జరుపుకునేందుకు తాను ఇక్కడే అందుబాటులో ఉంటానన్నారు. అలాగే ఫైనల్స్‌కు ఓ ప్రముఖ వ్యక్తిని క్రికెట్ స్టేడియంకు తీసుకు వచ్చేందుకు ఆయన చేతుల మీదుగా సంక్రాంతి కప్‌ను విజేతకు అందచేయనున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో మోపర్తి వెంకట్రావు, పూనాటి వెంకట్రావు, అప్పారావు, బ్రహ్మానందం, నరసింహారావు, పూనాటి బసయ్య, రామినేని శ్రీను, చేబ్రోలు నాగేశ్వరరావు, జయంత్‌బాబు, వల్లెపు శ్రీకాంత్, బండారు రామాంజనేయులు, అసోసియేషన్ సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.


