ఎయిడెడ్ ఉపాధ్యాయులకు కౌన్సెలింగ్ నిర్వహించాలి
ఏపీ టీచర్స్ గిల్డ్ డిమాండ్
ఒంగోలు సిటీ: జీరో ఎన్‌రోల్‌మెంట్ ఉన్న ఎయిడెడ్ పాఠశాలల్లో పనిచేసే ఉపాధ్యాయులకు కౌన్సెలింగ్ నిర్వహించాలని ఏపీ టీచర్స్ గిల్డ్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కె.వెంకటరావు, సీహెచ్.ప్రభాకరరెడ్డి అన్నారు. ఒంగోలులోని ఆంధ్రప్రదేశ్ టీచర్స గిల్డ్ జిల్లా కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన ఎయిడెడ్ ఉపాధ్యాయుల సమావేశంలో పలు తీర్మానాలను చర్చించి కమిటీ ఏకగ్రీవంగా ఆమోదించింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎయిడెడ్ విద్యార్థులకు సంబంధించిన అన్ని రకాల మెటీరియల్స్‌ను సర్వశిక్ష అభియాన్ ప్రాజెక్టు డైరెక్టర్ కేటాయించాలన్నారు. ఎయిడెడ్ ఏకోపాధ్యాయ పాఠశాలలకు సీఆర్‌ఎంటీలను కేటాయించాలన్నారు. ఎయిడెడ్ పాఠశాలల్లో పని చేసే పీఈటీ పండిట్లకు పదోన్నతి సౌకర్యం కల్పించాలన్నారు. ఎయిడెడ్ కుటుంబ సభ్యులకు కలెక్టర్ పూల్‌లో జిల్లా యూనిట్ గా కారుణ్య నియామకాలు ఇవ్వాలన్నారు. పై సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరారు. సమావేశంలో ఏపీ టీచర్స్ గిల్డ్ నాయకులు వి.చిరంజీవి, బాదం రామకృష్ణారెడ్డి, జే.శివకుమార్, కమ్మా రమేష్, ఆంజనేయులు, తదితరులు పాల్గొన్నారు.


