1న ఎయిడెడ్ ఉపాధ్యాయుల సమావేశం
ఒంగోలు సిటీ: ఒంగోలులోని ముంగమూరులో ఏపీ టీచర్స్ గిల్డ్ జిల్లా కార్యాలయంలో జిల్లా కార్యవర్గ సమావేశం జవనరి 1వ తేదీన జిల్లా అధ్యక్షుడు కె.వెంకటరావు అధ్యక్షతన నిర్వహించనున్నట్లు ఏపీ టీచర్స్ గిల్డ్ జిల్లా ప్రధాన కార్యదర్శి సీహెచ్.ప్రభాకరరెడ్డి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. సమావేశంలో జిల్లాలో ఎయిడెడ్ ఉపాధ్యాయులు దీర్ఘకాలికంగా ఎదురుచూస్తున్న సమస్యల పరిష్కారంపై చర్చిస్తారన్నారు. ఎయిడెడ్ ఉపాధ్యాయుల హెల్త్ కార్డులు, ఎయిడెడ్ కుటుంబ సభ్యులకు కారుణ్య నియామకాలు, ఎయిడెడ్ పాఠశాలల్లో పని చేసే పండిట్లు, పీఈటీలకు పదోన్నతి, సర్ ప్లస్ ఎయిడెడ్ ఉపాధ్యాయుల కౌన్సెలింగ్, ఎయిడెడ్ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ప్రభుత్వ విద్యార్థులతో సమానంగా అన్ని రకాల వసతులు కల్పించాలనే అంశాలకు సంబంధించి చర్చిస్తారని తెలిపారు. సమస్యలపై జిల్లా కార్యవర్గం సమావేశంలో అన్ని డివిజన్‌ల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పాల్గొనాలని కోరారు.
ఒంగోలు సిటీ: చట్టాలు ఎంత కఠినంగా ఉన్నా బాల్యవివాహాల వల్ల కలిగే నష్టాలను క్షేత్రస్థాయిలో అవగాహన కలగజేయడం ద్వారా మాత్రమే నిర్మూలించగలమని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ న్యాయమూర్తి షేక్ ఇబ్రహీం షరీఫ్ అన్నారు. ఒంగోలు పట్టణంలోని బొమ్మరిల్లు స్వచ్ఛంద సేవా సంస్థలో శనివారం నిర్వహించిన కార్యక్రమంలో న్యాయమూర్తి షేక్ ఇబ్రహీం షరీఫ్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ సూచనల మేరకు నిర్వహిస్తున్న 100 రోజుల కార్యక్రమంలో భాగంగా జిల్లా వ్యాప్తంగా అన్ని మండల న్యాయ సేవాధికారి కమిటీల జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ద్వారా అవగాహన కలుగజేస్తున్నామన్నారు. బాల్య వివాహాలు ప్రకాశం జిల్లాలోని ఎక్కువగా జరగటం విచారించదగిన పరిణామం అని, వీటిని నిర్మూలించడానికి ప్రభుత్వ రంగంలోని అన్ని సంస్థలు సమన్వయంతో ముందుకెళ్లాలని అన్నారు. బాల్యవివాహాలు చేసిన తల్లిదండ్రులు, మత పెద్దలు, వివాహానికి సహకరించిన బంధువులు ప్రతి ఒక్కరూ శిక్షార్హులని అన్నారు. కార్యక్రమంలో బొమ్మరిల్లు సంస్థ నిర్వాహకుడు ఖాసిం పాల్గొన్నారు.
ఒంగోలు సిటీ: ఇప్పటి వరకు స్కూల్ గ్రాంట్ల విషయంలో వెనుకబడిన పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ప్రిన్సిపాల్‌లు ఆ బిల్లులను త్వరితగతిన పూర్తి చేయాలని సమగ్ర శిక్ష ఏపీసీ దాసరి అనీల్‌కుమార్ ఆదేశించారు. సమగ్ర శిక్ష కార్యాలయంలో ప్రధానోపాధ్యాయులు, ప్రిన్సిపాల్స్ కు ఎస్‌ఎన్‌ఏ, స్పార్ష్ మీద శనివారం సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ఏపీసీ దాసరి అనీల్‌కుమార్ పాల్గొని మాట్లాడుతూ పాఠశాలల్లో ఏదైనా పనులు జరిగినప్పుడు వాటి బిల్లులను ఏకీకృత వ్యవస్థ ద్వారా ట్రెజరీ నుంచి సరాసరి వెండార్లకు ఎలా చెల్లించాలి, బిల్లులు ఎలా తయారు చేయాలి అనే విషయాన్ని వివరించారు. కార్యక్రమంలో ఏడీ శ్రీనివాసరెడ్డి, ఏఎంఓ పి.నాగేంద్రనాయక్, సమగ్రశిక్ష అధికారులు పాల్గొన్నారు.
1న ఎయిడెడ్ ఉపాధ్యాయుల సమావేశం


