రైలులో 11.5 కిలోల గంజాయి పట్టివేత
ఒంగోలు టౌన్: మళ్లీ మరోసారి భారీగా గంజాయి పట్టుబడింది. పోలీసుల కథనం ప్రకారం.. ఒడిశా నుంచి చైన్నె వెళ్తున్న బొకారో ఎక్స్‌ప్రెస్ రైలులో ప్రత్యేక పోలీసు బృందం చేసిన తనిఖీల్లో 11.5 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఈగిల్, టాస్క్‌ఫోర్స్, ఆర్‌పీఎఫ్, జీఆర్‌పీ పోలీసుల బృందం శనివారం రాత్రి ఒంగోలు నుంచి వెళ్తున్న బొకారో ఎక్స్‌ప్రెస్‌లో తనిఖీలు చేపట్టారు. రైలు బోగీలను అణువణువునా పరిశీలించారు. అనుమానితుల బ్యాగులను తనిఖీ చేశారు. ఒంగోలు–సింగరాయకొండ మధ్యలో నలుగురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. తనిఖీల్లో ప్రత్యేక పోలీసు బృందం ఎస్సైలు సుదర్శన్, శివరామయ్య, మధుసూదన్, ఏఎస్సై షేక్ మహబూబ్ బాషా పాల్గొన్నారు. జీఆర్పీ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
రాచర్ల: గుప్తనిధుల కోసం తవ్వకాలు జరపడం రాచర్ల మండలంలోని యడవల్లి గ్రామంలో శుక్రవారం రాత్రి చోటుచేసుకోగా, శనివారం వెలుగులోకి వచ్చింది. రాచర్ల మండలం యడవల్లి గ్రామంలోని పురాతనమైన ఉమామహేశ్వర శివాలయంలో నందీశ్వరుడి విగ్రహం చుట్టూ శుక్రవారం రాత్రి గుర్తుతెలియని దుండగులు గుప్త నిధుల కోసం తవ్వకాలు చేశారు. ఆలయంలో శబ్ధం రావడంతో చుట్టుపక్కల నివాసాల ప్రజలు వెళ్లడంతో గుర్తుతెలియని వ్యక్తులు సంఘటన స్థలం నుంచి పారిపోయారు. శనివారం ఉదయం ఆలయ అర్చకుడు కే కృష్ణమూర్తి ఆలయంలో దీపారాధన చేసేందుకు వెళ్లి నందీశ్వరుడి విగ్రహం వద్ద గుంతలు ఉండటాన్ని గమనించారు. గుప్తనిధుల కోసం నందీశ్వరుడి విగ్రహాన్ని పైకి తీసేందుకు ప్రయత్నించినట్లు గ్రామస్తులు తెలిపారు.
దర్శి: విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో స్థానిక పొదిలి రోడ్డులో శనివారం మోటారు సైకిల్ మెకానిక్ షాపు దగ్ధమై రూ.8 లక్షల ఆస్తి నష్టం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. బొద్దికూరపాడు గ్రామానికి చెందిన పులి వెంకట కోటిరెడ్డి మెకానిక్‌గా షాపు పెట్టుకుని మోటారు సైకిళ్లు రిపేరు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. రోజు మాదిరి సాయంత్రం దుకాణం మూసి వేసి ఇంటికి వెళ్లాడు. విద్యుత్ షార్ట్‌సర్క్యూట్ జరిగి దుకాణం నుంచి మంటలు వ్యాపించాయి. వ్యాపించిన కొద్ది సేపట్లోనే మంటలు పెద్దవి కావడంతో అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. ఫైర్ అధికారులు వచ్చి మంటలార్పే సమయానికి నష్టం జరిగిపోయిందని బాధితుడు వాపోయాడు. దుకాణం రిపేరు కోసం వచ్చిన 9 మోటారు సైకిళ్లు, రెండు ఈవీ బైక్‌లు దగ్ధమయ్యాయి. రిపేరు కోసం తెచ్చుకున్న సామగ్రి కూడా అగ్నికి ఆహుతైంది. మొత్తం సుమారు రూ.8 లక్షల వరకు ఆస్తి నష్టం జరిగిందని, ప్రభుత్వం తనను ఆదుకోవాలని బాధితుడు విజ్ఞప్తి చేస్తున్నాడు.
రైలులో 11.5 కిలోల గంజాయి పట్టివేత
రైలులో 11.5 కిలోల గంజాయి పట్టివేత


