ఎడ్ల పందేల స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే తాటిపర్తి
యర్రగొండపాలెం: సంక్రాంతి పండగను పురస్కరించుకొని ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ జాతీయ స్థాయి ఎడ్లపందేల పోటీలు నిర్వహించనున్నారు. ఈ మేరకు శనివారం స్థానిక పుల్లలచెరువు రోడ్డులోని పార్కు వద్ద ఉన్న స్థలాన్ని ఆయన పరిశీలించారు. పందేల కోసం వచ్చిన ఎడ్లు, వాటి యజమానులకు తగిన వసతులు కల్పించే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. పందేలు చూసేందుకు వచ్చే నియోజకవర్గ ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఉండేందుకు ముఖ్యంగా మహిళలకు ప్రత్యేక గ్యాలరీ ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఏపీతో పాటు ఇతర రాష్ట్రాలకు చెందిన ఎడ్లు పోటీల్లో పాల్గొనే విధంగా ఆయన చర్యలు తీసుకుంటున్నారు. ఎమ్మెల్యేతో పాటు నాయకులు ఏకుల ముసలారెడ్డి, కె.ఓబులరెడ్డి, వై.వెంకటేశ్వరరెడ్డి, సయ్యద్ జబీవుల్లా, ఆర్.అరుణాబాయి, పల్లె సరళ, పి.రాములు నాయక్ ఉన్నారు.


