రెవెన్యూలో భూ మాయ.!
కనిగిరి మండలంలోని కొన్ని పేచీల పంచాయితీల కారణంగా అధికారులు ఇక్కడ అడుగుపెట్టడానికి కూడా భయపడుతున్నారు. ఆయా పంచాయతీల్లో భూముల విలువలు పెరగడంతో పాటు కోట్ల విలువ చేసే భూములపై అక్రమాలు, ట్యాంపరింగ్‌లు, ఆన్‌లైన్ మోసాలు జరుగుతున్నాయి. వాటిలో అధికార పార్టీకి చెందిన నాయకులే రెండు వర్గాలుగా చీలి భూ వివాదాల్లో తెరవెనుక కీలకపాత్ర పోషిస్తున్నారు. దీంతో అధికారుల పరిస్థితి ముందు నుయ్యి.. వెనుక గొయ్యి అన్న చందాన మారింది. కూటమి ప్రభుత్వం వచ్చిన 17 నెలల నుంచి కొన్ని పంచాయితీలకు వీఆర్వోలు వెళ్లేందుకు ఇష్టపడటం లేదు. దీంతో కొన్ని పంచాయతీలకు సర్వేయర్లకు సైతం ఇన్‌చార్జి వీఆర్వో బాధ్యతలు అప్పగించారంటే పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు. మండలంలోని చల్లగిరిగిల్ల, పెరంగుడిపల్లి, శంఖవరం, చింతలపాలెం, బాలవెంకటాపురం, బల్లిపల్లి, పునుగోడు, పోలవరం, ఏరువారిపల్లి, గురువాజీపేట, తదితర పంచాయతీల్లోని ప్రజలు నిత్యం భూ సమస్యలు, వివాదాలతో తహసీల్దార్ కార్యాలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ప్రతి రోజు భూ సమస్యల అర్జీలతో ప్రజలు క్యూ కడుతున్నారు. ఏదిఏమైనా కనిగిరిలో నిత్యం భూ రగడ నడుస్తుండటంతో అధికారులు తలల పట్టుకుంటున్నారు.
కనిగిరి రూరల్: కనిగిరి రెవెన్యూ డివిజన్‌లో భూముల సమస్యలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. వివిధ రకాల భూ సమస్యలపై సుమారు 200కుపైగా ఫైళ్లు రెవెన్యూ శాఖలో పెండింగ్‌లో ఉన్నట్లు తెలిసింది. ఒకే భూమి కోసం, ఒకే సర్వే నంబర్లలోని పంపకాల కోసం, భూ భాగస్వామ్య పంపకాల్లో అక్రమాలు, ఒకరి భూమిని మరొకరి పేరుతో ఆన్‌లైన్ చేయడం, ఒకరి ప్లాటును మరొకరు ఆక్రమించడం, భూ రికార్డుల్లో పేర్ల మార్పు, పూర్వీకులు అమ్మకాలు జరిపారంటూ భూ అక్రమాలు.. ఇలా చెప్పుకుంటూపోతే.. ఒకే భూమికి సంబంధించి కనీసం ఇద్దరు ముగ్గురు చొప్పున రెవెన్యూ శాఖకు అర్జీలు పెట్టుకున్నారు. అయితే, అర్జీదారుల్లోని రెండు వర్గాలకు అధికార పార్టీ నేతలు వత్తాసు పలకడం.. ఆపై అధికారులను ఒత్తిడి చేయడం కారణంగా సమస్యలకు పరిష్కారం చూపడం కష్టమవుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక కనిగిరిలో ఇద్దరు తహసీల్దార్లు భూ సమస్యలపైనే సస్పెండ్ అయిన సంగతి తెలిసిందే. దీంతో కొత్తగా వచ్చిన అధికారులు భూ సమస్యల ఫైళ్లపై నిశిత పరిశీలన లేకుండా అడుగు ముందుకేస్తే.. ఏ సమస్యల్లో చిక్కుకుంటామోనని వెనకడుగు వేస్తున్నట్లు తెలుస్తోంది.
వేధిస్తున్న సిబ్బంది కొరత...
రెవెన్యూ డివిజన్ కేంద్రం, నియోజకవర్గ కేంద్రమైన కనిగిరిలో రెవెన్యూ అధికారుల కొరత వేధిస్తోంది. కారణాలు ఏమైనాగానీ.. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వీఆర్వోలు, ఇతర రెవెన్యూ సిబ్బంది ఎక్కువగా బదిలీలపై ఇతర ప్రాంతాలకు వెళ్లారు. కనిగిరి మండలంలో 40 రెవెన్యూ గ్రామాలు, 25 పంచాయతీలు, 20 సచివాలయాలు ఉండగా.. కేవలం 10 మంది మాత్రమే వీఆర్వోలు ఉన్నారు. పట్టణంలోని 20 వార్డులు, 12 సచివాలయాలకు కేవలం 7 మంది మాత్రమే రెవెన్యూ అధికారులు ఉన్నారు. దీంతో ఆయా సచివాలయాల పరిధిలో ఇన్‌చార్జిల పాలన సాగుతోంది. అలాగే తహసీల్దార్ ఆఫీసులోని డిప్యూటీ తహసీల్దార్, సీనియర్ అసిస్టెంట్, తదితర కీలక పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఒకరిద్దరు డిప్యుటేషన్‌పై ఆర్టీఓ ఆఫీసులో పనిచేస్తున్నారు. చిన్న చిన్న మండలాలకు సైతం రెవెన్యూ అధికారులు మెండుగా ఉన్నా.. నియోజకవర్గ కేంద్రమైన కనిగిరిలో మాత్రం రెవెన్యూ సిబ్బంది పోస్టులు ఖాళీగా ఉన్నాయంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు.
అమ్మో.. కనిగిరా.!
గత అనుభవాల దృష్ట్యా లేదా అధికార పార్టీలోని నేతల వర్గాల మితిమీరిన భూ దందాల ఒత్తిడి వలనా అనే కారణాలు ఏమైనాగానీ రెవెన్యూ అధికారులు మాత్రం కనిగిరి రావడానికి జంకుతున్నారు. చంద్రబాబు సర్కార్ వచ్చిన తర్వాత కొంత మంది రెవెన్యూ అధికారులకు కనిగిరి పోస్టింగ్ ఇచ్చినా జాయినై మళ్లీ వెళ్లిపోయిన సంఘటనలు లేకపోలేదు. అంతేగాకుండా ఉన్న వీఆర్వోల్లో కొందరు గత తహసీల్దార్ చేసిన అక్రమాల ఊభిలో చిక్కుకుని కలం కదపని దుస్థితి. తిలాపాపం తలా పిడికడు అన్న చందంగా గత తహసీల్దార్ చేసిన భూ అక్రమాల దందాలో కొందరి ప్రమేయం ఉన్నట్లు ప్రచారం ఉంది. ఆ అంశాల్లో ఇప్పటికే తహసీల్దార్ రవి సస్పెండ్ అయ్యారు. అందులో ప్రమేయం ఉన్న వీఆర్వోలపై కూడా వేటు తప్పదనే ప్రచారం ఉంది. అయితే ఈ అక్రమ తంతూ అంతా అధికార పార్టీ నేతలే తమ చేత చేయించి తిరిగి వారే తమను ఇబ్బందులు పెడుతున్నారనే విషయాన్ని వీఆర్వోలు ఆ సంఘ నేతల వద్దకు తీసుకెళ్లి చర్చించినట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో జిల్లాలోని రెవెన్యూ సిబ్బంది అంతా అమ్మో.. కనిగిరి పోస్టింగా.! అని ఇక్కడికి వచ్చేందుకు భయపడుతున్నారు. దీంతో ఖాళీలు కొనసాగుతున్నాయి.
గత తహసీల్దార్ హయాంలో జరిగిన
భూ అక్రమాలకు చెక్..?
అధికార పార్టీ అని భయపెట్టి కొంత.. భారీగా నగదు నజరానాలు ఇచ్చి మరికొంత.. ఇలా రెండు నెలల క్రితం వరకు అధికార పార్టీ నేతలు పోటీలుపడి మరీ రూ.కోట్ల విలువ చేసే భూ బదలాయింపులు, అక్రమ పీసీ సర్టిఫికెట్లు, ఆన్‌లైన్‌లో పేర్ల మార్పులు వంటి అనేక అక్రమాలకు పాల్పడ్డారు. దీనిపై విచారణ కోసం కలెక్టర్‌కు విస్తృతంగా ఫిర్యాదులు వెళ్లాయి. దీంతో వాటిపై విచారణ జరిపి అప్పటి తహసీల్దార్ రవిశంకర్‌ను సస్పెండ్ చేశారు. అతని హయాంలో జరిగిన సుమారు 32 భూ ఫైళ్లను జిల్లా అధికారుల లాగిన్‌లో పెండింగ్ పెట్టినట్లు విశ్వసనీయ సమాచారం. అంతేగాకుండా గత తహసీల్దార్ ఇచ్చిన కొన్ని పట్టాల పొజిషన్ సర్టిఫికెట్లను ఇప్పటికే రద్దు చేయగా.. బల్లిపల్లి, జగనన్న లే అవుట్ వద్ద కొందరు అధికార పార్టీ ద్వితీయ శ్రేణి నేతలకు గత తహసీల్దార్ ఇచ్చిన (పీసీ) సర్టిఫికెట్లు, భూ పట్టాలను కూడా రద్దు చేయనున్నట్లు తెలిసింది.
పేరుకుపోతున్న భూ సమస్యల ఫైళ్లు
కనిగిరి రెవెన్యూ డివిజన్‌లో 32 సచివాలయాలకు 17 మందే వీఆర్వోలు
భూ సమస్యలపై నిత్యం పంచాయితీలు
పెరిగిపోతున్న అధికార పార్టీ నేతల జోక్యం
సిబ్బంది కొరత సమస్యను కలెక్టర్‌కు విన్నవించాం
కనిగిరి తహసీల్దార్ కార్యాలయంలో సిబ్బంది కొరత ఉన్న విషయం వాస్తవమే. దీనిపై ఉన్నతాధికారులు, కలెక్టర్‌కు విన్నవించాం. మండలంలో వివిధ రకాల భూ సమస్యలకు సంబంధించి దాదాపు 150 వరకు అర్జీలు పెండింగ్‌లో ఉన్నాయి. ఒకే భూమికి సంబంధించి ముగ్గురు, నలుగురు అర్జీలు, భూ పంపకాల అర్జీలు, పూర్వీకుల హక్కుల వివాదాల అర్జీలు ఎక్కువగా వస్తున్నాయి. కొన్ని పంచాయతీల్లో భూముల రేట్లు పెరగడం వల్ల మధ్యవర్తులు భూ సమస్యకు ఆధ్యం పోస్తున్నారు. కొన్ని పంచాయతీల నుంచి రెగ్యులర్‌గా అర్జీలు వస్తున్నాయి. దీంతో ప్రతి అర్జీని నిశితంగా పరిశీలించాల్సిన పరిస్థితి. తగిన సిబ్బంది, వీఆర్వోలు లేకపోవడం వలల కొంత ఇబ్బంది కలుగుతోంది. గత తహసీల్దార్ చేసిన కొన్ని ఫైళ్లపై విచారణ జరిపి పెండింగ్‌లో పెట్టింది వాస్తవమే. అలాగే గతంలో ఇచ్చిన కొన్ని (పీసీ) పొజిషన్ సర్టిఫికెట్లను రద్దు చేశారు. మరికొన్ని చేసే అవకాశం ఉంది.
– నర్రా జయలక్ష్మి, తహసీల్దార్, కనిగిరి


