కేజీబీవీలో విద్యార్థినులతో వెట్టిచాకిరి
మార్కాపురం: తమ కుమార్తెలు చదువుకుని బాగుపడతారని తల్లిదండ్రులు కలలు కంటూ కస్తూరిబా గాంధీ బాలికా విద్యాలయాలు (కేజీబీవీలు)కు పంపితే.. అక్కడ వారితో వెట్టిచాకిరి చేయిస్తుండటంతో తీవ్రస్థాయిలో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తర్లుపాడు మండలంలోని కలుజువ్వలపాడు కేజీబీవీలో విద్యార్థినులు కొందరు గదులను శుభ్రం చేస్తూ, మరికొందరు చపాతీలు చేస్తున్న వీడియో ఈ నెల 22వ తేదీ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీన్ని చూసిన తల్లిదండ్రులు తమ బిడ్డలతో వెట్టిచాకిరి చేయించడాన్ని తట్టుకోలేక తీవ్రస్థాయిలో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కేజీబీవీలో 5, 6 తరగతులు చదువుతున్న విద్యార్థినులతో పాఠశాల ఉపాధ్యాయులు పనులు చేయిస్తున్నట్లు తెలుసుకుని తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. మార్కాపురం–పొదిలి హైవేలోని కలుజువ్వలపాడు రోడ్డు పక్కనే కేజీబీవీ ఉంది. తర్లుపాడు మండలంలోని వివిధ గ్రామాల నుంచి సుమారు 270 మంది విద్యార్థినులు ఇక్కడికి వచ్చి చదువుకుంటున్నారు. వారి తల్లిదండ్రులు ఎంతో నమ్మకంతో తమ పిల్లలు బాగా చదువుకుంటారని, వారి భవిష్యత్తు బాగుంటుందని పంపించారు. కానీ, అక్కడి సిబ్బంది తమ పిల్లలతో పనిచేయించడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. ఈ సంఘటనపై అధికారులు విచారణ జరిపి తమ పిల్లలకు చదువు మాత్రమే చెప్పించాలని, పని చేయించకుండా చూడాలని తల్లిదండ్రులు విజ్ఞప్తి చేస్తున్నారు.
కలుజువ్వలపాడు కేజీబీవీలో చపాతీలు చేయించిన ఉపాధ్యాయులు
సోషల్ మీడియాలో వీడియో వైరల్ కావడంతో తల్లిదండ్రుల ఆందోళన
కేజీబీవీలో విద్యార్థినులతో వెట్టిచాకిరి
కేజీబీవీలో విద్యార్థినులతో వెట్టిచాకిరి


