ప్రజల ప్రాణాలకు, రహదారి భద్రతకు అత్యంత కీలకమైన రవాణాశాఖ
రవాణా శాఖలో అక్రమాల మూమూళ్ల దందా నిబంధనలకు విరుద్ధంగా గ్రానైట్ ముడిరాళ్ల రవాణా 80 టన్నుల నుంచి 110 టన్నుల భారీ లోడుతో వెళుతున్న గ్రానైట్ ట్రాలీలు జిల్లాలో 400కు పైగా ట్రాలీలు, టారాస్‌లు నెలకు రూ.1.60 కోట్ల నుంచి రూ.2 కోట్ల వరకు నొక్కుడు ప్రభుత్వ ఖజానాకు భారీగా తూట్లు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా ఫలితం శూన్యం నిరంతరం నిఘా పెట్టామంటూ రవాణా శాఖ కమిషనర్‌కు బురిడీ
ఓవర్ లోడుతో వెళ్తున్న ట్రాలీ లారీ
సాక్షి ప్రతినిధి, ఒంగోలు:
ఉమ్మడి ప్రకాశం జిల్లాలో చీమకుర్తితో పాటు మార్టూరు, బల్లికురవ మండలాల్లో రకరకాల గ్రానైట్ క్వారీలు ఉన్నాయి. ఇక్కడ లభించే గ్రానైట్‌కు అంతర్జాతీయంగా మంచి డిమాండ్ ఉంది. దీంతో నిత్యం వందలాది వాహనాల్లో గ్రానైట్ బండలు తరలిపోతుంటాయి. దీంతో వాహనాన్ని బట్టి ఎన్ని టన్నులు రవాణా చేయాలో ప్రభుత్వం నిబంధనలు రూపొందించింది. అయితే అధికారులు, అధికార పార్టీ నాయకులు నిబంధనలు బేఖాతరు చేస్తూ ప్రభుత్వానికి రావాల్సిన రాయల్టీలు, ఇతర పన్నులు ఎగ్గొట్టి మరీ అక్రమ రవాణాకు పాల్పడుతున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. చీమకుర్తి మండలంలోని రామతీర్థం, మర్రిచెట్లపాలెం తదితర ప్రాంతాల నుంచి పొదిలి వైపు, మార్కాపురం వైపు, దర్శి వైపు, చీమకుర్తి నుంచి మార్టూరు నుంచి, బల్లికురవ నుంచి చైన్నె వైపునకు నిత్యం రవాణా అవుతోంది. దాదాపుగా 800 నుంచి 900 లారీల్లో కొన్ని కంకర, కొన్ని రామాయపట్నం పోర్టుకు రాళ్లు తోలే లారీలు, కొన్ని లారీల్లో గ్రానైట్ ముడి రాళ్లు తరలుతుంటాయి. ఇందులో టిప్పర్లు, టారాస్‌లు, ట్రాలీలు, కంటైనర్లు ఉంటాయి. అయితే ఈ లారీల్లో వేయాల్సిన బరువుకన్నా ఎక్కువ బరువుతో వెళ్తుంటాయి. ఉదాహరణకు 10 చక్రాల టిప్పరులో 25 టన్నులు వేయాల్సి ఉండగా 45 టన్నులు, 12 చక్రాల టారాస్ టిప్పరు 30 టన్నులు వేయాల్సి ఉండగా 55 టన్నులు వేసి తరలిస్తున్నారు. పైన తెలిపిన టిప్పర్లకు నిబంధనలకు విరుద్ధంగా టిప్పర్ బాడీలు 1 అడుగు పైకి పెంచి అంచులు కట్టించి మరీ రవాణా చేస్తున్నారు. ట్రాలీ లారీకి 52 టన్నులు వేయాల్సి ఉండగా దాదాపు 80 నుచి 110 టన్నులు అధిక బరువు వేసి గ్రానైట్ రాళ్లు తరలిస్తున్నారు.
నెలకు రూ.1.60 నుంచి రూ.2 కోట్లు నొక్కుడు:
గ్రానైట్ ముడిరాళ్ల రవాణాలో రవాణా శాఖ అధికారులు భారీగా ముడుపులు తీసుకుంటున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. గ్రానైట్ ముడి రాళ్లు రవాణా చేసే ట్రాలీలు, టారాస్‌ల నుంచి రవాణా శాఖ అధికారులు రూ.1.60 కోట్ల నుంచి రూ.2 కోట్ల వరకూ మెక్కేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. జిల్లాలో దాదాపు 400లకు పైగా ట్రాలీలు, టారాస్‌లు ముడి గ్రానైట్ రాళ్లను రవాణా చేస్తుంటాయి. ప్రభుత్వానికి కట్టాల్సిన రాయల్టీలు కట్టకపోయినా వీళ్లకు మాత్రం మామూళ్లు కట్టాల్సిందే మరీ. ఇక టిప్పర్ల పరిస్థితి మరీ దారుణం. వాళ్లకు అసలు నిబంధనలే వర్తించవు. ఎందుకంటే వాళ్ల వద్ద కూడా అధికారులు ఇష్టారీతిన మామూళ్లు పిండుతున్నారని సమాచారం.
ఓవర్ లోడుతో తరచూ ప్రమాదాలు:
నిత్యం చీమకుర్తి మండలం సంతనూతలపాడు మండలాల్లో రహదారులపై ఓవర్ లోడులతో వస్తున్న ట్రాలీలు, టారాస్‌లు, టిప్పర్ల కారంగా తరచూ ప్రమాదాలు సంభవిస్తూనే ఉన్నాయి. ఇటీవల చీమకుర్తి నుంచి ఒంగోలు వస్తున్న ఎకై ్సజ్ కానిస్టేబుల్ రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యాడు. అతనిని ఢీ కొన్న టిప్పర్ ఓవర్‌లోడుతో వస్తోంది. అయినా అధికారులు ఓవర్ లోడు ప్రస్తావన లేకుండా కేసు నమోదు చేసిన పోలీస్ అధికారులు నిబంధనలను ఉల్లంఘించారు. రవాణా శాఖ అధికారులు ఆ వాహనాన్ని పరిశీలించినా ఓవర్ లోడు ప్రస్తావన లేకుండా కేసును ముగించారు.
రవాణా శాఖ కమిషనర్‌ను కూడా బురిడీ కొట్టించిన అధికారులు:
ఓవర్ లోడుతో వెళ్తున్న వాహనాల గురించి చీమకుర్తి వాసులు రాష్ట్ర రవాణా శాఖ కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. దాంతో ఈ నెల 24 నుంచి 31 వరకూ ప్రత్యేకంగా మూడు షిఫ్టులతో చీమకుర్తి, మర్రిచెట్లపాలెం, ఒంగోలు కర్నూలు రోడ్డు వరకు, టంగుటూరు టోల్ ప్లాజా వద్ద ప్రత్యేకంగా తనిఖీలు చేస్తున్నామని కమిషనర్‌కు జిల్లా అధికారులు సమాచారం ఇచ్చారు. కానీ ఫిర్యాదు చేసిన వారిని మాత్రం ఏమారుస్తూ వస్తున్నారు. అయితే సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించే గ్రీవెన్స్‌లో ఈ ఏడాది జూన్ నెల నుంచి ఫిర్యాదు చేస్తూ వస్తున్నా రవాణా శాఖ అధికారులు పట్టించుకున్న దాఖలాలు కనిపించటంలేదు. ఓవర్‌లోడ్‌పై తనిఖీలు చేస్తున్నామని రవాణాశాఖ కమిషనర్‌కు మాత్రం నివేదికలు పంపిస్తుండడం గమనార్హం.
ఓవర్ లోడులపై చర్యలు తీసుకుంటున్నాం
గ్రానైట్ ఓవర్ లోడులపై నిరంతరం చర్యలు తీసుకుంటూనే ఉంటున్నాం. ఎక్కడికక్కడ బ్రేక్ ఇన్‌స్పెక్టర్లను రహదారులపై విజిలెన్స్ చేయిస్తున్నాం. నిఘాను ముమ్మరం చేశాం. ట్రాన్స్‌పోర్టు వాహన నిబంధనలను అతిక్రమిస్తే అలాంటి వాహనాలపై కేసులు నమోదు చేసి యజమానులకు, డ్రైవర్లకు కౌన్సెలింగ్ ఇస్తున్నాం. నెలవారీ మామూళ్లు అన్నదాంట్లో నిజం లేదు. అవన్నీ అపోహలు మాత్రమే. అలాంటివి ఏమైనా ఉంటే నా దృష్టికి తీసుకొస్తే ఆ అధికారులపై చర్యలు తీసుకుంటాను.
– ఆర్.సుశీల, డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్, ప్రకాశం జిల్లా
ప్రజల ప్రాణాలకు, రహదారి భద్రతకు అత్యంత కీలకమైన రవాణాశాఖ
ప్రజల ప్రాణాలకు, రహదారి భద్రతకు అత్యంత కీలకమైన రవాణాశాఖ
ప్రజల ప్రాణాలకు, రహదారి భద్రతకు అత్యంత కీలకమైన రవాణాశాఖ


