కేసులు ఎత్తేయించుకోవటానికే బాబు పొత్తులు
అప్పుల్లో రాష్ట్రాన్ని రికార్డు స్థాయికి తీసుకెళ్లిన చంద్రబాబు ప్రభుత్వం అమరావతిలో ఒలింపిక్స్ కాదు ఆవకాయ కార్యక్రమాలు పెట్టడమే ఆయన విజన్ నియోజకవర్గాల్లో లూఠీ చేస్తున్న కూటమి ఎమ్మెల్యేలు ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి తాటిపర్తి చంద్రశేఖర్
యర్రగొండపాలెం: కూటమి నాయకుడు చంద్రబాబు తనపై ఉన్న కేసులు ఎత్తేయించుకోవటానికే కేంద్రంతో పొత్తులు పెట్టుకున్నాడని ఎమ్మెల్యే, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి తాటిపర్తి చంద్రశేఖర్ విమర్శించారు. స్థానిక పార్టీ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సంపద సృష్టికర్త అని తనకు తాను కితాబు ఇచ్చుకునే చంద్రబాబు పాలనలో వ్యవస్థల పనితీరుపై రోజువారీగా కేంద్ర సంస్థలైన ఆర్‌బీఐ, కాగ్ ఇచ్చే నివేదికలు నిగూఢ సత్యాలను ప్రపంచానికి నివేదిస్తున్నాయని, రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలపై మోపుతున్న అప్పుల భారాన్ని తెలియజేస్తున్నాయన్నారు. అత్యంత ప్రమాదకర ఆర్ధిక లోటులోకి రాష్ట్రం నెట్టివేయబడుతుందనేది వాటి సారాంశమన్నారు. 8 నెలలకే ఈ ఆర్ధిక సంవత్సరానికి రెవెన్యూ లోటు 163 శాతానికి చేరటం చంద్రబాబు చేతకానితనానికి అద్దం పడుతోందన్నారు. కేవలం చంద్రబాబుపై ఉన్న కేసులు ఎత్తివేయించుకోవటానికే కేంద్రంతో పొత్తులు పెట్టుకున్నారని ఆయన విమర్శించారు. 40 ఏళ్ల అనుభవమని, విజన్ అని, కాగితాలపై కాకిలెక్కలు వేసే చంద్రబాబు ప్రభుత్వం ఏడాది మొత్తానికి ఎంతలోటు ఉంటుందనే అంచనావేయలేని అసమర్ధతలో ఉందని అన్నారు. బడ్జెట్‌లో చూపించిన ఆదాయ లోటు సంవత్సరానికి రూ.33 వేల కోట్లని అంచనావేస్తే ఇది నవంబర్ నాటికే రూ.54 వేల కోట్లు దాటిపోవడం చూస్తే వాళ్ల ప్రభుత్వ పనితీరు ఏమిటో తెలుస్తుందన్నారు. ఉదాహరణకు కేంద్రం నుంచి రావాల్సిన ఆదాయం రూ.2.17 లక్షల కోట్ల అంచనా వేయగా వచ్చింది మాత్రం రూ.1.5 లక్షల కోట్లు మాత్రమేనని అన్నారు. గ్రాంట్ల రూపంలో కేంద్రం నుంచి రూ.32,284 కోట్లు వస్తాయని అంచనా వేస్తే రూ.7,693 కోట్లు వచ్చాయన్నారు. వీళ్లు చెప్పే డబుల్ ఇంజన్ సర్కార్ ఈ రాష్ట్రంలో నడుస్తోందని, నూతనంగా బీజేపీ నాయకుల విగ్రహాలు ప్రతిష్టించే రాజకీయం తప్ప రాష్ట్ర ప్రగతికి కాదని అన్నారు.
ఆవకాయ కార్యక్రమాలే బాబు విజన్:
అప్పుల్లో ఆల్‌టైం రికార్డులు పెడుతున్న బాబు ప్రభుత్వం అమరావతిలో ఒలింపిక్ గేమ్స్ పెడతామని హామీ ఇచ్చి ఇప్పుడు ఆవకాయ కార్యక్రమాలు పెట్టడమే వారి విజన్ అని తాటిపర్తి విమర్శించారు. విలువైన ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ అద్దె భవనాలకు, విహార యాత్రలకు, హైదరాబాద్‌కు వెళ్లేందుకు విమానాలకు, హెలికాప్టర్లకు ఖర్చు చేస్తోందని ఆయన దుయ్యబట్టారు. ఉర్సా, లూలూ లాంటి లూఠీ కంపెనీలకు అత్యంత విలువైన భూములను కట్టపెడుతూ తన ఖజానాను నింపుకుంటున్న చంద్రబాబు.. ప్రభుత్వ ఖజానాను ఎప్పుడు నింపుతాడో సమాధానం చెప్పాలని ప్రశ్నించారు. నియోజకవర్గాల్లో లూఠీ చేస్తున్న తమ కూటమి ఎమ్మెల్యేలను నిలువరించలేక ఆ అక్రమాలను ఎత్తి చూపుతున్న వైఎస్సార్ సీపీ నాయకులపై కేసులు పెట్టడంతప్ప రాష్ట్రంలో జరుగుతుంది ఏమీలేదని మండిపడ్డారు. ఉపాధి కూలీల తొలగింపులో 20 లక్షలకు పైగా కార్డులు తొలగించిన రాష్ట్రంగా దేశంలో పేరు తీసుకొని వచ్చారని ఆయన వ్యంగ్యంగా అన్నారు. సమావేశంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు ఒంగోలు మూర్తిరెడ్డి, జెడ్పీటీసీ చేదూరి విజయభాస్కర్, పార్టీ మండల కన్వీనర్ ఏకుల ముసలారెడ్డి, వివిధ విభాగాల నాయకులు కె.ఓబులరెడ్డి, సయ్యద్ జబీవుల్లా, ఎం.బాలగురవయ్య, వై.వెంకటేశ్వరరెడ్డి, పెద్దకాపు వెంకటరెడ్డి, ఆర్.అరుణాబాయి, సరళ, శార, పి.రాములు నాయక్, సురేష్ నాయక్, హరినాయక్ పాల్గొన్నారు.


