అక్రమ మట్టి తవ్వకాలపై నిఘా పెడతాం
మార్కాపురం టౌన్: మార్కాపురం పట్టణంలో రాత్రి వేళల్లో మట్టిని అక్రమంగా తవ్వి తరలిస్తున్న వారిపై గట్టి నిఘా పెడతామని డివిజినల్ గనులు, భూగర్భశాఖ అధికారి డి.రవిప్రసాద్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 26న ‘సాక్షి’ దినపత్రికలో ‘‘రెచ్చిపోతున్న మట్టి మాఫియా’’ అనే శీర్షికన జిల్లా పేజీలో వార్త ప్రచురితమైంది. దీనిపై స్పందించిన రవిప్రసాద్ రెవెన్యూ, ఇరిగేషన్, దేవదాయ, గనులు, విజిలెన్స్ శాఖలతో సంయుక్తంగా తనిఖీలు జరిపి అక్రమంగా మట్టి తవ్వకాలు చేస్తున్న వారిపై తగు చర్యలు తీసుకుంటామని తెలిపారు. చిన్న తరహా ఖనిజాల అక్రమ తవ్వకాలను, రవాణాను అరికట్టేందుకు, సీనరేజ్ వసూలుకు ప్రభుత్వం ఏఎంఆర్ అనే ప్రైవేటు ఏజెన్సీకి రెండు సంవత్సరాలకు అనుమతి ఇచ్చిందన్నారు. సంస్థ సిబ్బంది కూడా అక్రమ తవ్వకాలు, రవాణాపై సంయుక్తంగా నిఘా పెట్టి అనుమతులు లేని వాహనాలపై తగు చర్యలు తీసుకుంటారని తెలిపారు. రోడ్డుపై పడిన మట్టిని వాటర్ ట్యాంక్‌ల ద్వారా శుభ్రం చేయించి వాహనదారులకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటామన్నారు.
ఒంగోలు: రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొనే జిల్లా ఫెన్సింగ్ క్రీడాకారుల ఎన్‌రోల్‌మెంట్, ఎంపిక ఈనెల 28న స్థానిక ఏబీఎం డిగ్రీ కాలేజీ ఆవరణలో నిర్వహిస్తున్నట్లు ప్రకాశం జిల్లా ఫెన్సింగ్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి జి.నవీన్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. 2006 జనవరి 1వ తేదీ నుంచి 2012 డిసెంబర్ 31వ తేదీ మధ్య జన్మించిన వారు మాత్రమే ఎంపికకు అర్హులు. ఆసక్తిగల వారు ఫెన్సింగ్ అసోసియేషన్ జారీ చేసిన గుర్తింపు కార్డు, ఆధార్‌కార్డు, వయస్సు ధ్రువీకరణ పత్రం, సొంత ఫెన్సింగ్ కిట్‌తో ఎంపిక ప్రదేశానికి ఉదయం 8 గంటలకు హాజరుకావాలన్నారు. ఎంపికై న వారు త్వరలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురంలో జరిగే రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొనాల్సి ఉంటుంది. పూర్తి వివరాలకు సెల్ నంబర్లు 8978905694 లేదా 9951170382లను సంప్రదించాలని జిల్లా కార్యదర్శి జి.నవీన్ పేర్కొన్నారు.
ఒంగోలు సబర్బన్: ఎస్‌సీ, ఎస్‌టీ పారిశ్రామికవేత్తలకు ఏపీఐఐసీ పారిశ్రామికవాడల్లో జీఓ ఎంఎస్ నంబర్–7 ద్వారా రీ ఎలాట్‌మెంట్ చేయటానికి ప్రభుత్వం ఆఖరి అవకాశం కల్పించిందని ఏపీఐఐసీ జిల్లా జోనల్ మేనేజర్ పి.మదన్ మోహన్ తెలిపారు. ఈ మేరకు ఆయన శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఏపీఐఐసీ అభివృద్ధి పరిచిన పారిశ్రామిక వాడల్లో గతంలో ప్లాట్లు పొంది రద్దయిన ఎస్‌సీ, ఎస్‌టీ పారిశ్రామికవేత్తలకు మళ్లీ కేటాయించేందుకు మరో అవకాశం కల్పించారన్నారు. ఆమేరకు రీ–ఎలాట్‌మెంట్ లెటర్లు జారీ చేశామని చెప్పారు. ఎస్‌సీ, ఎస్‌టీ పారిశ్రామికవేత్తలకు ఆఖరి అవకాశంగా దీనిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఇతర వివరాల కోసం ఒంగోలు సంతపేటలోని ఏపీఐఐసీ జోనల్ ఆఫీసులో సంప్రదించవచ్చన్నారు.
ఒంగోలు సిటీ: సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో జిల్లా స్థాయి కెరియర్ ఫెస్ట్ కం ఎగ్జిబిషన్ ను శనివారం ఒంగోలులోని సెయింట్ జీవియర్స్ స్కూల్‌లో నిర్వహిస్తున్నట్లు సమగ్ర శిక్ష అడిషనల్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ దాసరి అనిల్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా ఏపీఓ అనీల్‌కుమార్ మాట్లాడుతూ ఈ కార్యక్రమాల వల్ల విద్యార్థులకు కెరియర్, వృత్తి విద్యల పట్ల పూర్తి స్థాయిలో అవగాహన కలుగుతుందన్నారు. ఇటువంటి కార్యక్రమాలు పిల్లలకు అవసరమైన ఆలోచనా ధోరణిని పెంపొందిస్తాయన్నారు.


