పేదలకు అండ..సీపీఐ జెండా
సీపీఐ జిల్లా కార్యదర్శి ఎంఎల్ నారాయణ
ఒంగోలు టౌన్: దేశ స్వాతంత్య్ర పోరాటంలో కీలకపాత్ర పోషించి, బ్రిటీష్ ముష్కరులను దేశం నుంచి తరిమికొట్టిన చరిత్ర కలిగిన సీపీఐ నేటికీ ఆ పోరాట స్ఫూర్తిని కొనసాగిస్తోందని సీపీఐ జిల్లా కార్యదర్శి ఎంఎల్ నారాయణ అన్నారు. సీపీఐ వందేళ్ల ముగింపు వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఆ పార్టీ జిల్లా కార్యాలయంతో పాటుగా నెల్లూరు బస్టాండు సెంటర్, అద్దంకి బస్టాండు సెంటర్, ఆర్టీసీ బస్టాండు, దత్తాత్రేయ కాలనీల్లో ఎర్రజెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎంఎల్ నారాయణ మాట్లాడుతూ దేశ స్వాతంత్య్రానికి పూర్వం పురుడు పోసుకొన్న సీపీఐ అధికార రాజకీయాలతో సంబంధం లేకుండా ప్రజల పక్షాన నిలబడి పోరాడుతోందని చెప్పారు. స్వతంత్ర ఫలాలు అందరికీ సమానంగా దక్కాలన్న నినాదంతో అనేక పోరాటాలు చేసిందని, మరెన్నో త్యాగాలు చేసిందని తెలిపారు. దున్నే వాడికే భూమి నినాదంతో భూపోరాటాలు నిర్వహించి లక్షలాది మంది పేదలకు భూములను పంపిణీ చేసిందన్నారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు నినాదంతో చేసిన పోరాటం దేశ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయిందని చెప్పారు. కార్మిక చట్టాలు, మహిళల రక్షణ చట్టాలు, రైతులకు గిట్టుబాటు ధర, వ్యవసాయ కార్మికులకు ఉపాధి హామీ చట్టం, వృద్ధులకు పింఛన్ల కోసం అలుపెరుగని పోరాటాలు చేసిందని, ఆ పోరాటాల ఫలితంగా ప్రజలకు అనేక సంక్షేమ పథకాలను ప్రభుత్వాలు అమలు చేశాయన్నారు. సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి ఆర్.వెంకటరావు మాట్లాడుతూ దేశ స్వాతంత్య్ర పోరాటంలో ఎలాంటి పాత్ర పోషించని బీజేపీ నేడు దేశాన్ని పాలిస్తోందని చెప్పారు. దేశ సంపదను అంబానీ, అదానీలకు దోచిపెట్టడమే పరిపాలనగా ముందడుగులు వేస్తోందని ధ్వజమెత్తారు. ఇన్సాఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎంఏ సాలార్ మాట్లాడుతూ దేశంలోని మైనారిటీ ముస్లింలు, దళితులకు ఎర్రజెండా నీడలోనే రక్షణ, గౌరవం ఉంటుందని చెప్పారు. బీజేపీ మతోన్మాద పాలనను తిప్పికొట్టేందుకు సీపీఐతో కలిసి నడవాలని పిలుపునిచ్చారు. సీనియర్ నాయకులు కారుమూడి నాగేశ్వరరావు, కందుకూరి సుబాన్ నాయుడు, కె.నాగేశ్వరరావు, లక్ష్మయ్య వివిధ ప్రాంతాల్లో జెండా ఆవిష్కరించారు. కార్యక్రమంలో శ్రీరాం శ్రీనివాసరావు, కొత్తకోట వెంకటేశ్వర్లు, నల్లూరి మురళి, ఎస్డీ సర్దార్, ముత్తన అంజయ్య, ఉప్పుటూరి ప్రకాశ్, జి.పిచ్చయ్య, కై లా అజయ్, మధు, రమేష్, సిహెచ్ వెంకటేశ్వర్లు, వెంకటరాావు, సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.


