పట్టు కోసం పచ్చకుట్రలు.!
39 నూతన పంచాయతీల
కోసం ప్రతిపాదనలు...
పశ్చిమాన 39 నూతన పంచాయతీల కోసం ప్రతిపాదనలు
మార్కాపురం:
స్థానిక సంస్థల ఎన్నికలను లక్ష్యంగా చేసుకుని పశ్చిమ ప్రకాశంలోని పలు గ్రామాలు, పంచాయతీల్లో పట్టు సాధించేందుకు టీడీపీ నాయకులు కుట్రలకు తెగబడుతున్నారు. గత పంచాయతీ ఎన్నికల్లో మార్కాపురం డివిజన్‌లోని 229 గ్రామ పంచాయతీల్లో 90 శాతానికిపైగా వైఎస్సార్ సీపీ కై వసం చేసుకుంది. వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్ సీపీని దెబ్బతీసేందుకు కూటమి నాయకులు కుట్రలకు తెరతీస్తున్నారు. వైఎస్సార్ సీపీకి పట్టున్న గ్రామాలను విడదీస్తే.. వచ్చే పంచాయతీ ఎన్నికల్లో విజయం సాధించవచ్చనే ఉద్దేశంతో పావులు కదుపుతున్నారు. వైఎస్సార్ సీపీకి పట్టున్న గ్రామాలను విడదీయాలనే ఆలోచనలతో స్థానిక కూటమి నాయకులు, కార్యకర్తలు కొత్త పంచాయతీలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. అయితే, ఇప్పటికీ పల్లెల్లో వైఎస్సార్ సీపీ హవానే కొనసాగుతోంది. ఇదే హవా వచ్చే ఎన్నికల్లో కూడా కొనసాగితే తమ గెలుపు కష్టమనే ఆలోచనతో కూటమి నేతలు ఇప్పటి నుంచే కుట్రలు కొనసాగిస్తున్నారు.
మార్కాపురం, యర్రగొండపాలెం, గిద్దలూరు నియోజకవర్గాల్లో 39 నూతన పంచాయతీల కోసం స్థానిక ప్రజాప్రతినిధులు అధికారుల ద్వారా జిల్లా అధికారులకు ప్రతిపాదనలు పంపారు. జిల్లా వ్యాప్తంగా సుమారు 83 నూతన పంచాయతీల ఏర్పాటుకు ప్రతిపాదనలు రాగా, అందులో పశ్చిమ ప్రకాశం నుంచే ఎక్కువ సంఖ్యలో ప్రతిపాదనలు వెళ్లినట్టు తెలిసింది. పుల్లలచెరువులో 9, గిద్దలూరులో 5, యర్రగొండపాలెం 5, దోర్నాల 3, పెద్దారవీడు 2, మార్కాపురం 5, తర్లుపాడు 3, బేస్తవారిపేట 2 తదితర మండలాల్లో నూతన పంచాయతీల కోసం ప్రతిపాదనలు వెళ్లాయి. ఇందులో మార్కాపురం మండలంలోని చింతగుంట్ల, రాయవరం, గజ్జలకొండ, తిప్పాయిపాలెం, భూపతిపల్లి పంచాయతీల్లోని పలు గ్రామాల్లో కొత్త పంచాయతీలను ఏర్పాటు చేయాలని ప్రతిపాదనలు వెళ్లాయి. ఇందులో బిరుదుల నరవ, రైల్వేస్టేషన్, తూర్పుపల్లె, బొడిచర్ల తదితర గ్రామాలను పంచాయతీలుగా ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనలు వెళ్లాయి. తర్లుపాడులో కలుజువ్వలపాడు, మీర్జపేట, కేతగుడిపి పంచాయతీల్లో, బేస్తవారిపేటలో నేకునాంబాద్, జేసీ అగ్రహారం పంచాయతీల్లో, గిద్దలూరులో కేఎస్ పల్లి పంచాయతీల్లో ఉన్న గ్రామాల్లో నూతన పంచాయతీలను ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనలు వెళ్లాయి. కాగా, అధికార టీడీపీ నాయకులు తమ పట్టు కోసం నూతన పంచాయతీల ప్రతిపాదనలు పంపినట్లు తెలుస్తో్‌ంది. వైఎస్సార్ సీపీకి పట్టున్న గ్రామాలను విడదీస్తే తమకు ప్రయోజనకరంగా ఉంటుందని భావిస్తూ ఈ ప్రతిపాదనలు పంపడంపై తీవ్రస్థాయిలో విమర్శలు వినిపిస్తున్నాయి.
పశ్చిమాన ఇప్పటికే 229 పంచాయతీలు
గత పంచాయతీ ఎన్నికల్లో 90 శాతం
వైఎస్సార్ సీపీదే హవా
స్థానిక సంస్థల ఎన్నికల్లో పంచాయతీలపై పట్టు కోసం గ్రామాలను విడదీస్తున్న టీడీపీ నేతలు


