పర్యాటకరంగ అభివృద్ధికి కృషి
చీరాల టౌన్: బాపట్ల జిల్లాలో తీరప్రాంతం, పర్యాటకరంగం వృద్ధి చెందేందుకు ప్రణాళికాబద్ధంగా కృషి చేస్తున్నామని ఆ జిల్లా కలెక్టర్ వినోద్‌కుమార్ తెలిపారు. శుక్రవారం చీరాల మండలంలోని వాడరేవు, రామాపురం సముద్ర తీర ప్రాంతాలను, నిర్మాణం ఆగిన రెవెన్యూ అతిథి గృహాన్ని కలెక్టర్ పరిశీలించారు. తీరప్రాంతంలో జిల్లాకు ప్రత్యేక గుర్తింపు ఉందని, పర్యాటకులను విశేషంగా ఆకర్షించే వాడరేవు, రామాపురం గ్రామాల్లో పర్యాటకరంగంలో దూసుకెళ్లేందుకు అనువైన ప్రణాళికలు రచించామని అన్నారు. ఫేజ్–1, ఫేజ్–2 ద్వారా సముద్ర తీరప్రాంతాల అభివృద్ధికి మాస్టర్ ప్లాన్‌లు రూపొందించినట్లు తెలిపారు. వాడరేవు, రామాపురం ప్రాంతాలకు ఆంఽధ్ర రాష్ట్రంలోని పలు ప్రాంతాలు, జిల్లాలతో పాటు తెలంగాణ, మహారాష్ట్ర, తదితర రాష్ట్రాలకు చెందిన పర్యాటకులు విశేషంగా వస్తున్నారని తెలిపారు. పర్యాటకుల కోసం అనుకూలమైన వసతులు, ఏర్పాట్లు, ఆహ్లాదకర ప్రదేశాలు తయారు చేయాలన్నారు. అధికారులు సమన్వయంతో పనిచేస్తే పర్యాటకరంగంలో జిల్లా అగ్రభాగాన నిలుస్తుందన్నారు. అనంతరం తీరప్రాంత గ్రామాల్లోని వసతులు, దెబ్బతిన్న రోడ్డు మార్గాలను కలెక్టర్ పరిశీలించి పలు సలహాలు, సూచనలు చేశారు. చీరాల, బాపట్ల ఆర్డీఓలు తూమాటి చంద్రశేఖరనాయుడు, గ్లోరియా, చీరాల, బాపట్ల తహసీల్దార్లు కె.గోపీకృష్ణ, షలీమా, సర్వేయర్ బసవాచారి, ఆర్‌ఐ శేఖర్, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.
బాపట్ల కలెక్టర్ వినోద్‌కుమార్


