పొదిలిలో పేట్రేగిపోయిన దొంగలు
పొదిలి: పట్టణంలో గురువారం రాత్రి దొంగలు చెలరేగిపోయారు. ఎవరూ లేని వారి గృహాలు, దుకాణాలతో పాటు ఓ ఏటీఎంలో చోరీకి విఫలయత్నం చేశారు. స్థానిక శ్రీవాసవీ కన్యకాపరమేశ్వరి అమ్మవారిశాల వద్ద ప్రధాన రహదారిలో ఉన్న ఎస్‌బీఐ ఏటీఎంను దొంగలు పగులగొట్టారు. అందులో ఉన్న డబ్బు తీసుకునేందుకు వీలుపడలేదు. అమ్మవారిశాల వీధిలోనే కొత్తా నాగరాజు గృహానికి తాళాలు పగులగొట్టి చోరీ చేశారు. రెండు ల్యాప్‌టాప్‌లు, ఒక మోటారు సైకిల్ దొంగతనానికి గురైంది. ఆ గృహ యజమానులు టూరుకు వెళ్లినట్లు బంధువులు తెలిపారు. పక్కనే ఉన్న హోల్‌సేల్ దుకాణం తాళాలు కూడా పగులగొట్టి సుమారు రూ.5 వేల నగదు చోరీ చేసినట్లు యజమానులు తెలిపారు. మరోవైపు మాయాబజార్లోని సురేష్ పెయింట్ షాపు తాళాలు కూడా పగులగొట్టారు. అయితే, ఇటీవల ఆ దుకాణాన్ని మరోచోటికి తరలించడంతో అక్కడేమీ చోరీ జరగలేదు. చోరీ జరిగిన ప్రదేశాలను సీఐ రాజేష్ కుమార్, ఎస్సై వేమన పరిశీలించారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ ఏటీఎంలో చోరీ చేసేందుకు దొంగలు ప్రయత్నం చేశారన్నారు. గృహాలు, దుకాణాల్లో చోరీ జరిగిందని తెలిపారు. క్లూస్ టీం ద్వారా ఆధారాలు సేకరించినట్లు చెప్పారు. త్వరలోనే దొంగలను పట్టుకుంటామని అన్నారు.


